ఆ పేరే... ఒక నమ్మకం! | Sakshi Editorial On CM Jagan Wefare Schemes Govt | Sakshi
Sakshi News home page

ఆ పేరే... ఒక నమ్మకం!

Published Sun, Apr 28 2024 4:32 AM | Last Updated on Sun, Apr 28 2024 10:43 AM

Sakshi Editorial On CM Jagan Wefare Schemes Govt

నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్‌ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.

నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్‌ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్‌ ఫోన్‌ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా  బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!

ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. 

డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్‌ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్‌జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్‌జీఆర్‌ను ‘పురట్చి తలైవర్‌’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.

ఎమ్‌జీఆర్, ఎన్టీఆర్‌ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్‌మోహన్‌రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.

జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్‌ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్‌జీఆర్‌ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్‌మోహన్‌రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్‌. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్‌కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్‌ ఓ అధ్యయనాంశం.

జగన్‌మోహన్‌రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్‌ మోస్ట్‌ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్‌మోహన్‌రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?

కారణం... ఆయన క్యారెక్టర్‌. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్‌ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్‌ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్‌. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్‌గా కమ్యూని కేట్‌ అయింది. గోబెల్స్‌ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని  బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్‌ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.

జగన్‌మోహన్‌రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. 

మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్‌ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.

చంద్రబాబు బోగస్‌ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన తీరు లైవ్‌లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్‌లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. 

ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్‌ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్‌ లివ్‌ ది రివల్యూషన్‌! ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!!
​​​​​​​

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement