ముసుగు జారిపోయింది. ఇప్పుడంతా తేటతెల్లం. చంద్ర బాబు కోసం పవన్ కల్యాణ్ చేత చంద్రబాబే ఏర్పాటు చేయించిన ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’ (ఎస్‌పివి) జనసేన. అది ప్యాకేజీ ఫీజుతో కాంట్రాక్టుపై పనిచేస్తున్నదని వైఎస్సార్‌సీపీ నాయకులు చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. ఏడెనిమిదేళ్లుగా జనసేన కోసం జీవితాలను ధారబోసి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న యువకులు ఇంకో అడుగు ముందుకు వేసి చెబుతున్న మాట – ‘చంద్రబాబు సినిమాలో... జనసేన ఓ ఐటమ్ సాంగ్ మాత్రమే!’
కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలు జనసేన కార్యకర్తల్లోని అనుమానాలను బలపరుస్తున్నాయి. ‘రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి. నేనేం చేసినా ప్రశ్నించవద్దు. తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకించేవాళ్లు పార్టీలో ఉండనవసరం లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పదేళ్లు కొనసాగవలసిన అవసరం ఉన్నది’. ఈ రకమైన సుభాషితాలు విశదం చేస్తున్న విషయమేమిటి? తెలుగుదేశంతో ఇంకో పదేళ్ల పాటు పొత్తుకు డీల్ కుదిరిందనే కదా!
ఈ డీల్ వల్ల జనసేనకు ఒనగూరే ప్రయోజనమెంత? ఎన్ని అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి పదవి జనసేనకు ఎన్నేళ్లు... టీడీపీకి ఎన్నేళ్లు? ఇటువంటి ప్రశ్నలు అడగొద్దనే ఉద్దేశంతోనే సొంత పార్టీ అభిమానుల ముందరి కాళ్లకు పవన్ ముందుగానే బంధనాలు వేశారు. దాటవేత పద్ధతిలో సొంత పార్టీ వారిని ఏమార్చుతూ వచ్చారు. ‘ముందుగా సీట్లు గెలవాలి.
ఎక్కువ సీట్లు గెలిస్తేనే కదా ముఖ్యమంత్రి పదవిని అడగగలం... ముందు ఎక్కువ సీట్లలో జనసేనను గెలిపించండ’ని కార్యకర్తల పైనే పవన్ ఎదురుదాడి చేస్తూ వచ్చారు. సరే, పొత్తులో భాగంగా మనం ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నామని కార్య కర్తల ప్రశ్న. ముఖ్యమంత్రి పదవి దక్కేంతగా మెజారిటీ సీట్లు తీసుకోబోతున్నామా? పోనీ హరిరామజోగయ్య వంటి శ్రేయోభి లాషులు చెబుతున్నట్టుగా కనీసం 60 సీట్లు?
జనసేనకు అంత సీన్ లేదని తెలుగుదేశం పార్టీ కో– పైలట్‌గా భావించుకుంటున్న లోకేశ్‌బాబు కుండబద్దలు కొట్టారు. గత ఎన్నికల్లో లోకేశ్ ఒక్క సీట్లోనే ఓడిపోతే పవన్ రెండుచోట్లా ఓడిపోయారు. అందువల్ల ఆ మాత్రం చులకన భావం లోకేశ్‌కు సహజం. కచ్చితంగా 150 సీట్లలో తెలుగుదేశం అభ్యర్థులే ఉంటారని తాజాగా ఒక వెబ్ చానల్ ఇంటర్వ్యూలో లోకేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనే సమస్యే రాదనీ, అటువంటి ప్రస్తావనే రాలేదనీ, చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అభ్యర్థనీ లోకేశ్ ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కూడా అంగీకరించినట్టు లోకేశ్ వెల్లడించారు.
లోకేశ్‌బాబు ఇంటర్వ్యూ సారాంశం ప్రకారం గరిష్ఠంగా 25 అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నది. అందులో కూడా సగంమంది అభ్యర్థులకు కొత్తగా జనసేన తీర్థ మిచ్చి టీడీపీ సమకూర్చుతుందని విశ్వసనీయ సమాచారం. మిగిలిన పది, పన్నెండుమంది ఎంపికను కూడా టీడీపీ నాయ కత్వం ఆమోదించవలసి ఉంటుంది. ఇంత అవమానకరమైన ఒప్పందానికి ఏ రాజకీయ పక్షమైనా ఒప్పుకుంటుందా? ఇంకేదో మనకు తెలియని కోణం ఉన్నందువల్లనే ఇటువంటి పొత్తులు సాధ్యమవుతాయి.
ఏమిటా కోణం? అదో సింగపూర్ రహస్య మంటారు జనసేన వ్యవహారాలు బాగా తెలిసినవాళ్లు. చిదంబర రహస్యం గురించి విన్నాం గానీ ఈ సింగపూర్ రహస్యం ఏమిటో అంతుపట్టడం లేదు. చంద్రబాబుకు సింగపూర్‌తో వ్యాపార సంబంధాలు చాలాకాలం నుంచి ఉన్నాయనేది బహి రంగమే. బహుశా రాజకీయ లావాదేవీలను కూడా అక్కడి నుంచి నరుక్కొస్తారేమో!
ఈ కోణాల సంగతీ, కుంభకోణాల సంగతీ పక్కన పెడదాం. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పుకొని, రాష్ట్రంలో ఉన్న మరో బలమైన సామాజికవర్గపు ఆకాంక్షలతో ఊపిరిపోసుకున్న పార్టీ నిజస్వరూపం ఇలా వెల్లడైతే దాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి? జనసేన నాయకత్వాన్ని గుడ్డిగా నమ్ముకుంటూ వస్తున్న క్షేత్రస్థాయి జనసేన కార్యకర్తల్లో చాలామందికి లోకేశ్‌బాబు తాజా ఇంటర్వ్యూ కళ్లు తెరిపించి ఉండాలి.
వారి మనోభావాలనే హరిరామ జోగయ్య లేఖ రూపంలో పవన్ కల్యాణ్‌కు చేరవేశారు. ‘లోకేశ్ చెప్పిన మాటలకు మీ ఆమోదం ఉన్నదా’ అని లేఖలో జోగయ్య ప్రశ్నించారు. ‘మీరు ముఖ్యమంత్రి కావాలనీ, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి రావాలనీ కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నార’ని కూడా ఆయన ప్రశ్నించారు. చివరకు 60 సీట్లకు తగ్గకుండా పొత్తులో భాగంగా దక్కించుకోవాలని పవన్ కల్యాణ్‌కు ఆయన సూచించారు.
పవన్ కల్యాణ్‌తో వ్యవహరించే తీరుపై పెదబాబు, చిన బాబుల అభిప్రాయాల్లో కొద్దిగా తేడాలున్నాయట! కనీసం 30 సీట్లన్నా ఇవ్వకపోతే జనసైనికులకు సర్దిచెప్పడం కష్టమన్న పవన్ వైఖరి పట్ల చంద్రబాబు ఒకింత సానుభూతిగా ఉన్నట్టు సమాచారం. అయితే ఆ సీట్లు 20 దాటకూడదని లోకేశ్‌బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భంలో అరెస్టు భయంతో చినబాబు ఢిల్లీలో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్‌తో (పీకే) స్నేహం కుదిరింది. ఎన్నికల్లో ఈసారి తమకు వ్యూహకర్తగా పనిచేయా లని పీకేను లోకేశ్ అడిగారట! ఇప్పటికే పీకే టీమ్‌లో పనిచేసిన రాబిన్‌సింగ్ తెలుగుదేశం వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగానే పవన్ కల్యాణ్‌ను అతిగా ఊహించుకోవద్దనీ, అతనికి కాపు సామాజికవర్గంలో కూడా పెద్దగా బలం లేదనీ పీకే లోకేశ్‌కు చెప్పినట్టు తెలిసింది. జనసేనకు ఎన్ని ఎక్కువ సీట్లిస్తే అంత ఎక్కువ నష్టం జరుగు తుందని తన అభిప్రాయంగా చెప్పారట! అయితే వ్యూహకర్తగా పనిచేయడానికి తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ, తన సమా చారం ప్రకారం వైసీపీ మరోసారి గెలిచే అవకాశాలున్నట్టు చెప్పా రట! అప్పటినుంచీ పీకేను వ్యూహకర్తగా ఒప్పించడం కోసం లోకేశ్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.
పీకే సలహా మేరకు 20 లోపు స్థానాలకే జనసేనను పరి మితం చేయాలని లోకేశ్ పట్టుదలగా ఉండడంతో విషయం తెలిసిన పవన్ కల్యాణ్ పాదయాత్ర ముగింపు సభకు తాను రానని బెట్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సభకు రావడానికి అంగీకరించిన పవన్ మొండికేయడంతో చంద్ర బాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి అనునయించారట! ఇతరత్రా ఒప్పందాల సంగతి తెలియదు గానీ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను 25కు పెంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది.
జనసైనికుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని భయపడినప్పటికీ ఆ సంఖ్యకు ఒప్పుకోక తప్పలేదు. ఆ బాడీ లాంగ్వేజ్‌లో కూడా అప్పటి వాతావరణ ప్రభావం కనిపించింది. చంద్రబాబును సాగనంపడానికి బయటకొచ్చిన పవన్ దూరంగా నిలబడి ఉండగా నాదెండ్ల మనోహర్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ బాబుకు వీడ్కోలు చెప్పడం కనిపిం
చింది.
ఎట్టకేలకు లోకేశ్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆ సభకు పెట్టుకున్న పేరు విజ యోత్సవ సభ. లైవ్‌లో కార్యక్రమాన్ని చూసిన వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏమిటంటే – అది విజయోత్సవ సభ కాదు, సంతాప సభలా ఉన్నదని! పోనీ పాదయాత్ర తొలి రోజున చనిపోయిన తారకరత్న సంతాప సభగా దాన్ని మార్చారా అంటే అదీ లేదు. అతని పేరు తల్చుకున్నవారే లేరు. కానీ వేదిక మీదున్న నాయకుల ముఖాలు మాత్రం దీనంగా వేలాడుతూ కనిపించాయి.
అందుకు సభ ఫెయిల్యూర్ ఒక కారణం కావచ్చు. ఆరు లక్షలమందిని సమీకరించి ఒక బలమైన ముద్ర వేయాలని టీడీపీ గట్టిగా సంకల్పించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఏం జరిగిందో తెలియదు. సభకు నలభై నుంచి యాభైవేల మంది వరకు వచ్చి ఉంటారని తేలింది. చంద్రబాబు ప్రసంగించే సమయంలో పట్టుమని పదివేల మంది లేరు. ఇదీ రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేనల ఉమ్మడి ప్రభావం. ఇక సంతాప వాతావరణానికి రెండో కారణం – పొత్తులో కత్తుల వ్యవహారం కావచ్చు.
జనసేన శ్రేణుల్లో ఒకపక్క అసంతృప్తి రాజుకుంటున్న తరుణంలోనే హఠాత్తుగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ ఊడిపడ్డారు. బీజేపీ తరఫున రాజ్యసభలో ఉన్న సీఎమ్ రమేశ్‌కు చెందిన ప్రైవేట్ విమానంలో లోకేశ్, కిలారు రాజేశ్‌లతో కలిసి ఆయన విజయవాడకు వచ్చారు. చంద్ర బాబును కలుసుకున్నారు. రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ భేటీపై ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం రెండు రకాలుగా ఉన్నది. తెలుగుదేశం – జనసేన కూటమి మాత్రమే వైసీపీతో తలపడటానికి సరిపోదనీ, ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ – కమ్యూనిస్టులను కూడా కలుపుకొని వెళ్లాలని చెప్పడానికే చంద్రబాబును పీకే కలిశారని ఒక సమా చారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకంటే వింత ఇంకోటి ఉండదు. వచ్చింది బీజేపీ ఎంపీ విమానంలో! రాచకార్యం కాంగ్రెస్ కోసం!!
ఇప్పటికే టీడీపీ కోసం పనిచేస్తున్న రాబిన్‌సింగ్ టీమ్ పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోనే పనిచేసినందున... వారితో మాట్లాడి సలహాలిచ్చేందుకు రావలసిందిగా లోకేశ్ చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చాడని మరో సమాచారం. చంద్ర బాబు ఇంట్లో జరిగిన సమావేశానికి రాబిన్ సింగ్ టీమ్ కూడా హాజరైంది. గతంలో వైసీపీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తమవైపున పనిచేస్తున్నాడని మైండ్ గేమ్ ఆడేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్టు వినపడుతున్నది.
ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం మానేశానని ప్రశాంత్ కిశోర్ గతంలోనే చెప్పారు. కానీ పేరు వాడుకుని మైండ్ గేమ్ ఆడాలను కోవడం నదిలో కొట్టుకొనిపోయేవాడు గడ్డిపోచను చూసి ఆశపడిన చందం! వ్యూహకర్తలే ఎన్నికల్లో గెలిపించేట్లయితే పార్టీలను మూసేసుకుని నాయకులు వ్యూహకర్తలనే ఆశ్రయించేవారు. అంబటి రాంబాబు చెప్పినట్టు మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రీ ఏం చేస్తాడు?
ఈ పీకే భేటీ సంగతేమోగానీ, ఈ పరిణామం మన పీకే (పవన్ కల్యాణ్) పీకకు చుట్టుకుంటుందేమో చూడాలి. అసలే పార్టీ నుంచి వరసగా జారుకుంటున్నారు. కీలకమైన కాపు సామాజికవర్గం నేతలే తాము ఈ పార్టీలో ఇమడగలిగే పరిస్థితి లేదని బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. పాతిక సీట్లతోనే పార్టీ నేతలను ఒప్పించలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ కూడా తోడైతే వాళ్లకిచ్చే నాలుగు సీట్లు కూడా తన ఖాతా లోంచే కోత పడతాయి.
పైగా బీజేపీ మీద అపారమైన అభి మానాన్ని కురిపిస్తూ ఎన్డీఏ కూటమి సభ్యుడిగా చేరిన పవన్ ‘ఇండియా’ కూటమిని అంగీకరిస్తారా? ఆ పరిస్థితి ఎదురైతే తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? తెగతెంపులు చేసుకునేంత సాధారణమైన సంబంధమే తెలుగుదేశంతో ఉన్నదా? ఇవన్నీ సందేహాలే. తెలుగుదేశం పార్టీ ‘ఇండియా’ కూటమిలో చేరే అవకాశం లేదనే అనుకుందాం. ఎందుకంటే కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే వస్తుందని బాబుతో పీకే చెప్పినట్టు సమాచారం.
అసలే బీజేపీ అంటేనే బాబు ఝడుసుకుంటు న్నారు. మరో దారి లేకపోతే తప్ప ‘ఇండియా’ కూటమిలో చేరే నిర్ణయాన్ని బాబు తీసుకోలేరు. కేవలం సలహాలు ఇవ్వడానికే పీకే బాబును కలిశాడనుకుందాము. ఆయన సలహా మేరకు కుదించిన సీట్లతో జనసైనికులను మన పీకే సంతృప్తిపరచ గలరా? పదేళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న ఆశావహుల ఆగ్ర హాన్ని అదుపు చేయగలరా? తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదనీ, చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలనీ బహిరంగంగా ప్రకటించి కాపు సామాజికవర్గం ఆకాంక్షలపై నీళ్లు చల్లి పార్టీని నిలబెట్టుకోగలరా?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
పీకే అండ్ పీకే ఫార్ములా!
Published Sun, Dec 24 2023 4:18 AM | Last Updated on Sun, Dec 24 2023 10:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment