AK Bajaj Committee
-
తుంగభద్ర గేట్లన్నీ మార్చాల్సిందే
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/హొసపేటె: తుంగభద్ర డ్యామ్ గేట్లన్నీ మార్చాల్సిందేనని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ బోర్డుకు స్పష్టం చేసింది. ఏ డ్యాం గేట్లైనా 45 ఏళ్లు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని పేర్కొంది. తుంగభద్ర డ్యామ్ గేట్లు 70 ఏళ్లుగా పనిచేస్తున్నాయని.. తుప్పుపట్టినప్పుడు దాన్ని తొలగించి రంగులు వేస్తుండటం వల్ల వాటి మందం తగ్గిందని, బలహీనంగా మారాయని తెలిపింది. దీనివల్లే ఆగస్టు 10న డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చిచెప్పింది. డ్యామ్ భద్రత దృష్ట్యా 33 గేట్లనూ మార్చి.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను బుధవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ, సీడబ్ల్యూసీకి ఏకే బజాజ్ అందించనున్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు గేట్ల మార్పుపై తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోనుంది. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుచేయడానికే రూ.5 కోట్లకుపైగా బోర్డు వ్యయం చేసింది. ఈలెక్కన పూర్తి స్థాయిలో ఒక్క గేటు ఏర్పాటుకు రూ.8 కోట్లపైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 33 గేట్లు ఏర్పాటుచేయాలంటే రూ.264 కోట్లకుపైగా వ్యయం అవుతుందని చెబుతున్నారు. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ వంటి అధునాతన వ్యవస్థను ఏర్పాటుచేయాలంటే అదనంగా మరో రూ.వంద కోట్ల వరకూ వ్యయం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నీటి కేటాయింపులు, ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాల్సి ఉంటుంది. బజాజ్ కమిటీ సమగ్ర అధ్యయనంతుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యామ్ గేట్లు, భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. దాంతో తుంగభద్ర డ్యామ్ గేట్లపై అధ్యయానికి సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన గేట్ల నిపుణులు హర్కేశ్ కుమార్, తారాపురం సుధాకర్ సభ్యులుగా కేంద్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఆదివారం, సోమవారం డ్యామ్‌ను సమగ్రంగా పరిశీలించి.. గేట్ల పనితీరుపై అధ్యయనం చేసింది. -
‘మళ్లింపు’ కథ మళ్లీ మొదటికి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశమై అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ గడువు ఆదివారంతో ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పర్యటనలు, సమావేశాలు నిర్వహించకుండానే కమిటీ అధికారికంగా రద్దయిపోయింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న మళ్లింపు జలాల అంశం మళ్లీ మొదటికొచ్చింది. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించడం లక్ష్యంగా కేంద్ర జల వనరుల శాఖ గతేడాది అక్టోబర్‌లో ఏకే బజాజ్ నేతృత్వంలో ఐదుగరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో పర్యటించిన కమిటీ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని కోరింది. అయితే మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని కమిటీ చేతులెత్తేసింది. ఈ సమయంలోనే కమిటీ గడువు ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ ఆరు నెలల వ్యవధిలో రాష్ట్రంలో ఒక్క పర్యటన కూడా కమిటీ చేయలేదు. ప్రస్తుతం కమిటీ రద్దయిన నేపథ్యంలో ఈ వివాదాన్ని ట్రిబ్యునల్ పరిధిలోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. -
మళ్లింపు జలాలపై చర్చలు
♦ కృష్ణా బోర్డు చైర్మన్‌తో బజాజ్ కమిటీ సమావేశం ♦ ఈ నెలాఖరులో కమిటీ హైదరాబాద్ పర్యటన సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ, పోలవరం ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న మళ్లింపు జలాలపై కేంద్ర జల వనరుల శాఖ నియమిం చిన ఏకే బజాజ్ కమిటీ నేతృత్వంలోని కమిటీ ఢిల్లీలో బుధవారం సమావేశం నిర్వహించింది. కేంద్ర జల వన రుల శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏకే బజాజ్‌తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్పీ పాండే, ప్రదీప్ కుమార్ శుక్లా, ఎన్.ఎన్.రాయ్‌తో కేఆర్ఎంబీ చైర్మన్ శ్రీవాత్సవ భేటీ అయ్యారు. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రా లకు వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించే అంశాలపై చర్చించారు. మళ్లింపు జలాలపై తెలుగు రాష్ట్రాలు వినిపిస్తున్న వాదన లను కృష్ణా బోర్డు చైర్మన్ కమిటీ సభ్యులకు వివరించారు. దీనిపై కమిటీ స్పందిస్తూ.. ఈ నెలాఖరుకు ఇరు రాష్ట్రాల్లో పర్య టించి ఈ అంశాలపై ఓ అవగాహ నకు వస్తామని తెలిపినట్లు సమాచారం. ప్రవాహ లెక్కలు పక్కాగా.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేసిన నీటి ప్రవాహాల లెక్కలు టెలీమెట్రీ విధానం ద్వారా కచ్చితంగా తెలుస్తాయని, వాటిని ఎప్పటికప్పుడు నమోదు చేసి అందజేయాలని కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఆయా ప్రాజెక్టుల ఈఈలకు సూచించారు. జూరాలకు 4,400 క్యూసెక్కులు.. కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువ ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు తగ్గడంతో దిగువకు నీటిప్రవాహం తగ్గింది. నారాయ ణపూర్ నుంచి పవర్ హౌజ్ ద్వారా 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండటంతో అందులో 4,400 క్యూసె క్కులు జూరాలకు వస్తోంది. ఎగువ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని జూరాల నుంచి 4,296 క్యూసెక్కుల నీటిని ఆ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా కింద ఉన్న చెరువులకు వదులుతున్నారు. -
పట్టిసీమ, పోలవరం వాటాలపై ఏం చేద్దాం?
నేడు ఢిల్లీలో ఏకే బజాజ్ కమిటీతో కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్ల భేటీ సాక్షి, హైదరాబాద్: పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నేపథ్యంలో.. ఏకే బజాజ్ కమిటీతో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు శ్రీవాత్సవ, హెచ్‌కే సాహూ బుధవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. మళ్లింపు జలాల వాటాలను ఎలా తేల్చాలి, ఇప్పటికే ట్రిబ్యునల్ చేసిన కేటా యింపులను మార్చే అధికారాలపై బోర్డు చైర్మన్లు బజాజ్ కమిటీతో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు దక్కుతాయని, ఇం దులో భాగంగా 45 టీఎంసీలు తమకు వస్తాయని తెలంగాణ అంటోంది. గతేడాది ఏపీ ఏకంగా 53 టీఎంసీల మేర నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలిం చుకున్నా రాష్ట్రానికి చుక్క నీటి వాటా ఇవ్వలేదు. ఈ ఏడాది సైతం మరో 28 టీఎంసీల మేర వినియోగించింది. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యకార్యదర్శి సమీర్ ఛటర్జీ బుధ వారం ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో భేటీ కానున్నారు. -
కావాల్సింది నీళ్లు.. వివాదాలు కాదు
-
‘కృష్ణా’లో కొత్త తిరకాసు!
• పోలవరం, పట్టిసీమ వాటాలు తేల్చలేమన్న ఏకే బజాజ్ కమిటీ • కేవలం విధివిధానాలు మాత్రమే చూస్తామని స్పష్టీకరణ • తెలంగాణ అభ్యంతరం.. నిర్దిష్ట వాటా చెప్పాలన్న విద్యాసాగర్‌రావు • తాత్కాలిక కేటాయింపులు చేయాల్సిన బాధ్యత కమిటీదేనని వ్యాఖ్య • ఏపీతో చర్చల తర్వాత కమిటీ వైఖరి మారిందని విమర్శ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదం కొత్త మలుపు తిరిగింది. గోదావరి నుంచి కృష్ణాకు తరలించే నీటి వాటాలను తేల్చేం దుకు ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ నిరా కరించింది. తమ పని కేవలం విధివిధానాలకే పరిమితమని, పోలవరం, పట్టిసీమల ద్వారా కృష్ణాకు తరలిస్తున్న నీటి వాటాలు తేల్చలే మని స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఏపీతో చర్చల అనంతరం కమిటీ వైఖరి మారిందని, దీనిపై రెండ్రోజుల్లో కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. బజాజ్ కమిటీ సోమవారం తెలంగాణ, మంగళవారం ఏపీ అధికారులతో విడివిడిగా భేటీలు నిర్వ హించిన సంగతి తెలిసిందే. బుధవారం సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాత ఇరురాష్ట్రాల అధి కారులతో కమిటీ జలసౌధలో మరోసారి భేటీ అయింది. కమిటీ చైర్మన్ ఏకే బజాజ్‌తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్పీ పాండే, ప్రదీప్ కుమార్ శుక్లా, ఎన్.ఎన్.రాయ్, కేఆర్ఎంబీ చైర్మన్ హెచ్‌కే హల్దర్, సభ్య కార్యదర్శి డాక్టర్ సమీర్ చటర్జీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీ« ధరరావు, వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. మాకు 78 టీఎంసీలు రావాల్సిందే.. సమావేశంలో కమిటీ కేవలం ఉమ్మడి ప్రాజె క్టుల విధివిధానాలపైనే చర్చిచింది. ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన వాటర్ డేటా ఇవ్వాలని కోరగా ఇరు రాష్ట్రాలు అంగీకరించా యి. అయితే పట్టిసీమ, పోలవరం వాటాలపై మాట్లాడకపోవడంతో విద్యాసాగర్‌రావు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కమిటీ జోక్యం చేసుకుంటూ.. వాటాల అంశాన్ని తాము పట్టించుకోవడం లేదని, ట్రిబ్యునల్ తేలుస్తుం దని పేర్కొంది. ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చే అధికారం తమకు లేదని, కేంద్రం సూచిస్తేనే ఏదైనా మధ్యేమార్గాన్ని సూచిస్తా మంది. ఇందుకు విద్యాసాగర్‌రావు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఏపీ చేపట్టిన పట్టి సీమ, పోలవరం ద్వారా ఎగువ రాష్ట్రాలకు దక్కే 98 టీఎంసీల వాటాలో పోలవరం ద్వారా 43, పట్టిసీమ ద్వారా 35 టీఎంసీలు కలిపి 78 టీఎంసీలు తెలంగాణకు దక్కాతని వాదించారు. కమిటీ ఏ మేరకు నీటి వాటా ఇస్తుందో నిర్దిష్టంగా అంకెలతో సహా చెప్పా లన్నారు. ఇందుకే కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో చిన్న నీటి వనరులకు సంబంధిం చిన సమాచారం కోసం బజాజ్ కమిటీ ఉత్సా హం ప్రదర్శించడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అసలు విషయాన్ని వదిలి బయటి విషయాల జోలికెళ్లడం సరి కాదంది. వాటాలు తేల్చకుంటే ఇది ఉత్తుత్తి కమిటీగా మారుతుం దని పేర్కొంది. భేటీ అనంతరం విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఏపీతో చర్చల తర్వాత ఒక్క రోజులో కమిటీ వైఖరి మారిం ది. ఇది దారుణం. ట్రిబ్యునల్ కేటాయింపులు చేసేందుకు చాలా సమయం పడుతున్నందున ఈలోగా తాత్కాలిక కేటాయింపులు చేయా ల్సిన బాధ్యత కమిటీపై ఉంది. అది పట్టించు కోకుండా విధివిధానాలు అంటే ససేమిరా ఒప్పుకోం. దీనిపై శుక్రవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరుల శాఖ అధికారులతో చర్చిస్తాం’’ అని చెప్పారు. వాటాకు మించి వాడొద్దు ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ కృష్ణా జలాల్లో తాము చేసిన కేటాయింపుల కంటే అధిక నీటిని వినియోగించరాదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. ఈ మేరకు బుధవారం ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు రాసింది. ఏపీ తన వాటా కంటే పోతిరెడ్డిపాడు కింద 2.29 టీఎంసీ, హంద్రీ నీవా కింద 2.96 టీఎంసీ మేర అధిక వాడకం జరిపిందని తెలిపింది. తెలంగాణ విషయానికొస్తే ఏఎంఆర్పీ కింద 0.87 టీఎంసీ, కల్వకుర్తి కింద 1.23 అధిక వినియోగం చేసిందని పేర్కొంది. కృష్ణా డెల్టా, కుడి, ఎడమ కాల్వల కింద మాత్రం ఇంకా ఇరు రాష్ట్రాలు తమ కేటాయింపు జలాలను వాడుకోవాల్సి ఉందని వివరించింది. కేంద్రం సూచిస్తే మధ్యేమార్గం చూపుతాం: ఏకే బజాజ్ ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపాం. నీటి కేటాయింపులు, వాటా అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో చర్చించాం. తుది నిర్ణయానికి రాలేదు. తెలంగాణ సీఎం చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్నారు. సుహృద్భావ వాతావరణంలో పరిష్కారం జరగాలని ఏపీ, తెలంగాణ సీఎంలు కోరుకుంటున్నారు. కానీ చిన్నచిన్న భేదాభిప్రాయాలున్నాయి. పట్టిసీమ, పోలవరం ద్వారా తరలించే నీటి వాటాలను తేల్చాల్సింది ట్రిబ్యునల్. ప్రస్తుత కేటాయింపులను మేం మార్చజాలం. అయితే కేంద్రం మాకు తగిన సూచనలు చేస్తే... మధ్యేమార్గాన్ని చూపుతాం. దాన్ని అమలు చేసే విషయం కేంద్రం నిర్ణయిస్తుంది. 20 రోజుల్లో మారుమారు ప్రాజెక్టుల సందర్శనకు వస్తాం. -
కావాల్సింది నీళ్లు.. వివాదాలు కాదు
• ఇరు రాష్ట్రాల మధ్య జగడాలు వాంఛనీయం కాదు • ఏకే బజాజ్ కమిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ • పట్టిసీమను దృష్టిలో ఉంచుకుని కృష్ణాలో మాకు వాటా పెంచండి • సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంతో అన్యాయం.. ఇప్పుడైనా సరిచేయండి • నీటి లభ్యత తక్కువున్న సమయంలో కింది రాష్ట్రాలు నష్టపోకూడదు • మిగులు జలాల పంపిణీకి ఒక విధానం ఉండాలి సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు వాంఛనీయం కాదని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులె వరైనా రైతులేనని, ఏ రాష్ట్రం వారైనా వారి ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీకి కావాల్సింది నీరు కానీ.. వివాదాలు కాదని పేర్కొన్నారు. నీటి కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా.. కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకే తాను ప్రాధాన్యమిస్తానని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణాలో లభ్యత జలాలను సద్వినియోగం చేసుకునే ఆలోచన చేయాలే తప్ప వివాదాలు సృష్టించుకోవద్దని అన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల కమిటీ బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలసింది. ఈ సందర్భంగా సీఎం.. కమిటీ సభ్యులకు నదీ జలాల వినియోగం, నీటి విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, రాష్ట్ర సమగ్ర జల విధానం తదితర విషయాలను వివరిం చారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగానికి సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలని కోరారు. గతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి వినియోగానికి సంబంధించి ఆపరేషన్ రూల్స్ లేనందున తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇప్పుడైనా న్యాయం చేయాలన్నారు. తాగునీటికి అత్యంత ప్రాధా న్యం ఇవ్వాలని, అక్రమ ప్రాజెక్టులకు నీరు విడుదల కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందున, రాష్ట్రానికి అందుకు తగ్గ రీతిలో వాటా పెంచాలని విన్నవించారు. గోదావరి జలాల సమర్థ వినియోగమే మేలు.. ‘‘గోదావరి, కృష్ణా నదుల్లో రెండు రాష్ట్రాలకు కలిపి 4 వేల టీఎంసీల నీళ్లున్నాయి. తెలం గాణ సాగునీటి అవసరాలు తీరడానికి వెయ్యి టీఎంసీల నీరు చాలు. గోదావరిలో రాష్ట్రానికి 954 టీఎంసీల కేటాయింపు ఉంది. వాటి ప్రకారమే ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంటున్నాం. వాటా ప్రకారమే నీటిని వాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే చేయాలి. తక్కువ నీటి లభ్యత ఉన్న కృష్ణా విషయంలో జగడాలు పెట్టే బదులు గోదావరి నీటిని సమర్థంగా విని యోగించుకోవాలి’’ అని సీఎం సూచించారు. ‘‘పోల వరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం నుంచి ప్రకాశం బ్యారేజీ, సోమశిల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కోస్తా, రాయలసీమకు తరలించడం చాలా సులభం. ఇలా చేస్తే ఏపీ అంతా సుభిక్షం అవుతుంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా చెప్పా. వారు ఆలోచించుకోవాలి. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే.. కేవలం 25–50 టీఎంసీల నీటి కోసం గొడవలు పెట్టుకోవడం అవివేకం. మాకు తెలంగాణ రైతులకు న్యాయం చేయాలనేదే లక్ష్యం. అలాగని పొరుగు రాష్ట్రం నష్టపోవాలన్నది మా అభిమతం కాదు. మాది లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పొరుగు రాష్ట్రాలతో తత్సంబంధాలు నెలకొల్పాం. అవి ఫలించాయి’’అని వివరించారు. బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఏకే బజాజ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమైక్య రాష్ట్రంలో ఎంతో నష్టపోయాం ఉమ్మడి ఏపీలో అనుసరించిన వివక్షా పూరిత విధానాల వల్ల తెలంగాణ నష్ట పోయిందని సీఎం పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రాజె క్టులు ముందుకు పడకుండా వివాదాల్లో పడేశారు. భీమా లాంటి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులున్నా పూర్తి చేయ లేదు. పాలమూరుపై ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కిరణ్‌మార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ప్రాజెక్టు జీవో ఇచ్చారు. అయినా దాన్ని పూర్తి చేయలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత మేం కడతామంటే అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి తాగునీటికి నదీ జలాల్లో నీటి కేటాయింపులు చేయడానికి అంగీకరించడం లేదు’’అని వివరించారు. ఈ రెండు విధానాలు అమలు చేయాలి నదీ జలాల వినియోగానికి సంబంధించి రెండు విధానాలు అమలు చేయాలని బజాజ్ కమిటీకి సీఎం కేసీఆర్ సూచించారు. ‘‘గోదావరి, కృష్ణా జలాలను 4 రాష్ట్రాలు వాడుకుంటున్నాయి. వీటిపై మహారాష్ట్ర, కర్ణాటక అనేక ప్రాజెక్టులు కట్టాయి. దీంతో దిగువకు నీరు రావడం లేదు. వర్షాలు బాగా కురిసి నదుల్లో పుష్కలంగా నీరున్నప్పుడు సమస్య లేదు. కానీ నీటి లభ్యత తక్కువున్నప్పుడు కూడా ఎగువ రాష్ట్రాలు నీరు ఆపుకోవడం వల్ల కింది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. దీన్ని నివారించేందుకు రెండు విధానాలు రూపొందించాలి. నీటి లభ్యత తక్కువున్నప్పుడు ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకోవాలి? అనే విషయాన్ని కేంద్రం తేల్చాలి. అందరూ నీరు వినియోగించుకునేలా కేంద్రం చూడాలి. అలాగే మిగులు జలాల పంపిణీకి కూడా ఒక విధానం ఉండాలి. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని అందరికీ న్యాయం చేయాలి’’అని కోరారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, విద్యాసాగర్ రావు, జి.వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏమి తేల్చెదరో ‘కృష్ణా’!
హైదరాబాద్ చేరుకున్న ఏకే బజాజ్ కమిటీ పోలవరం, పట్టిసీమల ద్వారా కృష్ణాకు తరలిస్తున్న నీటి వాటాలను తేల్చనున్న కమిటీ నేడు తెలంగాణ,రేపు ఏపీ అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలకు వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించడం లక్ష్యంగా కేంద్ర జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ హైదరాబాద్ చేరుకుంది. సోమవారం తెలంగాణతో చర్చలు, మంగళవారం ఆంధ్ర ప్రదేశ్‌తో.. తర్వాత కృష్ణా బోర్డుతో వివిధ దఫాలుగా చర్చలు జరిపి తుది నివేదికను కేంద్రానికి అందజేయనుంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణాలో లభ్యతగా ఉన్న 2,130 టీఎంసీలలో ఉమ్మడి ఏపీకి 811, మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయింపులున్నాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటిలో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీలు వినియోగించుకునేలా ఒప్పందాలున్నాయి. ఏపీ కొత్తగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తుండటంతో కొత్త సమస్య వచ్చి పడింది. పోలవరం, సహా ఏ ఇతర కొత్త ప్రాజెక్టు చేపట్టినా ఎగువ రాష్ట్రాలకు అంతే పరిమాణం వాటా కృష్ణా జలాల్లో దక్కుతుందని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు లో స్పష్టంగా ఉంది. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంతో ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటకలకు 35 టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు దక్కాయి. 35 టీఎంసీ ల్లో 14 టీఎంసీలు మహారాష్ట్రకు, కర్ణాటకకు 21 టీఎంసీలు దక్కుతాయి. ఏపీ, తెలంగా ణల మధ్య నీటి వాటాల విషయం మాత్రం తేలలేదు. గతంలో అపెక్స్ ముందు ఇదే అంశమై వాదనలు వినిపించిన సమయంలో 80 టీఎంసీల కేటాయింపుల్లో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రకు దక్కినట్లే మిగతా 45 టీఎంసీలు ప్రస్తుతం ఎగువ రాష్ట్రమైన తమకే దక్కుతుందని తెలంగాణ తెలిపింది. ఏపీ పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరింది. దీనికి ఏపీ అడ్డు లగులుతోంది. బజాజ్ కమిటీ ఈ అంశాన్ని తేల్చాల్సి ఉంది. మరోవైపు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకు మార్గదర్శకాలతో వర్కింగ్ మాన్యువల్‌ను కమిటీ తయారు చేయాల్సి ఉంది. కృష్ణా బోర్డు తాను రూపొందించిన మ్యాన్యువల్ డ్రాఫ్ట్‌ను ఇప్పటికే బజాజ్ కమిటీకి అందజేసింది. వీటిపై ఇరు రాష్ట్రాలతో చర్చించి కమిటీ ఓ నిర్ణయం చేయాల్సి ఉంటుంది. -
8న కృష్ణా బోర్డు సమావేశం
టెలీమెట్రీ పరికరాలు, నీటి కేటాయింపులపై చర్చ సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల నీటి వినియోగంపై చర్చించేందుకు ఈనెల 8న కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశం జరగ నుంది. బుధవారం ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు బోర్డు సమాచారం అందిం చింది. బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి లభ్యత, రాష్ట్రాలకు దక్కే వాటా, ఇప్పటి వరకు జరిగిన వినియోగం, డిమాండ్లు, టెలీ మెట్రీ పరికరాల అమరిక, ఏకే బజాజ్ కమిటీ రాష్ట్ర పర్యటన, పులిచింతలలో కనీస నీటి మట్టాల నిర్వహణ వంటి అంశాలపై ఈ సమా వేశంలో చర్చించనున్నారు. బేసిన్ పరిధి లోని సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల, ఆర్డీఎస్, కేసీకెనాల్ తదితర ప్రాజెక్టుల పరిధిలో మొదటి విడతలో 18 చోట్ల, రెండో విడతలో 19 చోట్ల టెలీమెట్రీ పరికరాలను అమర్చాలని ప్రతిపాదిస్తోంది. ఇందులో మొదటి విడత 4 కోట్లు ఏపీ విడుదల చేయాల్సి ఉండగా, రెండో విడత టెలీమెట్రీపై ఇరు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది. కాగా, ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ 16 నుంచి రాష్ట్ర పర్యటనకు రానుంది. నిజానికి 6వ తేదీ నుంచి వారంపాటు రాష్ట్ర పర్యటన ఉంటుందని మొదట సమాచారమిచ్చినా పర్యటనలో మార్పులపై బుధవారం కమిటీ సభ్య కార్యదర్శి బోర్డుకు సమాచారం అందించారు. -
ఉమ్మడి ప్రాజెక్టుల వివరాలివ్వండి
► తెలంగాణ, ఏపీని కోరిన ఏకే బజాజ్ కమిటీ ► సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల, సుంకేశుల కింద 30 ఏళ్ల నీటి వివరాలివ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టుల వివరాలన్నీ తమకు సమ ర్పించాలంటూ కేంద్ర జల వనరుల శాఖ ఐదు గురు సభ్యులతో నియమించిన ఏకే బజాజ్ కమిటీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్య దర్శులను ఆదేశించింది. జూరాల, నాగా ర్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని కమిటీ తెలంగాణను కోర గా... వీటితోపాటు సుంకేశుల వివరాలు కూడా ఇవ్వాలని ఏపీని ఆదేశించింది. తెలంగాణ, ఏపీ సమర్పించే ఈ లెక్కల ఆధారంగా.. బోర్డు ఇరు రాష్ట్రాలను సంప్రదించి ప్రాజెక్టుల వర్కింగ్ మాన్యువల్ తయారు చేయనుంది. 2 రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియ మావళి, మార్గదర్శకాలు రూపొందించే అంశం పై పది రోజుల కిందటే కమిటీ చర్చలు జరిపింది. తాజాగా ప్రాజెక్టుల వివరాలు కోరుతూ ఇరు రాష్ట్రాలకు కమిటీ సభ్య కార్యదర్శి ఎన్ఎన్ రాయ్ ఈ లేఖలు రాశారు. దీనిపై వెంటనే స్పందించిన బోర్డు కమిటీ లేఖను జతపరుస్తూ, ఇరు రాష్ట్రాలకు మంగళవారం మరోమారు లేఖ రాసింది. ప్రాజె క్టులకు సంబంధించిన ప్రాథమిక వివరాలు, 30 ఏళ్లలో ఆయా ప్రాజెక్టుల కింద నమోదైన ఇన్‌ఫ్లో, ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద వినియోగం, ప్రాజెక్టుల్లో నెలవారీ సరాసరి అవç సరాలు, విద్యుదుత్పత్తి తదితర వివరాలను త్వరగా సమర్పించాలని కోరింది. గోదావ రికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై ట్రిబ్యునల్ తీర్పులు ఎలా ఉన్నా యి, వివాదాలు ఏయే అంశాల్లో ఉన్నాయి, వివాదాలకు ప్రధాన కారణాలేంటి అన్న అంశాలపైనా అధ్యయనం చేయాలని కూడా కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. -
కృష్ణా బోర్డు కొత్త చైర్మన్ గా హల్దార్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు చెర్మన్ గా హెచ్‌కే హల్దార్ మంగళవారం జలసౌధలో బోర్డు అధి కారులు, సిబ్బంది సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌ల తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల కేటాయింపులపై కేంద్రం నియమించిన ఏకే బజాజ్ కమిటీ వచ్చే వారం రాష్ట్రా నికి రానుంది. -
నీటి వాటాలు నిర్ణయించజాలరు
► ఏకే బజాజ్ కమిటీకి స్పష్టం చేసిన తెలంగాణ ► ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, కృష్ణాకు తరలించే గోదావరి వాటా తేల్చాల్సింది ట్రిబ్యునల్ మాత్రమే! సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు నీటి వాటాలను ట్రిబ్యునల్ మాత్రమే తేల్చగలదని, కేంద్రం నియమిం చే కమిటీలు కాదని రాష్ట్ర ప్రభుత్వం ఏకే బజాజ్ కమిటీకి తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు ఎలా ఉండాలన్న దానిపై ట్రిబ్యునల్ విచారణ జరుగుతు న్నందున, ఈ విషయంలో కమిటీల జోక్యం అనవసరమంటూ కమిటీకి గురువారం లేఖ రాసినట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కృష్ణాబేసిన్ ప్రాజె క్టుల నిర్వహణ, నియంత్రణపై రాష్ట్రాభి ప్రాయాలు చెప్ప డంతో పాటు ట్రిబ్యునల్ పరిధిలో జరుగుతున్న విచారణ, ప్రస్తుతం అమలవుతున్న గుండుగుత్త కేటాయింపులు (ఎన్–బ్లాక్ కేటాయింపు), మైనర్ ఇరిగేషన్ ల నీటివాడకం వంటి అంశాలపై ఈ లేఖలో వివరణలు ఇచ్చింది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియమావళి, మార్గదర్శకాలు రూపొందిం చడంతోపాటు, గోదావరి వివాద పరిష్కార ట్రిబ్యునల్–1980కి అనుగుణంగా గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై అధ్యయనం చేయాలని బజాజ్ కమిటీకి కేంద్రం సూచిం చింది. ఈ అంశాలపై అధ్యయనం చేసి అందించే నివేదిక, సూచించే విధానానికి అనుగుణంగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు నడుచుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమ తులు వచ్చిన వెంటనే పై రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమి స్తాయని, ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎం సీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులు చూడాల్సి ఉంటుం దని, అప్పటివరకు నియంత్రణ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. మైనర్ ఇరిగేషన్ కింద సైతం రాష్ట్ర వినియోగం 30 టీఎంసీలు దాటకున్నా, వాటాల లెక్కలను చూపి 89.15టీఎంసీలుగా వినియోగాన్ని చూడటం సరైంది కాదనే వాదనను కమి టీకి రాసిన లేఖలో వివరించినట్లుగా చెబుతున్నారు. బోర్డు చైర్మన్ పదవీ విరమణ కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్ గా వ్యవహరిస్తున్న రామ్‌శరణ్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తుంగభద్ర బోర్డు చైర్మన్ గా ఉన్న రామచంద్రరావుకు తాత్కాలిక బాధ్యతలు కట్టబెట్టను న్నట్లు తెలిసింది.