బ్రెయిన్‌ డెడ్‌ పార్టీకి సానుభూతి వైద్యం | Sakshi Editorial On TDP And Chandrababu By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ డెడ్‌ పార్టీకి సానుభూతి వైద్యం

Published Sun, Oct 8 2023 12:28 AM | Last Updated on Sun, Oct 8 2023 11:40 AM

Sakshi Editorial On TDP And Chandrababu By Vardhelli Murali

వచ్చే ఫిబ్రవరి లోగా చంద్రబాబుకు బెయిల్‌ దొరికే అవకాశం లేదు! ఆయన మీద నమోదైన కేసులు, న్యాయస్థానాల్లో సీఐడీ చేస్తున్న వాదనలు పరిశీలించిన న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది!! ఈ లోగానే ఆయనకు ఊరట లభించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. పూర్వాశ్రమంలో ఇటువంటి అద్భుతాలు చంద్రబాబు వల్ల సాధ్యమయ్యేవి. ఆ మేజిక్‌ ఇప్పుడేమైపోయిందని బాబు అనుచరగణం కలవర పడిపోతున్నది. కొన్ని దశాబ్దాలుగా ఆయన్ను ఆశీర్వదిస్తూ వస్తున్న ‘అద్భుత’ దీపాలు కొన్ని ఇప్పుడు వానప్రస్థం స్వీకరించి మిణుకుమిణుకుమంటున్నాయి. కనుక ఇప్పుడు పాత మేజిక్‌ మీద ఆశ పెట్టుకోవడం కుదరకపోవచ్చు. 

చంద్రబాబు మీద నమోదైన నేర శిక్షాస్మృతి సెక్షన్లు ఆరు మాసాల్లోగా బెయిల్‌ లభించడానికి అనుమతించవు. కనుకనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇదొక అక్రమ కేసుగా వాదిస్తూ విచారణే జరక్కుండా కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోపక్క చంద్రబాబు పార్టీ అనుయాయులు, యెల్లో మీడియా పెద్దలు సమష్టిగా ‘అక్రమ కేసు’ వాదాన్ని తీవ్రంగా ప్రచారంలో పెట్టే పనిలో నిమగ్న మయ్యారు.

తప్పుడు సమాచారాన్ని అందజేసి కొందరు తట స్థుల చేత కూడా తమకు అనుకూలమైన ప్రకటనలు చేయించు కుంటున్నారు. యెల్లో మీడియా తనను తాను తాకట్టు పెట్టుకుంటూనే, బాబు సామాజిక వర్గాన్ని కూడా తాకట్టు పెడుతూ ఒక కృత్రిమ సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది.

ఇందుకోసం వారొక తప్పుడు వాదాన్ని తయారుచేసి అందుకు అనుగుణంగా లా పాయింట్లు లాగుతున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అవినీతి జరిగిందా లేదా అనే చర్చను వారు పక్కనబెట్టి సాంకేతిక అంశాలను ముందుకు తెస్తున్నారు. ఆ సాంకేతిక అంశాలు కూడా న్యాయస్థానాల పరిశీలన ముందు నిలబడేవి కావని న్యాయకోవిదులు ఘంటాపథంగా చెబుతు న్నారు. ‘అవినీతి నిరోధక చట్టం (సవరణ, 2018) సెక్షన్‌ 17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయాలంటే (మాజీ ముఖ్య మంత్రి కనుక) గవర్నర్‌ అనుమతి తప్పనిసరి.

ఇక్కడ గవర్నర్‌ అనుమతి తీసుకున్నట్టు రికార్డు చేయలేదు కనుక కేసు కొట్టేయండి’ అని కోర్టులో వాదిస్తున్నారు. ‘ఒకసారి కేబినెట్‌ ఆమో దించిన తర్వాత దీన్ని ‘స్కామ్‌’ అని ఎట్లా అంటారు? ఇచ్చేయండి బెయిల్‌’ అని అభ్యర్థిస్తున్నారు. ఈ కేసులో దుర్వినియోగ మైన డబ్బులు బాబు ఇంటికి చేరినట్టుగా సాక్ష్యాలు చూపలేదు గనుక ఆయన్నెట్లా బాధ్యుడిని చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇటువంటివే మరికొన్ని సాంకేతిక అంశాలను రూపొందించుకొని చంద్రబాబు అరెస్టు అక్రమమనే వాదాన్ని యెల్లో మీడియా ప్రచారం చేస్తున్నది. ఈ రకమైన ప్రచారంతో సాను భూతిని సృష్టించడానికి పడరాని పాట్లు పడుతున్నది. ఇది రాజకీయ దురుద్దేశంతో, కక్షపూరితంగా నమోదైన కేసుగా చిత్రిస్తున్నది. ఒకవేళ రాజకీయ కక్షే నిజమైతే ఆ కక్ష ఏ ప్రభుత్వానిది? కేంద్రానిదా... రాష్ట్రానిదా? ఎందుకంటే ఈ కేసు 2016లోనే వెలుగు చూసింది. వెలుగులోకి తెచ్చింది కేంద్ర ఏజెన్సీలు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడే!

పుణేలో ఉన్న కొన్ని డొల్ల కంపెనీలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కోసం జీఎస్టీకి దరఖాస్తు చేసుకున్నాయి. సరుకులను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన జీఎస్టీలో మళ్లీ వాటిని అమ్మేసినప్పుడు కంపెనీలు పన్ను రాయితీని క్లెయిమ్‌ చేస్తాయి. సరుకులను సొంతానికి కాకుండా వ్యాపారం కోసం ఉపయోగించడం వల్ల ఈ రాయితీ లభిస్తుంది. ఎన్నడూ లక్ష రూపాయల వ్యాపారం కూడా చేసినట్టు చూపని కంపెనీలు హఠాత్తుగా భారీ ప్రమాణంలో ట్యాక్స్‌ ఇన్‌పుట్‌ను క్లెయిమ్‌ చేయడంతో జీఎస్టీ అధికారు లకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో డొల్ల కంపెనీల బాగోతం బయటపడింది. 

సరుకులు ఎక్కడా కొనకుండానే, అమ్మకుండానే బోగస్‌ ఇన్‌వాయిస్‌ (బిల్లులు)లు సృష్టించారని తేలిపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కోసం సరుకులు సరఫరా చేస్తున్నట్టుగా బోగస్‌ ఇన్‌వాయిస్‌లు ఉండడంతో ఆ రాష్ట్ర ప్రజాధనాన్ని ఎవరో ఈ రకంగా కొల్లగొడుతున్నారని జీఎస్టీ అధికారులకు అర్థమైంది. దాంతో వారు ఈ సమాచారాన్ని రాష్ట్ర సీఐడీకి అందజేశారు.

ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు ఉన్న కారణంగా కేసు ముందుకు కదల్లేదు. తర్వాత ఈ వ్యవహారంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఈడీ) అధికారులు కూడా ప్రవేశించి కేసులు నమోదు చేశారు. ఈడీ, జీఎస్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో భాగం కనుక, ఈ కేసును వెలికితీసింది వారే కనుక రాజకీయ కక్ష, దురుద్దేశం నిజమైతే కేంద్రానికే ఉండాలి కదా!

ఇక అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఏ సంగతి చూద్దాం. దీని ప్రకారం నిందితుడి అరెస్టుకు అతని నియామక అధికారి (అపాయింటింగ్‌ అథారిటీ) ముందస్తు అనుమతి అవసరమని ఈ సెక్షన్‌ చెబుతున్నది. ముఖ్యమంత్రిగా నియమించేది గవ ర్నర్‌ కనుక ఆయన అనుమతి ముందస్తుగా ఉండాలని తెలుగు దేశం వాదన. అరెస్టయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే మాత్రమే అనే సంగతిని కూడా పక్కనపెడదాం. సీఐడీ చేస్తున్న వాదన ప్రకారం ఈ సెక్షన్‌ అమల్లోకి వచ్చింది 2018లో! కానీ ఈ స్కామ్‌ జరిగిందీ, జిఎస్టీ, ఈడీలు కేసులు నమోదు చేసిందీ అంతకుముందే కనుక గవర్నర్‌ అనుమతి అవసరం లేదు.

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన మరో విశేషమేమిటంటే చంద్రబాబు మీద కేవలం అవినీతి నిరోధక చట్టం కేసులు మాత్రమే నమోదు కాలేదు. సీఆర్‌పీసీ సెక్షన్లయిన 120బి, 107, 409 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. అవినీతి నిరోధక చట్టానికి జరిగిన సవరణ సీఆర్‌పీసీ సెక్షన్ల కింది జరిగిన అరెస్టులకు కూడా వర్తిస్తుందా? అందుకు ఏదైనా ఉదాహరణ ఉన్నదా? 409 రెడ్‌ విత్‌ 34 కేసులో ఆరు నెలల వరకు బెయిల్‌ రావడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సీమెన్స్‌తో ఒప్పందాన్ని కేబినెట్‌ ఆమోదించిన తర్వాత అమలులో జరిగిన దుర్వినియోగానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యత వహిస్తారు అనేది యెల్లో మీడియా అమాయకంగా అడుగుతున్న మరో ప్రశ్న. ఒకవేళ కేబినెట్‌ భేటీ జరిగిందనే అనుకున్నా అనంతరం వెలువడిన జీవోలో ఏమున్నది? ఈ స్కీమ్‌కు సీమెన్స్‌ కంపెనీ 90 శాతం నిధులను ఉచితంగా కేటా యించడానికి ముందుకు వచ్చింది. మిగిలిన పదిశాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే చాలని ఉన్నది. కేబినెట్‌ జరిగి ఉంటే ఇదే విషయాన్ని చెప్పి ఉంటారు. కానీ ఆచరణలో ఒప్పందం ఎలా జరిగింది? ఎవరి మధ్యన జరిగింది?

రాష్ట్ర ప్రభుత్వం తరఫున నైపుణ్యాభివృద్ధి సంస్థ సదరు ఒప్పందంలో భాగస్వామి కావాలి. కానీ, కాలేదు. డిజైన్‌టెక్‌ అనే ఓ ప్రైవేట్‌ సంస్థ భాగస్వామిగా మారింది. సీమెన్స్‌ సంస్థ తర ఫున ఆ సంస్థ ఇండియా అధికారి దొంగసంతకంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అది అతని రెగ్యులర్‌ సంతకం కాదనీ,దొంగ సంతకమనీ నిరూపణయింది. అతని ఉద్యోగం ఊడింది. ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ అధికారిక ప్రకటన చేసింది. న్యాయస్థానానికి కూడా లిఖిత పూర్వకంగా చెప్పింది. ఇదంతా బోగస్‌ వ్యవహారమనీ, దురుద్దేశ పూర్వకంగా జరిగిందని చెప్పడానికి ఇవన్నీ సరైన కారణాలు కావా?

మరో కీలకమైన విషయం – జీవోలో చెప్పినదాని ప్రకారం సీమెన్స్‌ సంస్థ 90 శాతం నిధుల్లో ఒక్క పైసా విడుదల చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తం రూ.371 కోట్లను విడుదల చేయడం! దాన్ని డిజైన్‌టెక్‌ అనే ప్రైవేట్‌ సంస్థ ఖాతాకు మళ్లించడం! ఇలా విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని అధి కారులు నోట్‌ ఫైల్‌లో రాసినా చంద్రబాబు పట్టుబట్టి విడుదల చేయించారు. ఈ మేరకు నోట్‌ఫైళ్లలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. 13 చోట్ల సీఎం సంతకాలు చేశారని సీఐడీ ఆధారాలు చూపెట్టింది. స్కామ్‌ పూర్తిగా సీఎం కనుసన్నల్లో దురుద్దేశ పూర్వ కంగా జరిగిందనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి?

ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన గంటా సుబ్బారావు అనే వ్యక్తి, డిజైన్‌టెక్‌ కంపెనీ అధిపతి, సీమెన్స్‌ ఇండియాలోని ఉద్యోగి– ఈ ముగ్గురితో కలిసి కుట్రపూరితంగా నాటి ముఖ్య మంత్రి పథక రచన చేశారనడానికి కావల్సిన ఆధారాలు ఇవన్నీ! ఇక్కడే సీఆర్‌పీసీ సెక్షన్‌ 409, సెక్షన్‌ 34 వర్తిస్తున్నాయి.

సెక్షన్‌ 409 అంటే బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌! నమ్మక ద్రోహానికి పాల్పడటం! ప్రజలు నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి పదవిని స్వార్థ ప్రయోజనాల కోసం గానీ, ఇతరుల ప్రయోజనాల కోసం గానీ వినియోగించడం!! ప్రజా ధనానికి పరిరక్షకుడిగా ఆయన్ను ప్రజలు నియమించారు. ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తూ ఆ ధనాన్ని షెల్‌ కంపెనీలకు తరలించడంలో కీలకపాత్రను పోషించారు. సెక్షన్‌ 34 – ఈ స్కామ్‌ వెనుకనున్న దురుద్దేశానికి వర్తిస్తుంది. ఈ రెండు సెక్షన్లూ రుజువైతే కనీసం పదేళ్ల జైలుశిక్ష పడుతుంది.

‘సదరు స్కామ్‌ డబ్బులు బాబు జేబులోకే వెళ్లాయనేందుకు రుజువేమిటి? అది రుజువు చేయకుండా ఎలా కేసు పెడతారు? ఎలా అరెస్టు చేస్తార’ని మరో ప్రశ్నను టీడీపీ వారూ, యెల్లో మీడియా వారూ సంధిస్తున్నారు. బాబు మీద నమోదు చేసిన సీఆర్‌పీసీ 120బి, 107 సెక్షన్లు ఏం చెబుతున్నాయి? కుట్రలో భాగస్వామి అయితే చాలు సెక్షన్‌ 120బి వర్తిస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉండనక్కర్లేదు. అందుకు అనుమానం, ఆస్కా రం కలిగించే పరిస్థితులుంటే చాలు. అంటే సర్కమస్టెన్షియల్‌ ఎవిడెన్స్‌ చాలు.

107 అంటే ఒక నేరాన్ని ప్రోత్సహించడం. కనుక చంద్రబాబు జేబులోకి డబ్బులు వెళ్లాయా లేదా అనే విషయాన్ని అరెస్టుకు ముందో, రిమాండ్‌కు ముందో నిర్ధారణ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడో ఉదాహరణ చెప్పుకో వచ్చు. ‘ఏ’ అనే వ్యక్తి కుట్రపూరితంగా, దురుద్దేశంతో ‘బి’ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేశాడు. ‘బి’ బంధువులకు ఫోన్‌ చేసి ‘సి’అనే వ్యక్తికి డబ్బు చేరిస్తే విడుదల చేస్తానని చెప్పాడు. డబ్బు ‘సి’ చేతికి చేరుతుంది. డబ్బు నా చేతికి రాలేదు కనుక నేను నేరస్థుడిని కాదని ‘ఏ’ అనేవాడు బుకాయిస్తే చెల్లుతుందా?

షెల్‌ కంపెనీల ద్వారా డబ్బును చంద్రబాబు గూటికి చేర్చడంలో ఆయన పీఏ శ్రీనివాస్‌ ముఖ్య భూమికను పోషించాడని సీఐడీ భావిస్తున్నది. అతడికి నోటీసులు ఇవ్వగానే దేశం విడిచి పారిపోయాడు. కుట్ర జరిగిందనడానికి ఇది మరో బలమైన సాక్ష్యం. రెండు రోజుల క్రితం ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ తరఫున వాదించిన ఏఏజీ సుధాకర్‌రెడ్డి ఓ కొత్త విష యాన్ని చెప్పారు. స్కామ్‌ సొమ్ములో ఓ 27 కోట్లు విరాళంగా తెలుగుదేశం పార్టీ ఖాతాకు చేరాయని ఆయన చెప్పారు.

27 కోట్ల విరాళం విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నిర్ధారించారు. ఈ ఆరోపణకు సీఐడీ వారు ఆధారాలు చూపగలిగితే తెలుగుదేశం పార్టీ ఆస్తులనూ, ఖాతాలనూ సీజ్‌ చేసే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే!

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒక జీవచ్ఛవంలా తయారైంది. రక్తప్రసరణ దాదాపుగా నిలిచిపోయింది. సొంత పుత్రుడు, బావమరిది పార్టీని ఉద్ధరిస్తారనే నమ్మకాన్ని చంద్ర బాబు కూడా కోల్పోయి ఉంటారు. వైసీపీ వారు దత్తపుత్రుడిగా అభివర్ణించే పవన్‌ కల్యాణ్‌ను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పిలిపించుకున్నారు. చెవిలో ఏం చెప్పారో తెలియదు కానీ, బయటికి రాగానే పవన్‌ కల్యాణ్‌ ఆవేశంతో మాట్లాడారు.

తెలుగుదేశం – జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఆయన పక్కన మామాఅల్లుళ్ళు చేతులు కట్టుకొని అనుచరుల్లా నిలబడిపోయారు. తాను ‘అలగా జనం’గా పరిగణించే వారి సమక్షంలో బాలయ్య బ్రాండ్‌ బ్లడ్డూ, బ్రీడూ తల వంచుకొని నిలబడాల్సి వచ్చింది.

ఆ పూటకు అలా గడిచిపోయింది. తర్వాత మూడు వారాల పాటు చినబాబూ లేడు, పవన్‌బాబూ లేడు. బాలయ్య బాబు పెద్దగా సందడి చేయలేదు. చినబాబు ఢిల్లీలో దాక్కున్నారు. అరెస్టు భయంతో పారిపోయాడని పార్టీ శ్రేణులు భావించాయి. మొన్న రాష్ట్ర సీఎం ఢిల్లీకి వెళ్ళగానే చినబాబు రాజమండ్రికి తిరిగొచ్చారు. తీరా సీఎం రాష్ట్రానికి రాగానే, చినబాబు భార్యను తీసుకొని మళ్ళీ ఢిల్లీ బాట పట్టాడు. కార్యకర్తల నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిన్నది.

పార్టీలో కదలిక కోసం నానాతంటాలు పడవలసి వస్తున్నది. చివరికి బాబు సొంత సామాజిక వర్గంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారు. వారం రోజుల కిందనే మళ్లీ రంగప్రవేశం చేసిన పవన్‌ కల్యాణ్‌ కూడా తెలుగుదేశం పరిస్థితిపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయవలసి వచ్చింది. ఆ పార్టీ పూర్తిగా బలహీన పడినందువల్లనే తాము యువరక్తం ఎక్కించవలసి వస్తున్నదని ఆయన సభలోనే ప్రకటించారు.

తెలుగుదేశం – జనసేన పార్టీలు ఉమ్మడిగా కృషిచేసినా పవన్‌ సభలు గతంతో పోలిస్తే బోసిపోతున్నాయి. రెండు పార్టీల పొత్తు పట్ల జనసేనలో వ్యతిరేకత, తెలుగుదేశం శ్రేణుల మనోధైర్యం దెబ్బతినడం ఈ పరిస్థితికి కారణం. జనస్పందన తగ్గడంతో పవన్‌ కూడా షాక్‌ తిన్నట్లున్నారు. గతంలో పదిహేను రోజులకో, నెలకో మాట మార్చేవాడు. ఇప్పుడు ప్రతిరోజూ మారుస్తున్నారు. ఒకరోజు ఎన్డీఏ నుంచి బయటకొచ్చానంటాడు. ఆ మరుసటి రోజే ఎన్డీఏలోనే ఉన్నానని అంటాడు. అవినీతి రెండు రకాలని ఓ కొత్త భాష్యాన్ని చెప్పుకొస్తున్నారు.

చంద్రబాబు చేసిన అవినీతి ‘ఆమోదయోగ్యమైన’దేనట! ఇదెక్కడి దౌర్భాగ్యం! పైగా ప్రజలే అవినీతిపరులంటూ శాప నార్థాలు పెడుతున్నారు. ఆయన పూర్తిగా బ్యాలెన్స్‌ కోల్పో యారు. జనం నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఆశలు పెట్టుకున్న అస్త్రాలన్నీ ఇలా విఫలమవుతున్నాయి. ఈ స్థితిలో ఆయన ఇంకో ఆరు నెలలు జైల్లోనే ఉంటే పార్టీ బ్రెయిన్‌ డెడ్‌ ఖాయం.

బయటకు వచ్చి అవయవదానం చేయవలసిందే! ఈ స్థితిని తప్పించడానికి యెల్లో మీడియా తెగ ప్రయాసపడుతున్నది. ‘ప్రజాస్వామ్యం కోసం’ అనే ముసుగులో మేధావుల పేరుతో కావలసినవారిని కొందరిని సమీకరించి ఒక సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి తంటాలు పడు తున్నారు. అధినేత అవినీతికి ఇప్పుడు పార్టీ మూల్యం చెల్లిస్తున్నది. అది పతనోన్ముఖాన వేగంగా జారిపోతున్నది. ఎలాగోలా బతికించాలని యెల్లో మీడియా తాపత్రయం. ‘అక్క ఆరాటమే గాని బావ బతికేట్టు లేడు!’

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement