జూన్ 16, పిఠాపురం: ‘శక్తిపీఠం సాక్షిగా చెబుతున్నా. నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ – ఉప్పాడ సెంటర్‌లో జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్రకటన ఇది.
జూన్ 21వ తేదీనాడు రెండు యెల్లో మీడియా ప్రధాన పత్రికలు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను చాంతాడంత పొడవుతో ప్రచురించాయి. అందులో ఒక ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం: ‘‘సీఎం అని మా వాళ్ల కోసం అన్నాను. సీఎం పదవి అంటే చాలా అనుభవం కావాలి. సీఎం అని మా వాళ్లు అదేపనిగా అరుస్తుంటే, నా కేడర్ స్టేట్‌మెంట్‌ను ఆమోదించాను. సీఎం అని మావాళ్లు అనుకుంటే సరిపోదు, ప్రజలు కూడా అనుకోవాలి.’’
ఇరవై ఒకటిన పేపర్లలో ఇంటర్వ్యూ వచ్చింది. ఇరవైన ‘ఆ రెండు’ పత్రికలకు పవన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే పిఠాపురం సభ తర్వాత సరిగ్గా నాలుగు రోజులకు! దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో సర్వశక్తిమంతమైనదిగా ప్రాచుర్య మున్న పురుహూతికాదేవి శక్తిపీఠం సాక్షిగా చేసిన ప్రకటన నాలుగు రోజులకే చెల్లుబాటు కాకుండా పోయింది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో (‘ప్రజారాజ్యం’ స్థాపన దగ్గర నుంచి) తన మాటలను తానే చెల్లుబాటు కాకుండా చేసుకున్న ఘటనలు కోకొల్లలు. రాజ కీయాల్లో మా వాడు చెల్లని రూపాయిగా మారిపోతున్నాడని ఆయన అభిమానులు బహిరంగంగానే ఆవేదన పడుతున్నారు. పిఠాపురంలో శక్తిపీఠం సాక్షిగా చేసిన ప్రకటనకు సరిగ్గా 36 రోజుల ముందు ఇదే అంశంపై మంగళగిరిలో ఆయన ఇంకో రకంగా మాట్లాడారు.
మే 11న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సీఎం అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ ఇలా బదులిచ్చారు – ‘‘ఒక మాట చెబుతున్నా. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం. 30–40 స్థానాల్లో కూడా గెలిపించలేకపోయారు. అటువంటప్పుడు మన వాదన (సీఎం కావాలనే)కు పస ఉండదు.
సినిమాల్లో నన్ను ఎవరూ సూపర్ స్టార్‌ను చేయలేదు.నేను సాధించుకున్నదే! రాజకీయాల్లో కూడా టీడీపీ కావచ్చు.బీజేపీ కావచ్చు. నన్ను సీఎంను చేస్తామని ఎందుకంటారు? నేనే టీడీపీ అధ్యక్షుడినైనా ఆ మాట అనను. బలం, సత్తా చూపించి పదవి తీసుకోవాలి. కండిషన్లు పెడితే పని జరగదు. పొత్తుల కోసం నా ఏకైక కండిషన్ వైఎస్సార్‌సీపీని గద్దె దించాలి. అంతే.’’ తన అసలు లక్ష్యాన్ని పవన్ అక్కడ ప్రకటించారు.
‘ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు మీ అభిమానుల నుంచీ, జనసేన కార్యకర్తల నుంచీ విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందేమో’నని ఒక విలేకరి తన సందేహాన్ని పవన్ ముందు వ్యక్తం చేశారు. ‘‘విమర్శలు వస్తాయనే భయాలు నాకు లేవు. అభిమానులు నిరాశపడటానికి ఇదేమీ సినిమా కాదు. కార్య కర్తలైనా సరే నాతో నడిచేవాళ్లే నా వాళ్లు’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అంటే పొత్తులు ఖాయమనీ, ముఖ్యమంత్రి పదవి అడిగే అర్హత తనకు లేదనీ, కార్యకర్తలు ఇందుకు అంగీక రించవలసిందేననే భావాన్ని ఆయన కుండబద్దలు కొట్టి ప్రకటించారు. మరి నెలరోజులు తిరిగే సరికే పిఠాపురం శక్తిపీఠం సాక్షిగా చేసిన ప్రకటన? సినిమా షూటింగ్ కోసం అనుకోవాలా?
కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న యోధుల్లో కూడా సూపర్‌స్టార్‌లూ, పవర్ స్టార్‌లూ, మెగాస్టార్‌లూ తరహా విభజన ఉండేది. అప్పట్లో అర్ధరథి, రథి, అతిరథి, మహారథి వంటి పేర్లతో పిలిచేవారు కావచ్చు. అందులో ఓ పవర్‌స్టార్ స్థాయి వీరుని పేరు సైంధవుడు. కాకపోతే అతని పవర్ యుద్ధంలో ఒక్కరోజుకే పరిమితం. యుద్ధంలో అతని లక్ష్యం – కౌరవులను గెలిపించడం! స్వయంగా తానే పాండవులను ఓడించాలనే కోరిక అతనికి మొదట్లో ఉండేది. అందుకోసం ఘోరమైన తపస్సు కూడా చేశాడు.
శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తన చేతిలో పాండవులు ఓడిపోవాలని సైంధవుడు కోరుకున్నాడు. స్థాయికి తగని వరాన్ని ఇవ్వడం పాడి కాదనుకున్నాడు శివుడు. సైంధవుడికి హితవు చెప్పి అర్జునుడు అందుబాటులో లేని రోజున, మిగిలిన నలుగురిని యుద్ధంలో ముందుకు పోకుండా అడ్డు కోగలిగే ‘సింగిల్ యూజ్’ వరాన్ని ప్రసాదిస్తాడు.
ఆ వరం ఒక్కరోజుకే పనికొస్తుందన్న మాట! ఈ ‘వన్‌డే వండర్’ను దుర్యోధనుని గెలుపు కోసం ఉపయోగించాలని సైంధవుడు భావిస్తాడు. సైంధవుడి కథ సాంతం మనందరికీ తెలిసిందే. ఇతడి కారణంగానే అభిమన్యుడు అసువులు బాసిన సంగతీ తెలిసిందే. ఎవరైనా హఠాత్తుగా ఊడిపడి ఏ కార్యానికైనా అడ్డుతగిలితే సైంధవుడిలా అడ్డు పడ్డాడనడం రివాజుగా మారింది. 2014లో వైసీపీ విజయానికి పవన్ కల్యాణ్ సైంధవుడిలా అడ్డుపడ్డాడనే మాట కూడా వినిపించింది.
అందులో కొంత లాజిక్ కూడా ఉన్నది. రెండు శాతం కంటే తక్కువ తేడాతో అప్పుడు జగన్ పార్టీ అధికా రానికి దూరమైంది. జనసేన పార్టీ పోటీ చేయ కుండా టీడీపీకి మద్దతు ఇచ్చింది. అప్పుడు దానికి ఓ నాలుగు శాతం ఓట్లు ఉండవచ్చని అంచనా. 2019లో బీఎస్‌పీ – కమ్యూనిస్టుల పొత్తుతో జనసేన కూటమికి ఆరు శాతం ఓట్లు పడ్డాయి. ఆ నాలుగు శాతం అంచ నాకు ఇదే ఆధారం. 2014లో జనసేన విడిగా పోటీ చేసిన ట్టయితే ఫలితం తరగబడి ఉండేదేమో!
చంద్రబాబు ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీకి ఉపయోగ పడే ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్‌గా జనసేన పార్టీ ఏర్పాటైందనే విమర్శ కూడా ఉన్నది. ఇది ఫక్తు రాజకీయ విమర్శే. కానీ, ఈ విమర్శకు బలం చేకూర్చే పరిణామాలు కూడా జరుగుతున్న నేప థ్యంలో దీనిపై లోతైన పరిశీలన అవసరమౌతున్నది. ముఖ్యంగా మూడు అంశాలు జనసేన మీద విమర్శలకు బలం చేకూర్చు తున్నాయి.
1. ఎన్నికల సమయానికల్లా తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా జనసేన ఎత్తుగడలు ఉండటం.
2. ఒక స్థిరమైన సైద్ధాంతిక ప్రాతిపదిక, రాజకీయ దృక్పథం లేకుండా ఎప్పటికప్పుడు రంగులు మార్చేయడం.
3. తాజా పరిస్థితుల్లో జనసేన ఎంచుకుంటున్న క్షేత్ర ప్రాధాన్యతలు, టార్గెట్ చేస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండటం.
మొదటి ఎన్నికల్లో కలిసి పోటీచేయడం ద్వారా తెలుగు దేశం పార్టీకి దోహదపడిన జనసేన రెండో ఎన్నికల్లో అదే ప్రయోజనం కోసం విడిగా పోటీ చేసింది. అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకపక్షంగా పడకుండా చీలిపోతే తనకు ఉపయోగమని భావించింది. ఆ వ్యూహం ప్రకారమే విడిగా జనసేన ఫ్రంట్ ఏర్పాటైందని వైసీపీ ఆరోపణ.
ఆ ఆరోపణను పూర్వపక్షం చేయడంలో జనసేన విఫలమైంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ భావిస్తున్నది. ఈ భావననే హెచ్‌ఎంవి గ్రామఫోన్ రికార్డు మాదిరిగా పవన్ కల్యాణ్ పదేపదే వినిపిస్తున్నారనే అభిప్రాయం బలపడు తున్నది. రాజ కీయాల్లో జనసేన కూడా టీడీపీ కోసం సైంధవ పాత్ర పోషిస్తున్నదని జనం భావిస్తే ఆ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఫలితం ఉండకపోవచ్చు.
జనసేనకు స్పష్టమైన సిద్ధాంతాలు గానీ, ఆశయాలు గానీ లేవని జనసేనాపతి మాటల ద్వారానే అర్థం చేసుకోవచ్చు. జనసేన ఆవిర్భవించిన తర్వాత ఈ పదేళ్లలో ఆయన వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, చేసిన ప్రసంగాలు, ధారబోసిన భావజాలం, ఒలకబోసిన వాగామృతం – అంత టినీ ప్రోది చేసి చూస్తే ఎంతటివారలైనా గందరగోళానికి గురి కాక తప్పదు. అటువంటి గందరగోళానికి జనసైనికులూ, వీర మహిళలూ గురికాకూడదని పవన్ కల్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
‘వ్యూహం నాకొదిలేయండి, మీరు అనుసరించండ’ని కార్యకర్తలతో ఆయన పదేపదే చెబుతున్నారు. ‘ఒక్కసారి నేను కమిటయితే మీ మాట మీరే వినకండి, బ్లైండ్‌గా ఫాలో అవ్వండి’ అనేది ఆయన సందేశం. రాజకీయ పార్టీ ఇలా కూడా ఉంటుందా? ఉండదు! ఇది చంద్రబాబు ప్రారంభించిన స్పెషల్ పర్పస్ వెహికిల్ అని వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థులు అలా ఆరోపిస్తూనే ఉంటారు. కానీ, ఆరోపణ తప్పని రుజువు చేయవలసిన బాధ్యత మాత్రం పవన్ కల్యాణ్ భుజస్కంధాలపైనే ఉన్నది.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేయడమన్నది పక్కా అయినట్లే. ఇది బాబు డిసైడ్ చేసిన స్కీమే కనుక ఇందుకు భిన్నంగా ఉండదు. ఆ దేవుడు శాసించాడు... ఈ అరుణాచలం పాటిస్తాడు, అంతే. బీజేపీని కూడా లాక్కొని రావాల్సిన బాధ్యతను పవన్‌కు బాబు అప్పగించారు కనుక ఆ ప్రయత్నంలో భాగంగా కొంత వ్యూహాత్మక ఆలస్యం జరిగి ఉండవచ్చు. 34 అసెంబ్లీ సీట్లున్న గోదావరి జిల్లాల్లో గణనీయంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చే కర్తవ్య దీక్షతో వారాహి రథం మొదట గోదావరి తీరానికే చేరింది.
కాపులతోపాటు ఇతర వర్గాల్లో కూడా పేరు ప్రఖ్యాతులున్న ముద్రగడ పద్మనాభంపై కొత్తతరం కాపు యువతను ఎగదోసే ప్రయత్నం చేశారు. ముద్రగడను అవ మానించిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు శత్రువు తనకూ శత్రువే అన్నట్టుగా పవన్ కల్యాణ్ ఈ పర్యటనలో వ్యవహరించారు. ముద్రగడను సామాజిక వర్గానికి దూరం చేయకుండా ఆ ఓట్లను బాబు వైపు మళ్లించడం సాధ్యంకాకపోవచ్చన్న ఆలోచన కూడా ఈ టార్గెట్‌కు కారణం కావచ్చు.
తన సామా జికవర్గ బలం పెద్దగా లేకపోయినా అన్నివర్గాల మద్దతుతో కాకినాడలో నెగ్గుకొస్తున్న ద్వారంపూడిపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. ఇందుకు బదులుగా కాకినాడలో ద్వారంపూడిపై గానీ, పిఠాపురంలో తనపై గానీ పోటీ చేయాలని ముద్ర గడ విసిరిన సవాల్‌కు మాత్రం పవన్ జవాబు చెప్పలేక పోయారు.
ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సహజం. పవన్ కూడా ప్రభుత్వం మీద ఈ పర్య టనలో చాలా విమర్శలే చేశారు. ఆ విమర్శలకు ఆధారం మాత్రం యెల్లో మీడియా కథనాలు, తెలుగుదేశం ప్రవచనాలే అన్నట్టుగా ఈ పర్యటన సాగింది. ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం. రాష్ట్రంలో 31,177 మంది మహిళలు అదృశ్యమయ్యా రనీ, వీరిలో 40 శాతం మంది 18 యేళ్లలోపు యువతులేననీ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ఆధారంగా చెబుతున్నాననీ పవన్ అన్నారు.
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2019 నుంచి 2022 మధ్యకాలంలో రాష్ట్రాల వారీగా మహిళల అదృశ్యానికి సంబంధించిన టాప్–టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో రాష్ట్రంలో అదృశ్యమైన వారి సంఖ్య 2,746. అందులో 2,737 మందిని సురక్షితంగా మళ్లీ ఇళ్లకు చేర్చారు. ఇంకా జాడ తెలి యనివారు కేవలం తొమ్మిది (9) మంది మాత్రమే.
అదే బాబు హయాంలో అంతకు ఒక సంవత్సరం ముందు 2018లో అదృశ్యమైన మహిళల సంఖ్య 6,520. అందులో ఇళ్లకు చేరిన వారు 2,195 మంది. 4,325 మంది జాడను ఆ ప్రభుత్వం కని పెట్టలేకపోయింది. బాబు హయాంలోని ఐదేళ్లూ, జగన్ హయాంలో నాలుగేళ్ల లెక్కలూ దాదాపు ఇదేవిధంగా ఉన్నాయి. వాస్తవాలకు మసిపూయడంలో ఈయన యెల్లో మీడియాతో పోటీపడుతున్నట్టున్నారు.
గడచిన ఎన్నికల్లో తనను భీమవరం నియోజకవర్గంలో కక్షకట్టి ఓడించారనీ, అక్కడ మొత్తం ఓట్లకంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయనీ మరో ఆరోపణ చేసి నవ్వులపాలయ్యారు. ఎన్ని కల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం అక్కడ 77.9 శాతం ఓట్లు పోలయ్యాయి. 22.6 శాతం మంది ఓటే వేయలేదు. ప్రజల తెలివితేటల మీద, వివేచనా శక్తి మీద చులకన భావం ఉన్నవారు మాత్రమే ఇటువంటి ఆరోపణలు చేయగలుగుతారు. తొలివిడత వారాహి యాత్ర జనసేన పార్టీకి పెద్దగా ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయింది.
భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన లెక్కలు
తనకు కంచుకోటగా పవన్ భావించుకునే ప్రాంతాల్లో రోడ్లపై జరిగిన సభలకు ఎక్కడా మూడు నాలుగు వేలమందికి మించి రాలేదు. అందులో సగంమంది ఇరవయ్యేళ్ల లోపు పిల్లలే! ఎక్కడా యాభై మందికి మించి మహిళలు కనిపించలేదు. ఒక్క అమలాపురంలో మాత్రం సుమారు రెండొందల మంది కనిపించారు. జనసేన పార్టీకి జనసందేశం ఏమిటో అందినట్టేనా? ఈ సందేశానికి కారణమేమిటి? చంద్రబాబు ఎజెండా ప్రకారం జనసేన పనిచేస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లడమే కారణం.
దాన్ని పూర్వపక్షం చేయాలంటే ఒకటే మార్గం. జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం. లేదంటే పవన్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించి మెజారిటీ స్థానాల్లో పోటీచేసి ఇతర పార్టీలతో మిగిలినచోట్ల పొత్తు పెట్టుకోవడం. జగన్ ప్రభుత్వం కంటే మెరుగ్గా తానెలా పరిపాలించబోతున్నాడో సోదాహరణంగా చెప్పగలగడం.
అలా చేయకుండా చంద్రబాబు విసిరే పాతిక, ముప్పయ్ సీట్లను మహాప్రసాదంగా కళ్లకు అద్దుకుంటే జనసేన పార్టీ తెలుగుదేశం అనుబంధ సంఘమనే ప్రజాభిప్రాయాన్ని అధికారికంగా ధ్రువీకరించినట్టే! ఏటా రుతుపవనాలు వచ్చి పోయినట్టే చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా ఒక సైంధవ పవనం వచ్చి పోయేదని చరిత్రలో స్థిరపడిపోతుంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment