మీడియాతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్. చిత్రంలో నారా లోకేశ్ తదితరులు
సాక్షి, రాజమహేంద్రవరం: జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను నవంబర్ 1న ప్రకటిస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ తర్వాత ఇంటింటికీ ప్రచారం ప్రారంభిస్తామన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ జరిగింది. అనంతరం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో కలిసి పవన్ మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో రూపకల్పనపై యనమల రామకృష్ణుడు, నాదెండ్ల మనోహర్ లోతుగా చర్చలు జరిపినట్లు తెలిపారు.
మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలి? ఉమ్మడి పార్టీల ప్రాధాన్యత అంశాలు చర్చకు వచ్చాయన్నారు. జనసేన, టీడీపీ కలయిక కోసం ప్రజలు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ దాడి చేయని పార్టీ ఏదీ లేదన్నారు. అచ్చెన్నాయుడు నుంచి చంద్రబాబు వరకు అక్రమ కేసులు బనాయించిందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకి తాము వ్యతిరేకం కాదని.. ఆ పార్టీ విధానాలకే తాము వ్యతిరేకమన్నారు. మద్యంపై రూ.30 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
సీపీఎస్‌ను రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అనే తెగులు రాష్ట్రానికి పట్టుకుందని.. దీనికి టీడీపీ, జనసేన కలయికే వ్యాక్సిన్ అన్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని, సాంకేతిక సమస్యలు చూపుతూ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయనకు ధైర్యాన్ని ఇవ్వడానికే రాజమహేంద్రవరంలో జనసేన–టీడీపీ తొలి భేటీ నిర్వహించామన్నారు.
ఇకపై ఉమ్మడి కార్యక్రమాలు..
జనసేన, టీడీపీ కలయిక రాష్ట్రానికి మేలు చేస్తుందని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తామని నారా లోకేశ్ తెలిపారు. రెండు పార్టీల ఉమ్మడి సమావేశంలో చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలపడం, వైఎస్సార్‌సీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటం, రెండు పార్టీల కలయికతో అన్ని వర్గాల అభివృద్ధికి సంబంధించి మూడు తీర్మానాలు చేశామన్నారు. 2024లో కచ్చితంగా జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇకపై ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. మరో వారం, పది రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తామని చెప్పారు. బీసీలకు అందాల్సిన అనేక రకాల పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ వేధింపులతో మైనారిటీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని విమర్శించారు. మిగులు జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు. రాష్ట్రానికి నాలుగేళ్లల్లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు.
ఆ తర్వాత ఇంటింటికీ ప్రచారం ప్రారంభిస్తాం
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు.. సాంకేతిక సమస్యలు చూపుతూ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు
ఆయనకు ధైర్యాన్ని ఇవ్వడానికే రాజమహేంద్రవరంలో భేటీ
ఇరు పార్టీల సమన్వయ కమిటీ తొలి భేటీలో పవన్ కళ్యాణ్
Comments
Please login to add a commentAdd a comment