బేసిన్లు లేవు.. భేషజాల్లేవు! | KCR And YS Jagan Meeting On Godavari Water Diversion | Sakshi
Sakshi News home page

బేసిన్లు లేవు.. భేషజాల్లేవు!

Published Sat, Jun 29 2019 1:11 AM | Last Updated on Sat, Jun 29 2019 8:13 AM

KCR And YS Jagan Meeting On Godavari Water Diversion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీజలాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణాలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎదుర్కుంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన భేటీలో పలు కీలకమైన అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూల కు సాగు, తాగునీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని వీరిరువురు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళ్లాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటికొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ముందుకెళ్తామని వెల్లడించారు. నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను పూర్తిగా పక్కనబెట్టాలని కూడా శుక్రవారం నాటి భేటీలో నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండూ వేర్వేరనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. 

తొలి అధికారిక భేటీలో.. 
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా అడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగింది. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి.రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం ముఖ్య కార్యదర్శి అజయ్‌ కల్లం, నీటి పారుదల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, సీనియర్‌ అధికారులు ఎల్‌.ప్రేమ చంద్రారెడ్డి, కె.ధనుంజయ రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వర్‌ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు ఈటల రాజేందర్, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, జెన్‌కో–ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు, సలహాదారు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌ రావు, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, రిటైర్డ్‌ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌ రెడ్డి తదితరులున్నారు. ఉదయం 11.15 గంటలకు ప్రగతి భవన్‌ చేరుకున్న జగన్‌ బృందానికి కేసీఆర్, తెలంగాణ మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌కు తెలంగాణ అధికారులను కేసీఆర్‌ పరిచయం చేశారు. జగన్‌ను తన చాంబర్‌కు తీసుకెళ్లిన కేసీఆర్‌ కాసేపు మాట్లాడారు. 11.30 గంటలకు ఇద్దరు సీఎంలు సమావేశ మందిరానికి చేరుకున్నారు. కేసీఆర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. 

నదీ జలాలపై కేసీఆర్‌ ప్రజెంటేషన్‌ 
ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేము. కేసీఆర్, జగన్‌లు వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజలకోణం నుంచే ఆలోచిస్తరు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో, పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఏపీ సీఎం జగన్‌ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతం ఇచ్చింది.

మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగాం. అదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే, అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యం’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. సమావేశం సందర్భంగా నదుల్లో నీటి లభ్యతపై సీఎం కేసీఆర్‌ పవర్‌ పాయిం ట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటకలు గోదావరి, కృష్ణా వాటి ఉపనదులపై బ్యారేజిలు నిర్మించడం వల్ల కిందికి నీరు రాని పరిస్థితిని వివరించారు. సీడబ్ల్యూసీ లెక్క ల ప్రకారం ఏ పాయింట్‌ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో వివరించారు. గూగుల్‌ మ్యాపుల సహకారంతో గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికున్న మార్గాలను ప్రతిపాదించారు.

4వేల టీఎంసీలతో ఇరు రాష్ట్రాలు సుభిక్షం 
ఈ సందర్భంగా లభ్యతగా ఉన్న జలాలు, వృథాగా సముద్రంలో కలుస్తున్న జలాలు, వాటిని శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు తరలించే మార్గాలపై తన అభిప్రాయాలను సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ‘గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 4వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చు. కావాల్సినంత నీళ్లున్నాయి. ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి విజ్ఞత కావాలి. ఎన్ని నీళ్లను ఉపయోగించుకుంటామన్నది మన సమర్థత మీద ఆధారపడి ఉంది. ప్రతీ ఏటా దాదాపు 3వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నీళ్లకోసం ట్రిబ్యునళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, మరొకరి చుట్టూ తిరగడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుని, కలిసి నడిస్తే చాలు. రెండు నదుల్లో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల ప్రజలకు వినియోగించే విషయంలో ఏకాభిప్రాయం ఉంటే చాలు.

కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన తెస్తున్నది. మన నదుల నీళ్లు మన అవసరాలు తీర్చాక కేంద్రం చెప్పే ప్రతిపాదన విషయంలో మనం నిర్ణయం తీసుకోవచ్చు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్లకు నీటిని తరలించాలి. దీనివల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న రాయలసీమ, పాలమూరు, నల్గొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నీటి గోస తీరుతుంది. పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకుపోవాలి. వంశధార, నాగావళి నదుల నీళ్లను కూడా సముద్రం పాలు కాకుండా సమర్థంగా వినియోగిస్తే తమకు నీళ్లు రావడం లేదని, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఉత్తరాంధ్ర వాసుల బాధ కూడా తీరుతుంది’అని సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. 

కరువుకు గోదావరే పరిష్కారం: జగన్‌
దక్షిణ తెలంగాణ జిల్లాలు, ఏపీలోని రాయలసీమ ప్రాంతాలకు గోదావరి జలాలను తరలిస్తేనే సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ‘తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నాం. ఉత్తమమైన, సులభమైన మార్గం ద్వారా సాగునీటి కష్టాలు తీర్చాలి. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతోంది. రాబోయే కాలంలో ఇంకా తగ్గవచ్చు. అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, పాలమూరు, నల్గొండ ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి’అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్‌ బృందంతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement