స్నేహం కాదు, దాసోహం! | Sakshi Editorial On TDP BJP Alliance In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

స్నేహం కాదు, దాసోహం!

Published Sun, Mar 10 2024 1:47 AM | Last Updated on Sun, Mar 10 2024 4:59 AM

Sakshi Editorial On TDP BJP Alliance In Andhra Pradesh

జనతంత్రం

ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు స్నేహ హస్తాన్ని అందుకోవలసిన అవసరం బీజేపీకి ఉన్నదా? కామన్‌సెన్స్‌ ఉన్న వాళ్లె వరైనా లేదనే చెబుతారు. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నదని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఎన్డీఏకు సవాల్‌ విసరడం కోసం కాంగ్రెస్‌ పార్టీ కుట్టించుకున్న ‘ఇండియా’ బొంత ప్రతిపక్షాలకు స్ఫూర్తినివ్వలేక పోయింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ సమరశీలతను కోల్పోవడం బీజేపీకి అయాచిత వరంగా మారింది. ఈ పరిస్థితు లలో తనకు ఏమాత్రం బలం లేని ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒకటి రెండు సీట్లు గెలిచి తీరవలసిన అవసరం బీజేపీకి లేదు.

ఈ ఎన్నికల్లో గెలవాల్సిన తక్షణ లక్ష్యంతోపాటు బీజేపీకి ఒక దీర్ఘకాలిక వ్యూహం కూడా ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించడం కోసం అది వ్యూహాన్ని రూపొందించుకున్నది. ఇది బహిరంగ రహస్యం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు బీజేపీ తొలి టార్గెట్‌ తెలంగాణ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గురి తప్పినా 14 శాతం ఓట్లను సమీకరించుకోగలిగింది.

గెలిచే అవకాశాలున్నాయన్న వాతావరణాన్ని ఎన్నికల ముందు సృష్టించగలిగి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం రెట్టింపు అయి వుండేదన్న అంచనా ఆ పార్టీకి ఉన్నది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తామన్న అంచనాతో ఆ పార్టీ శ్రేణులున్నాయి. రాజకీయ పరిశీలకుల అభి ప్రాయాలు కూడా ఈ అంచనాకు అనుగుణంగానే ఉన్నాయి.

తెలంగాణ ఏక్‌నాథ్‌ షిండే ఎవరో త్వరలోనే తేలిపోతుందని ఇటీవల లక్ష్మణ్‌ వంటి సీనియర్‌ బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యా నిస్తున్నారు. శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని బీజేపీ సహకారంతో గద్దెనెక్కిన మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఎపిసోడ్‌ను ఈ నాయకుల మాటలు గుర్తు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రయోగాన్ని తెలంగాణలోనూ రిపీట్‌ చేయగలిగితే బీజేపీ తన లక్ష్యాన్ని దాదాపుగా చేరు కున్నట్టే! తెలంగాణ షిండేకు పార్టీ తీర్థప్రసాదాలను ఇవ్వడం ఆ తర్వాత ఒక లాంఛనం మాత్రమే!

లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 8 సీట్లు బీజేపీ ఖాతాలో పడితే షిండే ప్రయోగం ప్రారంభం కావచ్చన్న అభిప్రాయం బలపడు తున్నది. ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే బీజేపీకి తన సహకారం అవసరమనే ఒక ప్రతిపాదన చంద్రబాబు ద్వారా ఆ పార్టీ పెద్దలకు చేరింది. ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల కథ ముందుకు కదిలింది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బలహీన పడి, బీజేపీ బలం పుంజుకుంటే ముందుగా ముప్పు ముంచు కొచ్చేది కాంగ్రెస్‌కే! తెలంగాణ భవన్‌లో స్విచాఫ్‌ చేస్తే గాంధీ భవన్‌లో చీకటి కమ్ముతుందన్నమాట!!

తెలంగాణలో ఏక్‌నాథ్‌ ఎఫెక్ట్‌కూ, ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు లకూ ఏమిటి లంకె? చంద్రబాబుకు బీజేపీ చేయగలిగిన ప్రత్యుపకారమేమిటి? బీజేపీ జతగూడితే చంద్రబాబు ఏపీలో గెలుస్తాడా? ఇటువంటి ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి.

కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావడానికి తొంభై శాతం అవకాశాలున్నాయనుకుంటే ఏపీలో జగన్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి నూరు శాతం అవకా శాలున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 40 శాతం ఓటర్ల మద్దతు కనిపిస్తుంటే, ఏపీలో వైసీపీకి 50 శాతానికి పైగా ఓటర్ల మద్దతు కనిపిస్తున్నది. డజన్‌కు పైగా జాతీయస్థాయి సర్వేలు దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. బీజేపీకి ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నది. కానీ చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ప్రాణావసరం. ఆయనకది జీవన్మరణ సమస్య.

ఎన్డీఏ కూటమి తరఫున 400 సీట్లు, 50 శాతం ఓట్లు సంపా దించి రికార్డు సృష్టించాలని బీజేపీ పెద్దలు కలలు కంటున్నారు. గడచిన ఎన్నికల్లో ఎన్డీఏకి 45 శాతం ఓట్లు లభించాయి. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఏర్పడిన సానుభూతి ప్రభంజనంలో కాంగ్రెస్‌ పార్టీ 414 సీట్లు గెలిచింది. 49 శాతం ఓట్లకే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి ఆ రికార్డుపై కన్నేసింది. అందు కోసం కలసిరాగల ప్రతి రాజకీయ పక్షాన్నీ తన దొడ్లో కట్టేసుకుంటున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు విజ్ఞప్తిని మన్నించడానికి అది ఒక కారణం కావచ్చు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు మరో ప్రత్యా మ్నాయం కూడా బీజేపీకి లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని జగన్‌మోహన్‌రెడ్డి అవలంబిస్తున్నప్పటికీ, సైద్ధాంతికంగా బీజేపీ భావజాలానికి, రాజకీయ కూటమికి దూరంగానే ఉంటున్నారు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని ఎంజీ రామచంద్రన్‌ నుంచి నవీన్‌ పట్నాయక్‌ వరకు పలువురు ముఖ్య మంత్రులు అవలంబించి వారి రాష్ట్రాల ప్రయోజ నాలను కాపాడుకొచ్చారు. ఏపీ సీఎం జగన్‌దీ అదే వైఖరి. టీడీపీ వినతిని బీజేపీ నాయకత్వం అంగీకరించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం ఫలించాలంటే వైసీపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీ క్షీణించాలి. ఆ ఖాళీని మాత్రమే బీజేపీ ఆక్రమించగలదు. సాపేక్షంగా వైసీపీ యువ పార్టీ. పన్నెండేళ్ల వయసు. ఎదిగే దశ. యాభైశాతం ఓటుతో బలంగా ఉన్నది. పైగా అధికారంలో ఉన్నది. టీడీపీ అధినేతతో పోల్చితే వైసీపీ అధినేత వయసు పాతికేళ్లు తక్కువ. పాలనా సంస్కరణలు అమలు చేస్తూ, సామాజిక విప్లవాలను ఆవిష్కరిస్తూ, సరికొత్త శక్తులను పార్టీ నిర్మాణంలోకి సమీకరించుకున్నది.

ఇప్పుడు మండే నెత్తురుతో ఆ పార్టీ ఇంజన్‌ నడుస్తున్నది. ఇందుకు భిన్నంగా టీడీపీ పరిస్థితి కనిపిస్తున్నది. చంద్రబాబుకు వృద్ధాప్యం మీదపడింది. ఉపన్యాసాల్లో ఒక మాటకు బదులు మరో మాట చెబుతున్నారు. పార్టీలోకి కొత్త తరం రావడం లేదు. వచ్చినా ఒక సామాజిక వర్గం నుంచే వస్తున్నారు.

పార్టీ నాయకత్వం బాగా బలహీనపడింది. అధినేత సొంత కొడుకుతో పాటు, బావమరిది కూడా అప్రయోజకులుగా ముద్ర పడ్డారు. ఆ కారణంగానే బాబు జైల్లో పడ్డప్పుడు అసలు వారసు లకంటే పవన్‌ కల్యాణ్‌ ఎక్కువ వీరంగం వేశారు. పార్టీ క్షీణ దశతో పాటు చంద్రబాబుపై వస్తున్న అవినీతి ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు పార్టీని గుప్పెట్లోకి తీసుకొని నెమ్మదిగా దాని స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నాలు బీజేపీ చేయవచ్చు. గతంలో పలుమార్లు అవకాశ వాద పొత్తులతో బీజేపీని దగ్గరకు తీసుకొని, దాన్ని ఎదగనీయ కుండా బాబు నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు దానికి బీజేపీ ప్రతీ కారం తీర్చుకోవచ్చు. ఈసారి చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలి కాబోతున్నది.

ఏదో అద్భుతం జరగకపోతుందా? ఈ ఒక్కసారికి సూర్యుడు పడమటి కొండపై ఉదయించకపోతాడా? అనే ఆశ చంద్రబాబు, రామోజీ అండ్‌ గ్యాంగ్‌లో మిణుకుమిణుకుమంటున్నది. వారు తప్ప వివేకవంతులెవరూ ఈసారి జగన్‌మోహన్‌ రెడ్డి ఓడిపోతాడని భావించడం లేదు. సర్వేలు మాత్రమే కాదు. క్షేత్ర వాస్తవికత కూడా అందుకు భిన్నంగా లేదు.

ప్రజాస్వామ్య వ్యవస్థలోని పెత్తందారీ పోకడల కీళ్లు విరిచిన నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి. ఫలితంగా బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రాజకీయ స్రవంతిలోకి ప్రవేశిస్తున్నారు.ఒకటి కాదు,రెండు కాదు వరసగా మూడుసార్లు జగన్‌ సభలకు లక్షోప లక్షలుగా జనం హాజరయ్యారు. నేడు నాలుగో సభ పోటెత్తు తున్నది. రాజకీయ సభలకు ఈ స్థాయిలో జనం హోరెత్తడం వర్త మాన భారతంలో ఇంకెక్కడా మనకు కనిపించదు. వచ్చే ఎన్ని కల్లో జగన్‌ ప్రభంజనానికి ఇంతకంటే రుజువేమి కావాలి?

మరోసారి అధికారం దూరం కాబోతున్నదన్న ఏడుపే కాదు, చేసిన పాపాలు శాపాలై కేసుల రూపంలో వెంటాడ బోతున్నాయన్న భయం బాబు, రామోజీలను నిద్రపోనీయడం లేదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అరెస్టయిన బాబు ఇప్పుడు బెయిల్‌పై బయటకొచ్చారు. ‘ముసలివాణ్ణి, ఆరోగ్యం బాగాలేదు, దయచూడండ’ని కోర్టువారిని బతిమాలు కొని బయటకొచ్చి తిరుగుతున్నారు.

అమరావతి ప్రాంతాల ఎస్‌సీ, ఎస్‌టీ, బలహీన వర్గాలకు చెందిన 1500 ఎకరాల అసైన్డ్‌ భూమిని కొల్లగొట్టిన కేసు తలపై వేలాడుతున్నది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును స్వప్రయోజనాల కోసం అష్టవంకర్లు తిప్పిన కేసు. నిబంధనలను అటకెక్కించి ఫైబర్‌నెట్‌ను బినామీకి అంటగట్టిన కేసు. చేలాగాళ్ల డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులిచ్చిన కేసు. ఇసుక కుంభకోణంలో పదివేల కోట్లు దోచేసిన కేసు... ఇలా వరుసగా అనేకం చంద్రబాబును వెన్నాడుతున్నాయి.

ప్రతి కేసులోనూ చంద్రబాబు మీద పలు సెక్షన్లు నమోద య్యాయి. వాటిలో సీఆర్‌పీసీ 409 సెక్షన్‌ కింద నేరం రుజువైతే ప్రతి కేసులోనూ యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అవినీతి నిరోధక చట్టం 13 (2) రెడ్‌ విత్‌ 13 (1) సీ, డీ సెక్షన్ల కింద నేరం రుజువైతే ఒక్కో కేసులో పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. 17ఏ సెక్షన్‌ సాయంతో తప్పించుకోవాలనే చంద్ర బాబు ఎత్తు పారలేదు. ఆ సెక్షన్‌ చంద్రబాబుకు వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. చంద్రబాబు మీద నమోదు చేసిన అభియోగాలకు స్పష్టమైన ఆధారాలు న్నాయని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అభిప్రాయపడి రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

ఆధారాలున్నందువలన కేసు కొట్టి వేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా పేర్కొ న్నది. బాబుకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు. హరిహర బ్రహ్మాదులొచ్చినా ఆపలేరు. కానీ బీజేపీ వాళ్లు ఆపగలరని చంద్రబాబు దింపుడుకళ్లం ఆశ. అందుకే వారి ముందు సాగిలపడ్డారు. ఇప్పుడు నడుస్తున్న కేసులే దడ పుట్టిస్తుంటే ముగిసిపోయిందనుకున్న ఐఎమ్‌జీ కేసు ముందు కొచ్చింది. సీబీఐ దర్యాప్తుకు మీరు ఆదేశిస్తారా? మమ్మల్ని ఆదే శించమంటారా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించడం బాబు క్యాంపులో గుబులు రేకెత్తిస్తున్నది. ఒకవేళ దర్యాప్తుకు ఆదేశిస్తే అచ్చం అలాంటిదే సింగపూర్‌ ప్రైవేట్‌ కంపె నీలతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న స్టార్టప్‌ ఏరియా కుంభకోణం తెరమీదికొస్తుంది. దాని మీద విచారణ తప్పదు.

గత మూడు రోజులుగా యెల్లో మీడియాలో కామెడీ షో నడుస్తున్నది. చివరి రోజు స్వయంగా చంద్రబాబే టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఆ షోను కొనసాగించారు. ‘బాబ్బాబూ! మాక్కొంచెం ఎక్కువ సీట్లు దానం చెయ్యవా ప్లీజ్‌...!’ అని అమిత్‌ షా, నడ్డాలు బతిమాలుకున్నారట. ‘ఛస్తే కుదరదు, ఇచ్చింది తీసు కోండి, ఎక్కువ సీట్లిస్తే మీరు గెలవర’ని బాబు గట్టిగా చెప్పా రట! అంతేగాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామా లను వారికి వివరించారట. ఆర్థికశాస్త్రాన్ని వారికి బోధించారట. చివరికి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తును కుదుర్చుకుంటున్నట్టుగా వివరించి షా, నడ్డాల కళ్లు తెరిపించారట! బాబు విషయ పరిజ్ఞానానికి వారు అబ్బురపడిపోయారట. చివరికి బీజేపీ, జనసేనలకు కలిసి 8+30 సీట్లను బాబు అనుగ్రహించ డంతో వారు సంతృప్తి చెందారట!

అమావాస్య తర్వాత సీట్ల పంపకాలను అధికారికంగా ప్రకటిస్తారట! ఆ తర్వాత మన యెల్లో మీడియా బాబు విజయో త్సవాలు పేరుతో వారోత్సవాలు నిర్వహిస్తుంది. జయజయ మహావీర మహాధీర ధౌరేయ....... వంటి గద్యాలను రోజుకొకటి చొప్పున వినవలసి రావచ్చు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసే సీట్ల సంఖ్యపై బీజేపీ వారికి పెద్దగా ఆసక్తి లేదు. ఒక్క సీటు కూడా తాము గెలవబోవడం లేదనే విషయం వారికి స్పష్టంగా తెలుసు.

వారి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒకటి రెండు సీట్లు కాదు. మొత్తం పార్టీయే వాతాపి జీర్ణం. రాజకీయ చరమాంకంలో కూడా చంద్రబాబు అండ్‌ కో ప్రదర్శిస్తున్న అతిశయాన్ని చూస్తే మాత్రం దిగ్భ్రాంతి కలుగుతున్నది. తాను కేసుల నుంచి బయటపడేందుకు కాళ్ల మీద పడి పొత్తు కుదుర్చుకున్నారని లోక మంతా తెలుసు. కానీ దానికి ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం’ అనే ముసుగు వేయడం, దాన్ని యెల్లో మీడియా విస్తృతంగా ప్రచా రంలో పెట్టడం మాత్రం ఏవగింపు కలిగిస్తున్నది. చంద్ర బాబుకు, రామోజీకి పడిసెం పడితే తెలుగు ప్రజలంతా తుమ్మా లన్నట్టుంది ఈ వ్యవహారం!

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement