కావాల్సింది నీళ్లు.. వివాదాలు కాదు | CM KCR with AK Bajaj Committee about krishna water | Sakshi
Sakshi News home page

కావాల్సింది నీళ్లు.. వివాదాలు కాదు

Published Thu, Feb 16 2017 2:05 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

కావాల్సింది నీళ్లు.. వివాదాలు కాదు - Sakshi

కావాల్సింది నీళ్లు.. వివాదాలు కాదు

ఇరు రాష్ట్రాల మధ్య జగడాలు వాంఛనీయం కాదు
ఏకే బజాజ్‌ కమిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌
పట్టిసీమను దృష్టిలో ఉంచుకుని కృష్ణాలో మాకు వాటా పెంచండి
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంతో అన్యాయం.. ఇప్పుడైనా సరిచేయండి
నీటి లభ్యత తక్కువున్న సమయంలో కింది రాష్ట్రాలు నష్టపోకూడదు
మిగులు జలాల పంపిణీకి ఒక విధానం ఉండాలి

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు వాంఛనీయం కాదని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులె వరైనా రైతులేనని, ఏ రాష్ట్రం వారైనా వారి ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీకి కావాల్సింది నీరు కానీ.. వివాదాలు కాదని పేర్కొన్నారు. నీటి కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా.. కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకే తాను ప్రాధాన్యమిస్తానని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణాలో లభ్యత జలాలను సద్వినియోగం చేసుకునే ఆలోచన చేయాలే తప్ప వివాదాలు సృష్టించుకోవద్దని అన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఏకే బజాజ్‌ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల కమిటీ బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసింది.

ఈ సందర్భంగా సీఎం.. కమిటీ సభ్యులకు నదీ జలాల వినియోగం, నీటి విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, రాష్ట్ర సమగ్ర జల విధానం తదితర విషయాలను వివరిం చారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగానికి సంబంధించి ఆపరేషన్‌ రూల్స్‌ రూపొందించాలని కోరారు. గతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి వినియోగానికి సంబంధించి ఆపరేషన్‌ రూల్స్‌ లేనందున తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇప్పుడైనా న్యాయం చేయాలన్నారు. తాగునీటికి అత్యంత ప్రాధా న్యం ఇవ్వాలని, అక్రమ ప్రాజెక్టులకు నీరు విడుదల కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందున, రాష్ట్రానికి అందుకు తగ్గ రీతిలో వాటా పెంచాలని విన్నవించారు.

గోదావరి జలాల సమర్థ వినియోగమే మేలు..
‘‘గోదావరి, కృష్ణా నదుల్లో రెండు రాష్ట్రాలకు కలిపి 4 వేల టీఎంసీల నీళ్లున్నాయి. తెలం గాణ సాగునీటి అవసరాలు తీరడానికి వెయ్యి టీఎంసీల నీరు చాలు. గోదావరిలో రాష్ట్రానికి 954 టీఎంసీల కేటాయింపు ఉంది. వాటి ప్రకారమే ప్రాజెక్టులు డిజైన్‌ చేసుకుంటున్నాం. వాటా ప్రకారమే నీటిని వాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌ కూడా అలాగే చేయాలి. తక్కువ నీటి లభ్యత ఉన్న కృష్ణా విషయంలో జగడాలు పెట్టే బదులు గోదావరి నీటిని సమర్థంగా విని యోగించుకోవాలి’’ అని సీఎం సూచించారు. ‘‘పోల వరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం నుంచి ప్రకాశం బ్యారేజీ, సోమశిల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కోస్తా, రాయలసీమకు తరలించడం చాలా సులభం.

ఇలా చేస్తే ఏపీ అంతా సుభిక్షం అవుతుంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా చెప్పా. వారు ఆలోచించుకోవాలి. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే.. కేవలం 25–50 టీఎంసీల నీటి కోసం గొడవలు పెట్టుకోవడం అవివేకం. మాకు తెలంగాణ రైతులకు న్యాయం చేయాలనేదే లక్ష్యం. అలాగని పొరుగు రాష్ట్రం నష్టపోవాలన్నది మా అభిమతం కాదు. మాది లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌ పాలసీ. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పొరుగు రాష్ట్రాలతో తత్సంబంధాలు నెలకొల్పాం. అవి ఫలించాయి’’అని వివరించారు.

      బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఏకే బజాజ్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సమైక్య రాష్ట్రంలో ఎంతో నష్టపోయాం
ఉమ్మడి ఏపీలో అనుసరించిన వివక్షా పూరిత విధానాల వల్ల తెలంగాణ  నష్ట పోయిందని సీఎం పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రాజె క్టులు ముందుకు పడకుండా వివాదాల్లో పడేశారు. భీమా లాంటి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులున్నా పూర్తి చేయ లేదు. పాలమూరుపై ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కిరణ్‌మార్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ప్రాజెక్టు జీవో ఇచ్చారు. అయినా దాన్ని పూర్తి చేయలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత మేం కడతామంటే అడ్డుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరానికి తాగునీటికి నదీ జలాల్లో నీటి కేటాయింపులు చేయడానికి అంగీకరించడం లేదు’’అని వివరించారు.

ఈ రెండు విధానాలు అమలు చేయాలి
నదీ జలాల వినియోగానికి సంబంధించి రెండు విధానాలు అమలు చేయాలని బజాజ్‌ కమిటీకి సీఎం కేసీఆర్‌ సూచించారు. ‘‘గోదావరి, కృష్ణా జలాలను 4 రాష్ట్రాలు వాడుకుంటున్నాయి. వీటిపై మహారాష్ట్ర, కర్ణాటక అనేక ప్రాజెక్టులు కట్టాయి. దీంతో దిగువకు నీరు రావడం లేదు. వర్షాలు బాగా కురిసి నదుల్లో పుష్కలంగా నీరున్నప్పుడు సమస్య లేదు. కానీ నీటి లభ్యత తక్కువున్నప్పుడు కూడా ఎగువ రాష్ట్రాలు నీరు ఆపుకోవడం వల్ల కింది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. దీన్ని నివారించేందుకు రెండు విధానాలు రూపొందించాలి. నీటి లభ్యత తక్కువున్నప్పుడు ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకోవాలి? అనే విషయాన్ని కేంద్రం తేల్చాలి. అందరూ నీరు వినియోగించుకునేలా కేంద్రం చూడాలి. అలాగే మిగులు జలాల పంపిణీకి కూడా ఒక విధానం ఉండాలి. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని అందరికీ న్యాయం చేయాలి’’అని కోరారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌ శర్మ, విద్యాసాగర్‌ రావు, జి.వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement