సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశమై అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ గడువు ఆదివారంతో ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పర్యటనలు, సమావేశాలు నిర్వహించకుండానే కమిటీ అధికారికంగా రద్దయిపోయింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న మళ్లింపు జలాల అంశం మళ్లీ మొదటికొచ్చింది. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించడం లక్ష్యంగా కేంద్ర జల వనరుల శాఖ గతేడాది అక్టోబర్‌లో ఏకే బజాజ్ నేతృత్వంలో ఐదుగరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో పర్యటించిన కమిటీ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని కోరింది. అయితే మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని కమిటీ చేతులెత్తేసింది. ఈ సమయంలోనే కమిటీ గడువు ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ ఆరు నెలల వ్యవధిలో రాష్ట్రంలో ఒక్క పర్యటన కూడా కమిటీ చేయలేదు. ప్రస్తుతం కమిటీ రద్దయిన నేపథ్యంలో ఈ వివాదాన్ని ట్రిబ్యునల్ పరిధిలోనే తేల్చుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment