పెత్తందారుకు టిప్పర్‌ సవాల్‌! | Sakshi Editorial On Chandrababu Politics By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

పెత్తందారుకు టిప్పర్‌ సవాల్‌!

Published Sun, Mar 31 2024 2:22 AM | Last Updated on Sun, Mar 31 2024 2:24 AM

Sakshi Editorial On Chandrababu Politics By Vardhelli Murali

జనతంత్రం

మన సమాజం వర్గాలుగా విభజితమై ఉన్నమాట ఒక వాస్తవం. కులాలుగా విడిపోయి ఉన్న మాట కూడా నిజం. ఈ కుల–వర్గ వేర్పాటులో కొందరిది ఆధిపత్య స్థానం, మెజారిటీ ప్రజలది అణచివేతకు గురయ్యే స్థానం. అవమానాలను మోసే స్థానం. ఈ విభజన సత్యాన్ని గుర్తించే సాహసం మన రాజకీయ నాయకులు చస్తే చేయరు. ఆ సత్యం మీద మసిపూసి మాయం చేస్తారు. అందరి క్షేమం తమ ధ్యేయమంటారు.

సకల జనుల శ్రేయోరాజ్యం తమ ఆశయమంటారు. సర్వేజనాః సుఖినో భవన్తని ఆశీర్వదిస్తారు. అభివృద్ధి–సంక్షేమం తమకు రెండు కళ్లంటారు. ‘పేదల కోసం సంక్షేమం, పెద్దలతోనే అభివృద్ధి’ అనే చిత్ర రచన చేస్తారు. పేదలకు తిండి దొరకని పరిస్థితిని ఈ సంక్షేమం అరికట్టగలిగింది. లేబర్‌ మార్కెట్‌ నిక్షేపంగా నిలబడేందుకు ఈ సంక్షేమాన్ని మన పాలకులు వెదజల్లుతారు.

ఐదు రూపాయలకే భోజనం పెట్టేంత అపురూపమైన ఔదార్యాన్ని కూడా మన పాలకులు కనబరుస్తుంటారు. అది బాల్యవివాహమైనా సరే ఓ పాతిక వేలు సర్కారీ కట్నం చదివించి మంచి మనసును చాటుకుంటుంటారు. బాల్యవివాహం వల్ల పిల్ల చదువు ఆగిపోయినా లెక్క చేయరు. హిందూ,ముస్లిం, క్రైస్తవులకు ఒక్కో పండుగ చొప్పున ఓ సంచెడు ఉప్పూ, పప్పూ, చక్కెర వగైరాలతో స్వయం పాకాన్ని అందజేస్తారు.

పండు ముదుసళ్లను పదిసార్లు తిప్పించుకున్నప్పటికీ ఓ వేయి రూపాయలను పెన్షన్‌గా అందజేసేంత విశాల హృదయం మన సంక్షేమ పాలకుల్లో ఉన్నది. కానీ, పేదలు సాధికారత సంతరించుకునే అవకాశాలు వీరి కార్యక్రమంలో ఉండవు. ఈ తరహా రెండు కళ్ల సిద్ధాంత ‘సంక్షేమ’ పాలకుల్లో మన చంద్రబాబు నాయుడు కూడా ఉంటారు. 

ఈ రెండు కళ్ల సిద్ధాంతంలో అభివృద్ధి – సంక్షేమం అనేవి రెండు సమాంతర రేఖలు మాత్రమే! ఒకదాన్నొకటి తాకదు. సంక్షేమం కోటాలోని జనం అభివృద్ధి కేటగిరీలోకి చేరిపోవడమనేది ఒక అరుదైన సన్నివేశం. లేబర్‌ మార్కెట్‌లోని ప్రజలు సంపన్న శ్రేణిలోకి చేరాలంటే వారికి నాణ్యమైన ఉచిత విద్య మొదటి షరతు. ఇక్కడే మన సంక్షేమ పాలకుల వర్గదృక్పథం బట్టబయ లయ్యేది. నాణ్యమైన ఉచిత విద్యకు మన పాలకులు ససేమిరా అంగీకరించరు.

విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని ముఖ్య మంత్రి హోదాలోనే చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి. విద్యారంగాన్ని వ్యాపారస్తుల రేస్‌కోర్స్‌గా మార్చిన ఘనుల్లో నిస్సందేహంగా చంద్రబాబు అగ్రగణ్యుడు. విద్యాబేహారులకు ప్రభుత్వ పాలనలో పెద్ద పీట వేసినవాడు చంద్రబాబు. పేదపిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందకుండా ఎన్ని విధాలుగా అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నించాడో మనం చూశాము.

నాణ్యమైన విద్యకు బదులుగా నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ఎన్నికల సభల్లో చెప్పు కొస్తున్నారు. పైగా దాన్ని తక్కువ ధరలకే అందజేస్తారట. ఇంకో రెండు రోజులు పోతే డోర్‌ డెలివరీ కూడా చేస్తామంటారేమో! మద్యం ఆరోగ్యానికి హానికరమైనదని వైద్యులందరూ చెబు తారు. నాణ్యమైన మద్యమైతే నెమ్మదిగా చస్తారు. నాసిరకం మద్యమైతే వెంటనే చస్తారని ఆయన భావం కావచ్చు.

ఈ చంపే యడంలో నాణ్యతా ప్రమాణాలు దేనికి? ప్రజలను సాధికారం చేసే విద్యలోనూ, ఆరోగ్య సమాజాన్ని నిర్మించే వైద్యంలోనూ నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పడం ప్రభుత్వం పనికాదనీ, అది ప్రైవేట్‌ వ్యాపారుల క్రీడాస్థలమనేది చంద్రబాబు సిద్ధాంతం. అందువల్లనే ఆయన పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వ కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలమై పోయాయి. ఈ రెండు వ్యవస్థల్లోనూ కార్పొరేట్‌ రంగం రంకె లేసింది.

ఐదేళ్ల జగన్‌ పరిపాలన అందుకు పూర్తి విరుద్ధం. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడమే కాదు, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థులందరికీ అందుబాటులోకి వచ్చాయి. 

ప్రభుత్వాస్పత్రులు ఇప్పుడు బ్రహ్మాండంగా పని చేస్తున్నాయి. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 58 వేల ఉద్యోగ ఖాళీలను 58 మాసాల కాలంలో భర్తీ చేయగలిగారు. అంటే నెలకు వేయి ఖాళీల చొప్పున భర్తీ. ప్రభుత్వం ఎంత ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇది సాధ్యమవుతుంది? వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాస్పత్రులను ఆధునికం చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో పీరియాడికల్‌గా ప్రభుత్వ వైద్యుడు పర్యటిస్తాడు. రోగగ్రస్తులందరి రికార్డు ఆయన దగ్గరుంటుంది. క్రమం తప్పకుండా ఆయనే వాళ్లను పరీక్షించి మందులిస్తాడు. ఆ రకంగా ప్రతి పేదరోగికీ ఒక ఫ్యామిలీ డాక్టర్‌ను అందుబాటులోకి తెచ్చిన ఉత్తమ విధానానికి ఈ ఐదేళ్లలోనే శ్రీకారం చుట్టారు. 

అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. విద్య, వైద్య రంగాల్లో ఏ పాలకుని వైఖరి ఏమిటో తెలిస్తే ఆ పాలకుని వర్గ స్వభావమేమిటో చెప్పవచ్చు. చంద్రబాబు పుట్టుకరీత్యా పేదవాడే కావచ్చు. కానీ ఎత్తుజిత్తులతో పెత్తందారీ శ్రేణిలో చేరిన ఆయన ఆ వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఒక ఉగ్రవాదిగా మారిపోయాడు.

ఇందుకు పూర్తి భిన్నంగా సంపన్న కుటుంబంలో పుట్టిన జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఎజెండాను భుజానికెత్తుకున్నాడు. పేదవర్గాలు–మహిళల సాధికారతను తన పార్టీ సిద్ధాంతంగా ప్రకటించుకున్నాడు. సమాజంలోని రెండు వైరివర్గాల గురించి ప్రస్తావించడమే కాకుండా ఈ రెండు వర్గాల మధ్యన యుద్ధం జరుగుతున్నదనీ, ఈ యుద్ధంలో తాను పేద వర్గాల తరఫున అర్జునుడి పాత్ర పోషిస్తాననీ కూడా ఆయన ప్రకటించారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో క్లాస్‌ వార్‌ (వర్గ పోరాటం) గురించి మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు చరిత్రలో జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కడే. కమ్యూనిస్టులు చెప్పే క్లాస్‌ వార్‌ వేరు. వర్గపోరు గురించి మాటలు చెప్పే కమ్యూనిస్టులు ఆచరణలో వర్గదృక్పథాన్ని కోల్పోయి ఉనికిని పోగొట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కమ్యూనిస్టులుగా ప్రకటించుకునే వారిలో కొంత మంది పెత్తందారీవర్గ ప్రవక్త చంద్రబాబు చుట్టూ చేరి చిడతలు వాయించే స్థితికి దిగజారిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం.

ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలోనే పేదల విముక్తి కోసం క్లాస్‌ వార్‌కు పిలుపునిచ్చి భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని జగన్‌మోహన్‌రెడ్డి సృష్టించారు. ఈ క్లాస్‌ వార్‌ మరో సారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనాన్ని సృష్టించబోతున్నది. క్షేత్ర స్థాయి ప్రజా స్పందనల అంచనా ప్రకారం 2019 ఎన్నికల ఫలి తాలే పునరావృతం కాబోతున్నాయి.

తాను పెత్తందారీ వర్గ ప్రయోజనాల కిరాయి మనిషిననే విషయాన్ని చంద్రబాబు తన చేతల్లోనే కాదు మాటల్లో కూడా పదేపదే వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగమే మొన్నటి టిప్పర్‌ ఎపిసోడ్‌. అనంతపురం జిల్లా సింగనమల నియోజక వర్గం నుంచి వీరాంజనేయులు అనే టిప్పర్‌ డ్రైవర్‌కు వైసీపీ టిక్కెట్‌ ఇచ్చింది. ఆయన విద్యాధికుడైనప్పటికీ బ్రతుకుతెరువు కోసం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

పార్టీ కార్యకర్తగా కూడా పని చేస్తున్న అతని సేవలను గుర్తించి జగన్‌మోహన్‌రెడ్డి అతడిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. పెత్తందారీ మనస్తత్వం నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు ఈ ఎంపికను అవహేళన చేస్తున్నారు. సింగనమలలో జరిగిన టీడీపీ సభలో మాట్లాడుతూ టిప్పర్‌ డ్రైవర్‌ అనే మాటను పదేపదే వెటకారంగా ఒత్తి పలికారు. ఇటు వంటి నిశానీగాళ్లకు ఓటేస్తే ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతారని ఎద్దేవా చేశారు. అంటే పేదవాళ్లు అజ్ఞానులనీ, వాళ్లు రాజకీయాలకు అనర్హులనే అర్థంలో మాట్లాడారు.

ఈవిధంగా మాట్లాడటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ‘ఎస్‌సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని మీడియా సమావేశంలోనే ఆయన తన మనస్తత్వాన్ని బయట పెట్టు కున్నారు. నాయీ బ్రాహ్మణ (బీసీ వర్గం) ప్రతినిధులను మీడియా సమక్షంలోనే ‘మీ తోకలు కత్తిరిస్తాన’ని బెదిరించారు. బీసీలకు జడ్జీ పదవులు ఇవ్వొద్దని, వారందుకు తగరని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వానికే ఆయన స్వయంగా లేఖ రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ అని మహిళా విద్వేషాన్ని బహిరంగంగా వెళ్లగక్కారు. నాయకుడి నుంచి ఈ స్ఫూర్తిని తీసుకొని పేదవర్గాలపై ఆయన అనుచరగణం చేసిన దాష్టీకం అంతా ఇంతా కాదు.

ఎన్నికల యుద్ధంలో తలపడకుండా పేద వర్గాలను, సంఘ సేవకులను దూరం చేసిన భాగ్యశాలి కూడా చంద్రబాబే. ఎన్టీఆర్‌ మరణానంతరం ప్రజాదరణ పెద్దగా లేని తాను నెగ్గుకు రావడం కోసం ఉపఎన్నికల సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చుపెట్టి సంచలనం సృష్టించారు. అప్పటినుంచీ అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎన్నిక ఏదైనా సరే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయగలవారినే నిలబెట్టడం మొదలుపెట్టారు.

ఆయన్ను చూసి మిగిలిన పార్టీల వాళ్లు కూడా అంతో ఇంతో అనుసరించక తప్పలేదు. పెట్టుబడి – రాజ కీయాల మధ్యన ఉండే పరోక్ష బంధం నాటినుంచి ప్రత్యక్షంగా మారిపోయింది. వందల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలిచి పోవడమనే అప్రజాస్వామిక ధోరణికి గేట్లు తెరిచినవాడు చంద్ర బాబు. ఈ అక్రమార్జనపరులైన కోటీశ్వరులపై సామాన్యులు విజయభేరి మోగించినప్పుడే మళ్లీ మన సిసలైన ప్రజాస్వామ్యం మన చేతికొస్తుంది.

టిప్పర్‌ డ్రైవర్‌గా చంద్రబాబు అవహేళన చేసిన వీరాంజ నేయులు సింగనమలలో విజయఢంకా మోగిస్తేనే ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతుంది. మడకశిరలో ఉపాధి హామీ కూలీ లక్కప్ప భారీ మెజారిటీతో నెగ్గితే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు వికసిస్తుంది. చదువుల సరస్వతీదేవిని అంగడి సరుకుగా మార్చి లక్షలాది సామాన్యుల రక్తం తాగి తెగబలిసి వేలకోట్లు ఆర్జించిన నారాయణ నెల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తు న్నాడు.

వందల కోట్లు వెదజల్లి గెలవాలని చూస్తున్నాడు. అతడితో తలపడుతున్న సామాన్యుడు స్వర్ణకార వృత్తి చేసుకునే ముస్లిం మైనారిటీకి చెందిన ఖలీల్‌ అహ్మద్‌ గెలిస్తేనే ప్రజా స్వామ్యం గెలిచినట్టు! అనకాపల్లి లోక్‌సభ సీటుకు సీఎం రమేశ్‌ పోటీ చేస్తున్నాడు. ఈయన మనిషి బీజేపీలో ఉంటాడు. ఆత్మ తెలుగుదేశంలో ఉంటుంది. స్నేహం కాంగ్రెస్‌తో ఉంటుంది.

కాంట్రాక్టుల పేరుతో భారీ ఎత్తున అక్రమార్జన చేశాడని ప్రతీతి. చంద్రబాబుకు బినామీగా కూడా చెబుతారు. ఇప్పుడు ఎంపీగా గెలవడం కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకూ వందకోట్ల చొప్పున ఖర్చు చేస్తాడట! డబ్బు విసిరితే గెలుస్తామనే ధీమా. ప్రజల వివేకం మీద చిన్నచూపు. ఇతని మీద పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు రాష్ట్ర మంత్రి. పేరుకు మంత్రే కానీ,ఆర్థికంగా సామాన్యుడు. ఇప్పుడిక్కడ బీసీ వెలమ వర్సెస్‌ ఓసీ వెలమ, లోకల్‌ వర్సెస్‌ నాన్‌ లోకల్, సామాన్యుడు వర్సెస్‌ సంపన్నుడి మధ్యన పోటీ జరగబోతున్నది. సామాన్యుడు గెలి స్తేనే ధనస్వామ్యం తోక ముడుస్తుంది. ప్రజాస్వామ్య పతాకం రెపరెపలాడుతుంది.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement