‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు, తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు, నేనంతా పిడికెడు మట్టే కావచ్చు – కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.’’ గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పంక్తులివి. పవన్ కల్యాణ్ తన గురించీ, తన రాజకీయ ప్రస్థానం గురించీ చెప్పుకోవడానికి ఈ పంక్తుల్ని వాడుకున్నారు. వేలాదిమంది అభిమానులు హాజరైన ఒక బహిరంగ సభలో జనసేన కార్యకర్తలకు ఆయన చేసిన బాస ఇది.
ఇప్పుడేమైంది పవన్‌జీ? ఆ ధీర గంభీర ప్రవచనాల కేమైనది? ఏవి తండ్రీ నిరుడు కురిసిన అగ్నిధారలు ఎక్క డయ్యా? నేనంతా పిడికెడు మట్టినే కదా! 175 నాకెట్లా సాధ్యమని బేలగా పలుకుతున్నారేమిటి? పొత్తుల జోలెలో చంద్రబాబు వేసే ముప్పయ్యో, నలభయ్యో చాలంటున్నారెందుకని? మీలో ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఎందుకు అవనతమైనది? ఆ పొగరు జెండాను తమ గుండెల మీద ఎగరేసుకున్న మీ అభిమానుల పరిస్థితేమిటి? ‘‘ఇల్లేమో దూరం. చీకటి పడింది. దారంతా గతుకులు. చేతిలో దీపం లేదు. అయినా గుండెల్లో ధైర్యముంది... వెళ్లొస్తా చిన్నమ్మా’’ అనే కవితను మీరు చదివినప్పుడు ‘అబ్బో మావాడు మహా తోపు’ అనుకున్న జనసైనికుల పరిస్థితి ఏమి కావాలిప్పుడు?
జగన్ సర్కార్‌ను తానొక్కడిగా ఎదిరించడం సాధ్యం కాదని పవన్ కుండబద్దలు కొడుతున్నారు. తానొక్కడి వల్లే కాదు, ఏ ఒక్కరి వల్లా కాదని కూడా తేల్చేశారు. ‘ఈ చీకటి దారిలో నేనొక్కడినీ వెళ్లలేను చిన్నమ్మా. తోడు కావాల’ని దీనంగా అర్థిస్తున్నారు. తోడు దొరికినా కూడా తాను ముందు నడవరట! ముందు చంద్రబాబు నడవాలి. ఆ వెనకే తానూ, తనతోపాటు మిగిలిన సమస్త జీవరాశి. లెఫ్ట్, రైట్ తేడాలు పక్కనపెట్టి తన చుట్టూ నిలబడాలని అభ్యర్థిస్తున్నారు. వీలైతే పంచభూతాలు, సప్త సముద్రాలు, నవగ్రహాలు కూడా అండగా వస్తే బాగుంటుందని ఆయన మనసులో బలంగా ప్రార్థిస్తూ ఉండవచ్చు.
ఆంధ్ర రాజకీయ రంగంలో ఒక విలుకాడుగా నిలబడు తాడని కొందరు అభిమానులు ఆశపడ్డ ఈ నటుడు చివరికి తన బొటనవేలును కోసి చంద్రబాబుకు దక్షిణగా సమర్పిస్తున్నారు. ‘నా పక్కన ఉండే నాదెండ్ల మనోహర్‌ను ఒక్క మాటన్నా సహించబోను. ఖబడ్దార్! ఆయనంటే ఇష్టం లేనివాళ్లు పార్టీ వదిలి వెళ్లిపోవచ్చ’ని కూడా పవన్ బాహాటంగా హెచ్చరించారు. మనోహర్... చంద్రబాబు ఏజెంటని పవన్ అభిమానులు, కాపు సామాజికవర్గం పెద్దల నిశ్చితాభిపాయం.
నిరంతరం పవన్ కదలికలను బాబుకు ఆయన చేరవేస్తుంటారని వారు బహిరంగంగానే ఆరోపిస్తుంటారు. బీజేపీతో సహా ఇతర పార్టీల నేతలను పవన్ కలిసినప్పుడు కచ్చితంగా మనోహర్ వెంట ఉంటారట! ఆ సంభాషణల కేసెట్‌ను చంద్రబాబుకు చేరవేస్తుంటారట! చంద్ర బాబు – పవన్ భేటీలో మాత్రం మనోహర్ కనిపించరట! ఎవరికీ చేరవేయవలసిన అవసరం లేదు కనుక! జనసేన ముఖ్యులే చెవులు కొరుక్కుంటున్న మాటలివి!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థనీ, వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడానికి టీడీపీ – బీజేపీ – జనసేనలతో కూడిన కూటమి ఏర్పడబోతున్నదనీ నిన్న పవన్ ప్రకటించడాన్ని ఒక కొత్త విషయంగా కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. వైసీపీ వాళ్లు మాత్రం ఈ సంగతి మాకెప్పుడో తెలుసని తేలిగ్గా తీసుకున్నారు. అసలు జనసేన పార్టీ సృష్టి స్థితి లయకారుడు చంద్రబాబేనని వాళ్లు ఎప్పటి నుంచో చెబు తున్నారు. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు దత్తపుత్రుడనే నామకరణాన్ని కూడా వైసీపీ అధినేత ఎప్పుడో ఖరారు చేశారు. బాబు చేత, బాబు కొరకు, బాబు పెట్టిన పార్టీగానే జనసేనను వైసీపీ వాళ్లు పరిగణిస్తారు. కనుక పవన్ కల్యాణ్ రాజకీయ విధాన ప్రకటన వారికెటువంటి ఆశ్చర్యాన్నీ కలిగించలేదు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ఎదురులేని శక్తిగా యువనేత జగన్‌మోహన్‌రెడ్డి కనిపించారు. ఆయన్ను ఓడించడానికి చంద్రబాబు ఒక పద్మవ్యూహాన్ని రూపొందించవలసి వచ్చింది. అందులో భాగంగానే జనసేన పేరుతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను తయారుచేసి, దాని చీఫ్‌గా పవన్ కల్యాణ్‌ను నియమించారని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఈ అంచనా నిజమేనని తదుపరి పరిణామాలు నిర్ద్వంద్వంగా నిరూపించాయి. ఆ ఎన్నికల్లో బాబు అప్పగించిన టాస్క్ మేరకు జనసేన పోటీ చేయలేదు.
సినిమా వ్యామోహమున్న యువతీయువకుల్లో, కొంతమేరకు కాపు యువతలో తనకున్న క్రేజును టీడీపీ ఓట్లుగా మలచడానికి పవన్ యథాశక్తి కృషి చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్, ఆయన టాస్క్‌ఫోర్స్ అతిథి పాత్రనే పోషించాయి. తరువాతి ఎన్నికల్లో చంద్రబాబు కొత్త టాస్క్‌ను అప్పగించారు. ఆయన అధికారంలో ఉన్నారు గనుక తనకు వ్యతిరేకంగా పడే ఓట్లు గంపగుత్తగా వైసీపీకి వెళ్లకూడదని భావించారు. వ్యతిరేక ఓటును చీల్చడం కోసం టాస్క్‌ఫోర్స్‌కు కమ్యూనిస్టులనూ, బీఎస్పీనీ జతచేసి రంగంలోకి దించారు. అయినా ఫలితం దక్కలేదన్నది వేరే విషయం.
ఇప్పుడు బాబు ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా పడే ఓట్లు చీలకూడదు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని పవన్ కల్యాణ్ గంభీరంగా చేస్తున్న ప్రకటనల వెనుక పరమార్థం – చంద్రబాబు ప్రయోజనమే! మొన్నటి ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులను గిరాటు వేసి, పవన్ బీజేపీ చెంతకు చేరడం కూడా బాబు వ్యూహంలో భాగమేనని కనిపెట్టడానికి కామన్‌సెన్సు సరిపోతుంది.
ఆ ఎన్నికల ముందు చంద్రబాబు... నరేంద్ర మోదీని అసభ్యంగా తిట్టిపోశారు. ఆయన ఓడిపోతారనే గుడ్డి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం కూడా చేశారు. చంద్రబాబు గ్రహచారం బాగాలేక నరేంద్ర మోదీ ఘనవిజయం సాధించారు. మోదీ ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి చేయగూడని పనులన్నీ చేయడానికి బాబు సిద్ధపడ్డారు.
పూర్వం బలవంతులైన రాజుల కటాక్ష వీక్షణాల కోసం బలహీనమైన రాజులు పడిన ప్రయాసనంతా చంద్రబాబు పడ్డారు. ధనరాశులతోపాటు గుర్రాలను, ఏనుగులను, యుద్ధ వీరులను, అందాల కన్యలను కూడా బలవంతుడైన రాజుకు కానుకలుగా పంపేవారట! చంద్రబాబు కూడా తన పార్టీలోంచి కొందరు నాయకులనూ, అందులో కొందరు ఎంపీలనూ బీజేపీ లోకి పంపించారు. వారితోపాటు తాను పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్ జనసేననూ, దాని చీఫ్‌ను కూడా బీజేపీ శిబిరానికి పంపించారు. చంద్రబాబు చాణక్యంపై బీజేపీ పెద్దలకు గ్రహింపు ఉన్నా కూడా సమర్పించిన కైంకర్యాలను వారి ప్రయోజనార్థం వారు స్వీకరించారు.
బీజేపీ శిబిరంలోకి చంద్రబాబు పంపించిన వారంతా బాబు సేవలోనే తరిస్తున్నారని చెప్పడానికి దృష్టాంతాలు కోకొల్లలు. బీజేపీ కొంగుతో చంద్రబాబు కొంగును ముడివేయడానికి పవన్ యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. ఇది వాస్తవం. బయటకు కనిపించిందంతా నటనే! పవన్‌పై చంద్రబాబు వన్‌సైడ్ లవ్ ప్రకటించడం నటనే. తరువాత తనను కలిసిన బాబుతో ‘ఐ లవ్ యూ టూ’ అని పవన్ చెప్పడం కూడా నటనే! ఈ సన్నివేశాలన్నీ చంద్రబాబు కూటమి రాసిన నాటకంలో భాగాలే. పరిణా మాలను గమనిస్తే– చంద్రబాబు సేవలో పవన్ కల్యాణ్ నిమ గ్నమై ఉన్నారని అర్థమవుతూనే ఉన్నది. అందుకు కారణ మేమిటన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.
తన ప్రధాన ఫ్రత్యర్థులుగా పవన్ కల్యాణ్ ప్రకటించుకున్న వైసీపీలోని చాలామంది నాయకులు ‘అంతా ప్యాకేజి మహిమ’ అనే భాష్యం చెబుతారు. ఆ మాట వింటే పవన్‌కు తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. ఆ కోపంలో ఒకసారి ప్రత్యర్థులకు చెప్పును కూడా చూపించారు. విమర్శలకూ, సమస్యలకూ ఆగ్రహం సమాధానం కాదని మన పురాణాలు, ఇతిహాసాలు ఎప్పటినుంచో బోధిస్తున్నాయి. పూర్వం కౌశికుడు అనే తపోబల సంపన్నుడిపై ఓ కాకి రెట్ట వేసిందట! కౌశికుడు కోపంతో కన్నెర్రజేసి కాకి వంక చూస్తాడు. ముని తపోబలం చేత ఆ కాకి మాడిపోతుంది.
అక్కడి నుంచి భిక్షాటన కోసం ఒక గ్రామాన్ని చేరుకొని, ‘భవతీ భిక్షాం దేహి’ అని ఒక ఇంటి ముందు పిలుస్తాడు. వ్యాధిగ్రస్థుడైన భర్త సేవలో పడి, ఆ ఇల్లాలు కొంత ఆలస్యంగా భిక్ష తెస్తుంది. ఆలస్యం చేసినందుకు కౌశికుడికి కోపం వస్తుంది. అలవాటు ప్రకారం కంటి అరుణిమను ఇల్లాలిపై ప్రయోగిస్తాడు. ఆమె కాలిపోదు. పైపెచ్చు చిరునవ్వు నవ్వుతుంది. ‘‘ఓయీ కౌశికా! నువ్వు కోపగిస్తే కాలిపోవడానికి నేను కాకిని కాదు. గృహధర్మానికి కట్టుబడిన ఇల్లాలిని. నా ధర్మనువర్తనలో కొంత ఆలస్యం జరిగినది. ధర్మాన్ని గురించి తెలియని నీ తపస్సు వృథా! వెళ్లి నేర్చుకో’’ అని హితబోధ చేస్తుంది.
ప్యాకేజి విమర్శలను పూర్వపక్షం చేయాలని పవన్ భావిస్తే అందుకు పరిష్కారం పాదరక్షలు కాదు. తన రాజకీయ ఎత్తుగడలు ప్రజల ప్రయోజనాల కోసమేనని వారిని నమ్మించగలగాలి. చంద్రబాబుతో తన మైత్రి లోకకల్యాణార్థమని రుజువు చేయగలగాలి. అందరూ కలిసి జగన్‌మోహన్‌రెడ్డిని ఓడిస్తే నెలకు మూడు వానలు కురుస్తాయనీ, బంగారు పంటలు పండుతాయనీ తాను చదివిన లక్ష పుస్తకాల పరిజ్ఞానంతో సహేతుకంగా నిరూపించవలసి ఉంటుంది. తాను చేగువేరా దగ్గర నుంచి శ్యామాప్రసాద్ ముఖర్జీ వరకు చేసిన ప్రయాణంలో బోలెడంత తాత్వికత దాగి ఉన్నదని తార్కికంగా నిరూపించ వలసి ఉంటుంది. అలా చేయకపోతే – మీ కన్నెర్రకు కాకులు భయపడతాయేమో... లోకులు భయపడరు!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
హవ్వ... సముద్రం ఒకడి కాళ్ల దగ్గరా?
Published Sun, May 14 2023 3:11 AM | Last Updated on Sun, May 14 2023 3:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment