సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గడం, ఆల్మట్టి జలాశయం ఎత్తును కర్ణాటక ప్రభుత్వం 519.6 అడుగుల నుంచి 524.65 అడుగులకు పెంచుతుండటం వల్ల రానున్న రోజుల్లో నీటి లభ్యత మరింత తగ్గే ప్రమాదం ముంచుకొస్తుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల పరిధిలో సాగునీటికే కాదు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో గోదావరి నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల చొప్పున సముద్రంలో కలుస్తున్నట్లు 47 ఏళ్ల సగటు లెక్కల ఆధారంగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కడలి పాలవుతున్న గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించి ఆయకట్టును స్థిరీకరించే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావులు చర్చించారు.
జూలై 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
గోదావరిలో జూలై నుంచి అక్టోబర్ వరకూ సుమారు నాలుగు నెలలపాటు వరద ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున నాలుగు నెలల్లో 400–500 టీఎంసీల గోదావరి జలాలను తరలించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల కింద ఆయకట్టును స్థిరీకరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాల్లో ఇదో గొప్ప ముందడుగుగా సాగునీటి రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించడంపై సమగ్రంగా అధ్యయనం చేసి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులను ఇద్దరు సీఎంలు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టును చేపట్టి రెండేళ్లలోగా పూర్తి చేసి శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీరు అందించాలని నిర్ణయించారు. మరోవైపు నాగార్జునసాగర్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలను దీనిద్వారా సస్యశ్యామలం చేయాలని నిర్ణయించారు.
ఉమ్మడిగా కమిటీ ఏర్పాటు
ఇద్దరు ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించడంపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైడ్రాలజీ విభాగం సీఈ రత్నకుమార్, తెలంగాణ అంతరాష్ట్ర విభాగం సీఈ నర్సింహరావుల నేతృత్వంలో ఉమ్మడిగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ తరఫున రిటైర్డు ఈఎన్‌సీలు రోశయ్య, బీఎస్‌ఎన్‌రెడ్డి, రెహమాన్, సుబ్బారావు, రౌతు సత్యనారాయణలు, తెలంగాణ తరఫున రిటైర్డు ఈఎన్‌సీలు శ్యాంసుందర్‌రెడ్డి, వెంకటరామారావు, సత్తిరెడ్డి తదితరులు సహకరించనున్నారు.
ఐదు రకాల ప్రతిపాదనలు...
అభయారణ్యం, వైల్డ్ లైఫ్ శాంక్చరీ, అటవీ భూములు అధికంగా ఉంటే కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు సాధించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అటవీ భూములు తక్కువగా సేకరించేలా, అభయారణ్యం, వైల్డ్ లైఫ్ శాంక్చరీలను తప్పిస్తూ గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించేలా అలైన్‌మెంట్ రూపొందించాలని ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్‌లు అధికారులను ఆదేశించారు. మైదాన ప్రాంతం ద్వారా నీటిని తరలించేలా చర్యలు చేపట్టగలిగితే ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా తగ్గించవచ్చని, వీటిని దృష్టి పెట్టుకుని అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల జలవనరుల విభాగం అధికారులు ఐదు రకాల ప్రతిపాదనలు చేశారు.
ప్రతిపాదన – 1
దుమ్ముగూడెం–టెయిల్‌పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం. అంటే.. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను టెయిల్‌పాండ్ ప్రాజెక్టులోకి కాకుండా నేరుగా నాగార్జునసాగర్‌కు సగం నీటిని తరలించడం. మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైలంలోకి తరలించడం.
ప్రతిపాదన – 2
అకినేపల్లి నుంచి గోదావరి జలాలను తరలించి నాగార్జునసాగర్‌లోకి సగం నీటిని ఎత్తిపోయడం. మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైలంలోకి తరలించడం.
ప్రతిపాదన – 3
రాంపూర్ నుంచి గోదావరి జలాలను తరలించి నాగార్జునసాగర్‌లోకి సగం నీటిని తరలించడం. మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైలంలోకి ఎత్తిపోయడం.
ప్రతిపాదన – 4
ఇంద్రావతి కలసిన తర్వాత మేడిగడ్డకు దిగువన తుపాకులగూడెంకు ఎగువ నుంచి గోదావరి జలాలను తరలించి.. సగం నీటిని నాగార్జునసాగర్‌లోకి, మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైలంలోకి తరలించడం.
ప్రతిపాదన – 5
పోలవరం ఎగువ నుంచి గోదావరి జలాలను తరలించి ఒక బ్రాంచ్ ద్వారా సగం నీటిని నాగార్జునసాగర్‌లోకి, మరో బ్రాంచ్ కాలువ ద్వారా సగం నీటిని శ్రీశైంలోకి ఎత్తిపోయడం. (పోలవరం నుంచి నీటిని తరలించాలంటే అధిక శాతం అటవీ భూమిని సేకరించాల్సి వస్తుందని, అభయారణ్యం అడ్డొస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను ఇరు రాష్ట్రాల అధికారులు ఆదిలోనే తిరస్కరించారు).
శరవేగంగా సర్వే..
గోదావరి జలాల తరలింపుపై రెండు రాష్ట్రాల అధికారులు, నిపుణులు చేసిన ప్రతిపాదనల ఆధారంగా టోపోగ్రాఫికల్ అలైన్‌మెంట్‌ను రూపొందించి క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే చేయనున్నారు. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదేశించిన నేపథ్యంలో లేడార్ సర్వే ద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలించే రెండు మూడు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని తరలించే ప్రతిపాదనలను రూపొందించి ఇద్దరు సీఎంలు ఖరారు చేసిన ప్రతిపాదనల ఆధారంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక, అంచనాలు (ఎస్టిమేట్లు) తయారు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులకు ఒకసారి రెండు రాష్ట్రాల జలవనరుల ఉన్నతాధికారులు సమావేశమై సర్వే పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు.
దామాషాలో ప్రాజెక్టు ఖర్చు
కృష్ణా నది ద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు ఏ మేరకు ప్రవాహం వస్తుంది? ఏ మేరకు నీటి కొరత ఉంటుంది? నీటి ఎద్దడిని అధిగమించడానికి ఏ ప్రాజెక్టులకు ఎంత మేరకు నీరు అవసరం? అనే వివరాలను సేకరించాలని రెండు రాష్ట్రాల అధికారులను ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ ఆదేశించారు. దీని ఆధారంగా గోదావరి నుంచి రోజుకు ఎన్ని టీఎంసీల జలాలను తరలించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. గోదావరి నుంచి తరలించే జలాల వినియోగం ఆధారంగా దామాషా పద్ధతిలో ప్రాజెక్టు వ్యయాన్ని, నిర్వహణ ఖర్చులను భరించేలా ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
దేశానికి ఆదర్శం: వైఎస్ జగన్
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో, నీటిపారుదల రంగం విషయంలో కేసీఆర్ అందిస్తున్న సహకారం చాలా గొప్పదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరయ్యే విషయంలో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, రెండు రాష్ట్రాలు కలసి నదీ జలాలను తమ సాగునీటి అవసరాలు తీర్చే విధంగా మలుచుకుంటే ఎంతో ఉత్తమమని తాను భావించానని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను ఎవరో పరిష్కరించడం కంటే, ఈ రెండు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. రెండు రాష్ట్రాలు వేసిన అడుగు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
గొప్ప ప్రారంభం: కేసీఆర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలసి ముందడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత జరిగిన మొదటి సమావేశం గొప్ప ప్రారంభమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విభజన సందర్భంగా తలెత్తిన అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా, సానుకూల ధృక్పథంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఖడ్గచాలనం అవసరం లేదని, కరచాలనం కావాలన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించాలనేది తమ విధానమని, అదే విధానంతో మహారాష్ట్రతో వ్యవహరించి ఫలితం సాధించామన్నారు. తెలంగాణ, ఏపీ కూడా అలాగే వ్యవహరించి పరస్పరం మేలు కలిగే విధంగా వ్యవహరిస్తాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు ఫలితాలు అందించాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment