వేలేరుపాడు: ‘ఉన్నట్టుండి గోదావరికి వరద పోటు చేరింది. పెద్దవాగులోకి నీళ్లు ఎగదన్నాయి. దారులన్నీ మూసుకుపోయి రుద్రమకోట ఓ ద్వీపంలా మారిపోయింది. అటు కుక్కునూరు వెళ్లలేని పరిస్థితి. ఇటు వేలేరుపాడు రాలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం క్షణాల్లో అధికారులను పంపించింది. వారిచ్చిన సూచనల మేరకు మేమంతా సమీపంలోని ఓడగుట్టపైకి వెళ్లిపోయి తలదాచుకున్నాం.
వరదలో మునిగిన పశువుల్ని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బోట్ల సాయంతో ఓడగుట్టపైకి చేర్చారు. తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి.. జనరేటర్ల సాయంతో వెలుగులు నింపారు. వరద తగ్గే వరకు ఇక్కడే ఆశ్రయం కల్పించారు. ఆహారం సమకూర్చా’రంటూ రుద్రమకోట గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
వరదల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ పట్ల ఎంతో ఔదార్యం చూపారని.. ఆపద వేళ ఆపన్న హస్తం అందించి ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట వరద బాధితుల కోసం ఓడగుట్టపై ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో గ్రామానికి చెందిన 440 కుటుంబాల వారు ఆశ్రయం పొందుతున్నారు.
ఏ లోటూ లేకుండా చూస్తున్నారు
వరదల వల్ల తాము గ్రామం వదిలిపోవాల్సి వచ్చిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని నిర్వాసితులు చెప్పారు. తమ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారని తెలిపారు. గోదావరి గట్టుపైనే తమ గ్రామం ఉన్నందున చిన్నపాటి వరదొచ్చినా వరద తాకిడికి గురవుతుంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినప్పుడల్లా ఓడగుట్ట పైకి చేరి నానా అగచాట్లు పడేవారమని, తమను పట్టించుకునే నాథుడు ఉండేవారు కాదని చెప్పారు. ముఖ్యమంత్రి ముందస్తు ఆదేశాల మేరకు ఇక్కడ జనరేటర్లు ఏర్పాటు చేశారని, గ్రామానికి రెండు బోట్లు కేటాయించారని గ్రామస్తులు వివరించారు.
గ్రామాన్ని వరద చుట్టుముట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామస్తులందరినీ బోట్లలో ఓడగుట్టకు తరలించారని, పశువులను కూడా బోట్లలో ఓడగుట్టకే తరలించారు. అక్కడే తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసి.. నిత్యావసర వస్తువులన్నీ సమకూర్చారని తెలిపారు.
అప్పట్లో రెండు కేజీల బియ్యం ముఖాన కొట్టేవారు
తెలుగుదేశం హయాంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తాము పడిన బాధలను గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. టీడీపీ హయాంలో వరదలు వచ్చినప్పుడు రెండు కిలోల బియ్యం, లీటర్ కిరోసిన్ చొప్పున తమ ముఖాన కొట్టి చేతులు దులుపుకునేవారని చెప్పారు. అవి అయిపోతే తమను పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దయ వల్ల తాము అన్ని సౌకర్యాలు పొందగలిగామని, ఏ లోటూ లేకపోవడంతో ఓడగుట్టపై ధైర్యంగా గడపగలుగుతున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ తమ గ్రామానికి ఎంతో సాయపడిందన్నారు. సచివాలయంలో పనిచేసే వీఆర్వో, వలంటీర్, పోలీస్, ఏఎన్‌ఎం, పశు వైద్యశాఖ ఏహెచ్‌ఏ తమను కంటికి రెప్పలా చూసుకున్నారన్నారు. నిత్యావసర వస్తువులతోపాటు తాగునీరు, పాలు, ఐదు రోజులకు సరిపడా కూరగాయలు, బ్రెడ్, చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇచ్చారని వివరించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సందర్శించి వరద బాధితులకు కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
ఎప్పుడూ ఇంత సాయం అందలేదు
ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత సాయం అందలేదు. మేం గుట్టకు వెళ్లిన వెంటనే మంచినీటి ప్యాకెట్‌లు అందించారు. కూరగాయలు ఇచ్చారు. ఏ లోటూ రాకుండా చూశారు. – కణితిరెడ్డి లక్ష్మీనర్సయ్య, వరద బాధితుడు
పశువుల్ని కూడా కాపాడారు
గోదావరి నీటిలో మునిగిన పశువులను కూడా కాపాడారు. గ్రామంలో ఉన్న వందలాది పశువులను బోట్లలో ఓడగుట్టకు తరలించారు. పశు నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సీఎం జగన్‌కు ధన్యవాదాలు – షేక్ షఫీ, వరద బాధితుడు
అప్పట్లో బియ్యంతో సరిపెట్టారు
టీడీపీ హయాంలో కేవలం రెండు కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 25 కేజీల బియ్యంతోపాటు కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, తక్షణ సాయంగా 2వేల నగదు అందజేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాకు అన్నీ సమకూర్చారు. విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్న గ్రామస్తులకు జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇలా ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. – జి.భాస్కర్, రుద్రమకోట గ్రామస్తుడు
Comments
Please login to add a commentAdd a comment