కాల పరిధి 45 ఏళ్లే.. 70 ఏళ్లుగా గేట్లు పనిచేస్తున్నాయి
తుప్పుపట్టి, వరద ఒత్తిడికి బలహీనంగా మారాయి
అందుకే ఆగస్టు 10న 19వ గేటు కొట్టుకుపోయింది
తుంగభద్ర బోర్డుకు స్పష్టం చేసిన ఏకే బజాజ్ కమిటీ
నేడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక ఇవ్వనున్న కమిటీ
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/హొసపేటె: తుంగభద్ర డ్యామ్ గేట్లన్నీ మార్చాల్సిందేనని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ బోర్డుకు స్పష్టం చేసింది. ఏ డ్యాం గేట్‌లైనా 45 ఏళ్లు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని పేర్కొంది. తుంగభద్ర డ్యామ్ గేట్లు 70 ఏళ్లుగా పనిచేస్తున్నాయని.. తుప్పుపట్టినప్పుడు దాన్ని తొలగించి రంగులు వేస్తుండటం వల్ల వాటి మందం తగ్గిందని, బలహీనంగా మారాయని తెలిపింది. దీనివల్లే ఆగస్టు 10న డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చిచెప్పింది.
డ్యామ్ భద్రత దృష్ట్యా 33 గేట్లనూ మార్చి.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను బుధవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ, సీడబ్ల్యూసీకి ఏకే బజాజ్ అందించనున్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు గేట్ల మార్పుపై తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోనుంది. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుచేయడానికే రూ.5 కోట్లకుపైగా బోర్డు వ్యయం చేసింది. ఈలెక్కన పూర్తి స్థాయిలో ఒక్క గేటు ఏర్పాటుకు రూ.8 కోట్లపైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ లెక్కన 33 గేట్లు ఏర్పాటుచేయాలంటే రూ.264 కోట్లకుపైగా వ్యయం అవుతుందని చెబుతున్నారు. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ వంటి అధునాతన వ్యవస్థను ఏర్పాటుచేయాలంటే అదనంగా మరో రూ.వంద కోట్ల వరకూ వ్యయం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నీటి కేటాయింపులు, ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాల్సి ఉంటుంది.
బజాజ్ కమిటీ సమగ్ర అధ్యయనం
తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యామ్ గేట్లు, భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. దాంతో తుంగభద్ర డ్యామ్ గేట్లపై అధ్యయానికి సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన గేట్ల నిపుణులు హర్కేశ్ కుమార్, తారాపురం సుధాకర్ సభ్యులుగా కేంద్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఆదివారం, సోమవారం డ్యామ్‌ను సమగ్రంగా పరిశీలించి.. గేట్ల పనితీరుపై అధ్యయనం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment