నీటి వాటాలు నిర్ణయించజాలరు
► ఏకే బజాజ్ కమిటీకి స్పష్టం చేసిన తెలంగాణ
► ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, కృష్ణాకు తరలించే గోదావరి వాటా తేల్చాల్సింది ట్రిబ్యునల్ మాత్రమే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు నీటి వాటాలను ట్రిబ్యునల్ మాత్రమే తేల్చగలదని, కేంద్రం నియమిం చే కమిటీలు కాదని రాష్ట్ర ప్రభుత్వం ఏకే బజాజ్ కమిటీకి తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు ఎలా ఉండాలన్న దానిపై ట్రిబ్యునల్ విచారణ జరుగుతు న్నందున, ఈ విషయంలో కమిటీల జోక్యం అనవసరమంటూ కమిటీకి గురువారం లేఖ రాసినట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కృష్ణాబేసిన్ ప్రాజె క్టుల నిర్వహణ, నియంత్రణపై రాష్ట్రాభి ప్రాయాలు చెప్ప డంతో పాటు ట్రిబ్యునల్ పరిధిలో జరుగుతున్న విచారణ, ప్రస్తుతం అమలవుతున్న గుండుగుత్త కేటాయింపులు (ఎన్–బ్లాక్ కేటాయింపు), మైనర్ ఇరిగేషన్ ల నీటివాడకం వంటి అంశాలపై ఈ లేఖలో వివరణలు ఇచ్చింది.
గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియమావళి, మార్గదర్శకాలు రూపొందిం చడంతోపాటు, గోదావరి వివాద పరిష్కార ట్రిబ్యునల్–1980కి అనుగుణంగా గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై అధ్యయనం చేయాలని బజాజ్ కమిటీకి కేంద్రం సూచిం చింది. ఈ అంశాలపై అధ్యయనం చేసి అందించే నివేదిక, సూచించే విధానానికి అనుగుణంగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు నడుచుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమ తులు వచ్చిన వెంటనే పై రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమి స్తాయని, ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎం సీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని పేర్కొంది.
రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులు చూడాల్సి ఉంటుం దని, అప్పటివరకు నియంత్రణ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. మైనర్ ఇరిగేషన్ కింద సైతం రాష్ట్ర వినియోగం 30 టీఎంసీలు దాటకున్నా, వాటాల లెక్కలను చూపి 89.15టీఎంసీలుగా వినియోగాన్ని చూడటం సరైంది కాదనే వాదనను కమి టీకి రాసిన లేఖలో వివరించినట్లుగా చెబుతున్నారు.
బోర్డు చైర్మన్ పదవీ విరమణ
కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్ గా వ్యవహరిస్తున్న రామ్‌శరణ్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తుంగభద్ర బోర్డు చైర్మన్ గా ఉన్న రామచంద్రరావుకు తాత్కాలిక బాధ్యతలు కట్టబెట్టను న్నట్లు తెలిసింది.