
సాక్షి, పశ్చిమగోదావరి: గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్ర కోసం అభిమానులు బారులుతీరారు. సీఎం జగన్ కోసం మేము సిద్ధం అంటూ నీరాజనం పలుకుతున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
నిడమర్రులో కొట్టుకుపోయిన కట్టుకథలు
గోదావరి పోటెత్తింది. అవును అభిమాన సంద్రం ఉరకలేసింది. మేమంతా సిద్ధం పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తోన్న బస్సు యాత్ర నిడమర్రు, గణపవరం మీదుగా వస్తున్నప్పుడు జనసంద్రం కనిపించింది. నిడమర్రులో ముఖ్యమంత్రి వైయస్.జగన్‌ను చూసేందుకు చుట్టున్నపల్లెలన్నీ కదిలివచ్చాయి. బస్సుయాత్రకు సాంతం.. అడుగడుగునా అక్కచెల్లెమ్మల నీరాజనాలు పట్టారు. మేమంతా సిద్ధమంటూ వెంట నడిచారు. తన కోసం వేచి చూస్తున్న అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను బస్సుదిగి స్వయంగా పలకరించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. ఈ బస్సు యాత్ర ప్రతిపక్షాల కట్టుకథలను ఒక ధాటిన కొట్టేసినట్టయింది. ఇన్నాళ్లు గోదావరిలో మా గాలి వీసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చిన మాటలన్నీ భ్రమలేనని బయటపడ్డాయి. గోదావరి ప్రేమ.. చల్లగా ఫ్యాన్ గాలిలా వీస్తోందని పక్కాగా తెలిసిపోయింది.
మేం గోదారోళ్లమండి బాబూ!
ఇంటి అల్లుడే కాదు..ఊరికొచ్చిన చుట్టమూ...మాకు దేవుడితో సమానం!
వెటకారం పాలెక్కువని కొంతమంది అంటూంటారు!
కాసింత నిజమున్నా దానికి పదింతలు మమకారం పంచుకుంటాం మేం!
అలాంటి మా ప్రాంతానికి... సంక్షేమ రథసారథి..
ఆంధ్రరాష్ట్రంలోని పేదలందరి పెన్నిధి..
సాక్షాత్ వై.ఎస్. జగన్మోహన రెడ్డి విచ్చేస్తే ఊరుకుంటామా!
అభిమానం అంబరాన్ని అంటదూ?
వంద సంక్రాంతుల సంబరం మొదలవదూ?
అన్నయ్యను చూసుకునేందుకు చెల్లెమ్మలు..
మనవడిని చూసి మురిసిపోయేందుకు అవ్వాతాతలు..
ఆగమాగమైపోరు! అందుకే గణపవరం ఇలా కిక్కిరిసిపోయింది!
జనసంద్రమంది.. వీరందరి కళ్లనిండా.. మనసు నిండా...
జగన్మోహనుడే!
గణపవరంలో జనజాతర
సీఎం వైయస్.జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా గణపవరంలో ప్రజాసమూహం పోటెత్తింది. రోడ్డుకిరువైపులా బారులు తీరిన జనం సీఎం జగన్‌ను కలిసేందుకు పోటీ పడ్డారు. మండుటెండలు, పెరిగిన ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా.. తన కోసం వచ్చిన ప్రజల కోసం బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు సీఎం జగన్.
దద్దరిల్లేందుకు భీమవరం సిద్ధం
బస్సు యాత్ర ఉండి చేరగానే కొద్దిసేపు ఆగి భోజన విరామం తీసుకుంటారు ముఖ్యమంత్రి జగన్. మధ్యాహ్నం 3.30గంటల సమయంలో సీఎం జగన్ బస్సు యాత్ర భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ ప్రాంతానికి చేరే అవకాశముంది. సాయంత్రం 3.30 గంటలకు ఇక్కడ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు వచ్చే జనమే గోదావరి ప్రేమకు నిదర్శనమంటున్నారు వైఎస్సార్‌సిపి నాయకులు.
ఇక, ఉండి నియోజకవర్గంలోని ఆరేడు గ్రామంలో సీఎం జగన్ కోసం ప్రజలు బారులు తీరారు. ఆరేడు గ్రామం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. నిన్న గుడివాడలో జరిగిన బస్సుయాత్రకు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. ఎండను సైతం లెక్కచేయకుండా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభను అభిమానులు విజయవంతం చేశారు.