వర్తమాన భారత రాజకీయాల్లో అలవోకగా అబద్ధాలు చెప్పగలిగే నేర్పరి ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం మంది ప్రజలు ఠకీమని సమాధానం చెప్పగలరు. అబద్ధం – ఆయనా కవల పిల్లలన్నంతగా అపఖ్యాతిపాలైన ఆ నాయక శిరోమణి పేరు చంద్రబాబని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నిజం చెబితే ఆయన తల వేయి ముక్కలవుతుందని ముని శాపం వున్నది, అందువల్లనే ఆయన నిజం చెప్పడ’ని వైఎస్సార్ తరుచూ చెబుతుండేవారు. ‘కళ్లార్పకుండా అబద్ధం చెప్పగలిగే వాడే చంద్రబాబ’ని జగన్‌మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారు.
అటువంటి చంద్రబాబు రామోజీరావు చెంతకు చేరారు. లేదా, రామోజీయే చంద్రబాబును చేరదీశారు. రామోజీది గోబెల్స్ అంశ. అంతకంటే నైపుణ్యం గలవాడు. గోబెల్స్‌ను తొండ అనుకుంటే, రామోజీని ఊసరవెల్లి అనుకోవాలి. భౌతిక శాస్త్రంలో న్యూటన్ వంటివాడు గోబెల్స్ అనుకుంటే, ఐన్‌స్టీన్ మాదిరిగా అప్‌డేటెడ్ వెర్షన్ రామోజీ. ఆయనకు రాసు కోవడానికి పత్రికా, చూసుకోవడానికి టీవీలూ, తీసుకోవడానికి స్టూడియో ఉన్న సంగతి తెలిసిందే. వాటి సాయంతో ప్రాప గాండా అనే సబ్జెక్టును అసత్యశాస్త్రంగా అభివృద్ధి చేశారు. రామోజీ–బాబులకు ఇంకొందరు పిల్ల గోబెల్స్ తోడయ్యారు. ఇంకేముంది? అసలే కోతి... కల్లు తాగింది. ఆపై నిప్పు తొక్కింది. దాన్ని ఎగరకుండా ఆపడం ఎవరి తరం?
ఆ కల్లు తాగిన కోతికే జనం యెల్లో మీడియా అనే వాడుక పేరు తగిలించారు. ఈ యెల్లో మీడియాకు జగన్‌మోహన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నదనే సంగతి తెలియనిది కాదు. పొలిటికల్ బాసు బాబు మీద మన యెల్లో మీడియా ఈగనైనా వాలనీయదు. ఆయన్ను కుర్చీలోంచి లాగి గిరాగిరా తిప్పి నేల కేసి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కనుకనే 2014లో, ఆ తర్వాత 2019లో జగన్‌మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోటి అబద్ధాల నోము నోచింది. నూరు అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు. ఇదే స్ఫూర్తితో కోటి అబద్ధాలా డైనా సరే బాబును కుర్చీలో కూర్చోబెట్టాలనే సంకల్పాన్ని యెల్లో మీడియా తలదాల్చింది.
ఈసారి ఇంకా పెద్దఎత్తున శతకోటి అబద్ధాల నోమును ప్రారంభించినట్టున్నారు. యెల్లో పత్రికలూ, ఛానెళ్లూ అబద్ధాల మందుగుండును అడ్డదిడ్డంగా పేలుస్తున్నాయి. ఈ అడ్డగోలు కాల్పులు లక్ష్యాన్ని తాకలేకపోతున్నాయి. జనంలో విశ్వసనీ యత పూర్తిగా సన్నగిల్లింది. వీళ్లు పొరపాటున ఎప్పుడో ఒక నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దాంతో కొత్త వార్‌ఫ్రంట్స్‌ను చంద్రబాబు ఓపెన్ చేశారు. తెలుగుదేశం – యెల్లో మీడియాల స్క్రిప్టును చదవడానికి, అబద్ధాలను వల్లె వేయడానికి వేరే గొంతులు కావాలి. వేరే ముఖాలు కనిపించాలి. ఇటువంటి పరకాయ ప్రవేశపు వ్యూహాలను చంద్రబాబు చాలా కాలంగానే అమలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ వ్యూహా లకు మరింత పదును పెట్టారు.
ఇతర పార్టీల్లో, వ్యవస్థల్లో, సంస్థల్లో తన మనుషులను జొప్పించి తనకు అవసరమైనట్టుగా ఆడించుకోవడం చంద్ర బాబు వెన్నుపోటుతో నేర్చిన విద్య. చంద్రబాబు ఉచ్చులోపడి ఆయన మెప్పుకోసం ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యాయమూర్తి పరిస్థితిని నిన్ననే చూశాము. ఆ న్యాయమూర్తి వ్యవహారశైలిని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. పైనున్న వారి అండ చూసుకొని అభ్యంతరకరంగా వ్యవహరించిన న్యాయమూర్తికి శృంగభంగం తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నెక్కాలన్న లక్ష్యంతో అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలతోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తులు పెట్టుకోవడానికి చంద్ర బాబు పడుతున్న ప్రయాస కనిపిస్తూనే ఉన్నది.
ఇప్పటికే జనసేనను హత్తుకున్న బాబు బీజేపీ పెద్దల కటాక్షం కోసం నిరీక్షిస్తున్న సంగతి గమనిస్తూనే ఉన్నాము. ఇక రాష్ట్రంలో ఖాయిలాపడిన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కౌలుకు తీసుకున్న సంగతి కూడా జగమెరిగిన సత్యమే. జనసేన, బీజేపీలు తనకు ఓట్లను జోడించాలి. కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఓట్లను చీల్చాలి. ఇదీ చంద్రబాబు–రామోజీల స్వీట్‌డ్రీమ్. ప్రత్యక్ష పొత్తు పార్టీలతో పాటు పరోక్ష పొత్తు పార్టీ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేయాలి. అపోహలు సృష్టించాలి. అవసరమైన అబద్ధాల స్క్రిప్టును టీడీపీ అందజేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉన్నది. చంద్రబాబు ఆకాంక్షల మేరకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షు రాలి నియామకం కూడా జరిగింది. పీసీసీ అధ్యక్షురాలితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం, యెల్లో మీడియా భాషనే మాట్లాడుతున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు ఇంచుమించు చంద్రబాబు కున్నంత రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన నిన్న విజయ వాడలో ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో ఒక అద్భుతమైన, అనూహ్యమైన పొట్టలు పగిలేలా విరగబడి నవ్వించే సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతున్నాయట! కుబేరుడికి చందాలివ్వడమేమిటో! ప్రపంచంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీకి పేరున్నది.
పదేళ్లుగా అవిచ్ఛిన్నంగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్నది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలూ వారివే. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలంతా ఆ పార్టీ కను సన్నల్లోనే మసులుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పు డిప్పుడే కాలు చేయి కూడదీసుకుంటున్న రాష్ట్రం నుంచి వారికి ముడుపులు కావాలా? ఈ నికృష్టమైన ఆరోపణ చేయడానికి టీడీపీకి ధైర్యం సరిపోదు గనుక ‘బంతి’ని కాంగ్రెస్‌కు పాస్ చేసింది. బాల్ దొరికిందని గోల్ కొట్టబోయి కేవీపీ బొక్కబోర్లా పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడిగా అక్రమ కేసును బనాయించి జగన్‌మోహన్ రెడ్డిని అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఉత్తి పుణ్యానికి అంతకాలం జైల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయ కత్వం సంతృప్తి చెందినట్లు లేదు. అంధ్రప్రదేశ్ మంత్రులెవరూ అరెస్టు కావడం లేదేమిటని ఆయన చాలా బాధపడ్డారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నదని టీడీపీ యెల్లో మీడియా చేస్తున్న విషప్రచారానికి వంత పాడటమన్న మాట. ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి సంగతి సరేసరి. వైసీపీకి మద్దతునిస్తున్న మైనా రిటీల ఓట్లు చీల్చడానికి బాబు అప్పగించిన బాధ్యత నిర్వహణ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు జరిగితే జగన్‌మోహన్ రెడ్డి ఖండించలేదట! అసలు మణిపూర్‌లో జరిగిందేమిటి? మతాల మధ్యన ఘర్షణగా ఎందుకు చిత్రిస్తున్నారు? రోజూ పత్రికలు చదివే వారికి మణిపూర్ ఘటనల నేపథ్యం తెలిసే ఉంటుంది. అది రెండు తెగల మధ్యన ఏర్పడిన పరస్పర అపనమ్మకం. ఒకరి పట్ల ఒకరిపై అనుమానం. ఇక్కడ మతం లేదు. కొండ ప్రాంత షెడ్యూల్డ్ తెగ కుకీలకు, మైదాన ప్రాంత మెయితీలకు మధ్యన ఏర్పడిన విభేదాలు కారణం. మెయితీల్లో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం, కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కావడం యాదృచ్ఛికం.
ఈ వివాదానికి అది కారణం కాదు. మెయితీల్లో క్రైస్తవులు, మహ్మదీయులు కూడా ఉన్నారు. మెయితీలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించే ప్రతిపాదన పట్ల కుకీల్లో అభద్రతాభావం ఏర్పడింది. తమ భూములు కూడా క్రమంగా మైదాన ప్రాంతాల వారి చేతుల్లోకి వెళ్లి పోతాయే మోననే భయం కుకీలను ఆందోళనకు పురికొల్పింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల ఘర్షణలు చెలరేగి కొన్ని సిగ్గుపడా ల్సిన సంఘటనలు జరిగాయి.
కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పరిష్కరించవలసిన స్థానిక సమస్యకు మతం రంగులు పులమడం, మత వైషమ్యాలు లేని రాష్ట్రంలో చిలువలు పలువలు చేర్చి రెచ్చ గొట్టడం అవాంఛనీయం. తమ పబ్బం గడుపుకోవడానికి కుటుంబాలను చీల్చడం, కులాల మధ్య కుంపట్లు పెట్టడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి పనులకు కొందరు రాజకీయవేత్తలు వెనుకాడరు. తమ నోటి వెంట వస్తే రక్తి కట్టవనుకున్న సంభాషణల్ని ఇతరుల చేత పలికిస్తారు. ఆ స్క్రిప్టును చదివేవాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి చదవడం మంచిది.
అధికారపక్షం మీద అబద్ధాలనే ఆయుధాలుగా ప్రయోగించే కార్యక్రమంలో భాగంగా యెల్లో మీడియా, జనసేనలతోపాటు ఈ వారం కాంగ్రెస్ పరివారాన్ని కూడా చంద్రబాబు రంగంలోకి దించారు. దాంతోపాటు ఒకానొక సర్వే సంస్థను కూడా ప్రయో గించారు. దాని పేరు సీ–వోటర్. ఈ సంస్థకు విశ్వసనీయత లేదనీ, ఈ సంస్థతో చంద్రబాబుకు అక్రమ సంబంధం ఉన్నదనీ చెప్పడానికి కావలసినన్ని రుజువులున్నాయి.
ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎన్నికల కంటే ముందే ప్రజల మూడ్‌ను అంచనా కట్టి రిపోర్టు ఇస్తే అది కనీసం 90 శాతమన్నా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దాని ప్రొఫెషనలిజం మీద నమ్మకం కుదురుతుంది. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో సెఫాలజీ ఒక శాస్త్రంగా బాగా వేళ్లూనుకున్నది. 90 నుంచి 95 శాతం వరకు కచ్చితత్వంతో చాలా సంస్థలు రిపోర్టులు ఇవ్వ గలుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లేకపోయినా ట్రెండ్‌నయితే సరిగ్గానే పట్టుకుంటున్నారు. విజేతను ముందు గానే గుర్తించగలుగుతున్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 86 శాతం (151) అసెంబ్లీ సీట్లను, 88 శాతం (22) పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నది. ఇటువంటి భారీ విజయాల సందర్భాన్ని వేవ్‌గా, ప్రభంజనంగా పేర్కొంటారు. ప్రభంజనం ఉన్న సందర్భాల్లో ఔత్సాహిక సర్వే సంస్థలు సైతం విజేతను సరిగ్గానే ఊహిస్తాయి. సీట్ల సంఖ్యను చెప్పడంలో ప్రొఫెషనల్ సంస్థలు కొంతమేరకు దగ్గరగా రావచ్చు.
ఇటు వంటి సందర్భాల్లో కూడా సీట్ల సంఖ్యను పక్కనబెట్టి అసలు విజేతనే తప్పుగా ఊహించేవాడు ఎవడైనా ఉంటాడా? ఒక్కడున్నాడు. వాడే సీ–వోటర్. ముందస్తు సర్వేలో వైసీపీకి 10 సీట్లు, టీడీపీకి 15 సీట్లు వస్తాయని రిపోర్టు ఇచ్చాడు. పోలింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోల్‌లో కొద్దిగా సవరించి వైసీపీకి 11, టీడీపీకి 14 ఇచ్చాడు. వాస్తవ ఫలితం తెలిసిందే. వైసీపీకి 22, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. ఆ మూడు సీట్లను కూడా పదివేల లోపు ఓట్ల తేడాతోనే టీడీపీ గెలిచింది. అంత వేవ్‌ను అంచనా వేయలేకపోతే అది ఒక ప్రొఫెషనల్ సంస్థగా పని చేయడం తగునా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో జరిగిన ఎన్నికలను పరిశీలిద్దాం. పోలింగ్ ముగిసిన రోజున సీ–వోటర్ సంస్థ ప్రెస్‌మీట్ పెట్టి తెలుగుదేశం 160 సీట్లు గెలవబోతున్నదని ప్రకటించింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో టీడీపీకి 47 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. ప్రొఫెషనల్ సంస్థ చేసే సర్వే ఇంత దారుణంగా వికటిస్తుందా? వచ్చే ఎన్నికలకు సంబంధించి గడిచిన నెల రోజుల్లో 13 సర్వేలు వచ్చాయి.
అందులో పన్నెండు సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 47.7 నుంచి 51 శాతం వరకు ఆ పార్టీ వోట్ షేర్‌ను అంచనా వేశాయి. టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినవాడు మళ్లీ ఒకే ఒక్కడు. వాడే సీ–వోటర్. టీడీపీకి 17 పార్లమెంట్ సీట్లు, వైసీపీకి 8 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఆ సంస్థ ఆంచనా వేసింది. వైసీపీకి 41 శాతం, టీడీపీ కూటమికి 45 శాతం ఓటు షేర్ ఉన్నట్టు ప్రకటించింది. ఊరంద రిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఇంకో దారి అంటారు. ఇప్పుడు సీ–వోటర్ అనే సంస్థదీ అదే దారి.
చంద్రబాబుకు సంబంధించిన ఎన్నికలు జరిగే ప్రతి సంద ర్భంలోనూ ఈ సంస్థ ఆయన పార్టీయే గెలుస్తుందని రిపోర్టులు ఇచ్చింది. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ సంస్థది ఇదే కథ. చంద్రబాబు అనగానే ఆటోమేటిక్‌గా విజేత అని వచ్చేట్టు కంప్యూటర్ ప్రోగ్రామింగేదో వీళ్ల దగ్గర ఉన్నట్టున్నది. సీ–వోటర్ అనే సంస్థ చంద్రబాబు పెంపుడు చిలక అనడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఈ పెంపుడు చిలక పలికిందని గడిచిన రెండు రోజులుగా యెల్లో మీడియా పండుగ చేసుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఐదేళ్ల కిందటి ఫలితాలే ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కాబోతున్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
అబద్ధాలే ఆయుధాలు!
Published Sun, Feb 11 2024 1:41 AM | Last Updated on Sun, Feb 11 2024 1:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment