Krishna basin projects
-
కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
గద్వాల రూరల్/దోమలపెంట: కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు జూరాలకు 2.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 38 క్రస్టుగేట్లు ఎత్తి శ్రీశైలానికి 2.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోవైపు విద్యుదుత్పత్తి ద్వారా 27,943 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 2,33,021 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.14 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,83,636 క్యూ సెక్కులు ఉండగా, 2,00,451 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 112.10 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు జూరాలతో పాటు సుంకేసుల నుంచి 1,60,338 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం 4,03,275 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పది గేట్లు 15 అడుగల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,77,650 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 58,609 క్యూసెక్కులు.. మొత్తం 4,36,259 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.6 అడుగులు, 213.4011 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అప్పగించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను తమకు అప్పగించాల్సిందేనని కృష్ణా బోర్డు మరోమారు తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలను అమల్లో పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని, దీనికి రెండు రాష్ట్రాలు సహకరించాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్ తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. కృష్ణా బేసిన్‌కు సంబంధించి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 15 ఔట్లెట్లను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరినా తెలంగాణ నుంచి స్పందన లేకపోవడంతో ఈ లేఖలను సీఎస్‌లకు రాసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పవర్‌హౌస్‌లను అప్పగించేందుకు రాష్ట్రం అయిష్టత చూపుతుండటంతో గెజిట్ అమలు అంశం సందిగ్ధంలో పడింది. గెజిట్ అమలు చేసేలా ఆదేశాలివ్వండి తాజా లేఖల్లో బోర్డు చైర్మన్ గెజిట్ అంశాలను మరోమారు ప్రస్తావించారు. నోటిఫికేషన్‌లోని అంశాల అమలు దిశగా రెండు రాష్ట్రాలతో విస్తృతంగా చర్చించామని, అయితే పలు అంశాలపై వివరాలు అందజేయడంతో పాటు, తదుపరి చర్యలు తీసుకోవడంలో రెండు రాష్ట్రాలు జాప్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 14 నుంచే గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రావాల్సి ఉందని తెలిపారు. అందులో పేర్కొన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని బ్యారేజీలు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటరీ నిర్మాణాలు, కెనాల్ నెట్వర్క్, ట్రాన్స్మిషన్ లైన్లు బోర్డు స్వాధీనంలోకి రావాల్సి ఉందని గుర్తు చేశారు. అలాగే అక్టోబర్ 14 నాటికి రెండు రాష్ట్రాలు తమ ప్రాజెక్టులను, వాటి పరిపాలన, నిర్వహణ, నియంత్రణను బోర్డుకు అప్పగించాల్సి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగర్, శ్రీశైలం పరిధిలోని పలు ఔట్లెట్లను కొన్ని ఆంక్షలతో బోర్డుకు అప్పగిస్తూ జీవో 54, జీవో 17లను విడుదల చేసిందని గుర్తు చేశారు. దీంతో పాటే గెజిట్ ప్రకారం రెండు రాష్ట్రాలు వన్‌టైమ్ సీడ్‌మనీ కింద చెరో రూ.200 కోట్లు బోర్డు బ్యాంకు అకౌంట్లో జమ చేయాల్సి ఉందని, అయితే ఇప్పటికీ రెండు రాష్ట్రాలు ఈ మేరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. నగదు జమ చేయని పక్షంలో బోర్డు తన విధులను ప్రభావవంతంగా కొనసాగించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. గెజిట్ అంశాల అమలుకు సహకరించేలా ఆయా ప్రభుత్వ శాఖలకు సరైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీఎస్‌లను బోర్డు చైర్మన్ కోరారు. -
కేంద్రం కోర్టులోకి ‘నియంత్రణ’
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేలా తుది ముసాయిదా నోటిఫికేషన్‌ను ఆ నదీ జలాల బోర్డు సిద్ధం చేసింది. ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులు బోర్డు అధీనంలోనే పని చేసేలా రూపొందించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం కేంద్రానికి పంపింది. దీన్ని కేంద్రం ఆమోదిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు కూడా బోర్డు పరిధిలోకి రానున్నాయి. ఇప్పటికే బోర్డు పరిధిని ఖరారు చేసే అధికారం రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తమకుం దని కేంద్రం కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో త్వరలో ఈ ఆమోదం ఉండొచ్చని తెలుస్తోంది. దసరా తర్వాత నిర్ణయం.. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ, ఏపీలు కొత్తగా చేపట్టిన, చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను తన పరిధిలోకి తెచ్చుకునేందుకు బోర్డు ఎప్పటినుంచో యత్నాలు చేస్తోంది. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వీలుగా ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాలని కేంద్రానికి విన్నవించింది. దీనిపై కేం ద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో శ్రీశైలం, సాగర్‌తో పాటు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, ఏఎమ్మార్పీలను తమ పరిధిలోకి తెచ్చుకుంటామని తెలుపుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను సిద్ధం చేసిన కృష్ణా బోర్డు ఇప్పటికే ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. గతంలో వెలువరించిన ట్రిబ్యునల్ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల విద్యుదుత్పత్తిని సైతం తామే పర్యవేక్షిస్తామని పేర్కొంది. అయితే ఈ సమయంలోనే ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణను తెలంగాణ గట్టిగా వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం.. ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, నీటి లెక్కలు తేలాక, బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలని తేల్చిచెప్పింది. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటినుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమంటూ ఏపీ కేంద్రానికి లేఖలు సైతం రాసింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం సైతం మరో లేఖ రాసింది. తెలంగాణ రెండ్రోజుల కింద దీన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఘాటు లేఖ రాసింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగాకే నియంత్రణపై ముందుకెళ్లాలని, లేని పక్షంలో అడ్‌హక్‌గా ప్రస్తుతమున్న కేటాయింపులను మార్చి కృష్ణా జలాల పంపిణీని 50ః50 నిష్పత్తిన దామాషాలో చేపట్టాలని కోరింది. అయితే వీటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని బోర్డు.. కేంద్ర జల శక్తి శాఖ సూచనల మేరకు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకు నేలా ముసాయిదా నోటిఫికేషన్ ను కేంద్రా నికి నివేదించినట్లు తెలిసింది. దీనిపై దసరా తర్వాత కేంద్రం నిర్ణయం చేయనుంది. రాష్ట్రాలకు చేరిన అపెక్స్ మినిట్స్.. ఇటీవలి అపెక్స్ కౌన్సిల్ భేటీకి సంబంధించిన మినిట్స్ కాపీలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేరినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మినిట్స్లోని అంశాలను ముఖ్యమంత్రులు పరిశీలించాక తుది ఆమోదం ఇస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. మినిట్స్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈఎన్సీ మురళీధర్‌తో శుక్రవారం చర్చించారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్న అంశాలు సానుకూలంగా ఉన్నా.. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తామని, కొత్త ప్రాజెక్టులు కేంద్ర అనుమతులు వచ్చే వరకు ఆపాలని ఉన్న అంశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో వీటిపై పూర్తిస్థాయిలో సమీక్షించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. -
100 టీఎంసీలు కావాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్లో రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలకు 100 టీఎంసీల మేర అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. నాగార్జునసాగర్ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించడంతో అక్కడి అవసరాలు,ఏఎంఆర్పీ, హైదరాబాద్ తాగునీరు, కల్వకుర్తికి కలిపి ఈ నీళ్లు సరిపోతాయని తేల్చింది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా బోర్డు నుంచి అభ్యంతరాలు ఉండబోవని భావిస్తోంది. లభ్యత పుష్కలం.. సాగర్కింద ఈ యాసంగిలో 6.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. గతేడాది పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరిచ్చిన సందర్భాల్లోనూ 45 నుంచి 50 టీఎంసీల నీటిని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన విడుదల చేశారు. ఈ ఏడాది సైతం 50 టీఎంసీల నీటితో సాగు అవసరాలు తీర్చవచ్చని నీటి పారుదల శాఖ లెక్కలేస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 294.55 టీఎంసీల లభ్యత ఉంది. ఇందులో తెలంగాణకు దక్కే వాటాల్లోంచి సాగర్‌కు అవసరమయ్యే నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక సాగర్ కిందే ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ కింద 2.80లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, దీని అవసరాలకు మరో 20 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో 10 టీఎంసీలు అవసరం పడతాయని అంచనా వేస్తున్నారు. సాగర్ కిందే మొత్తంగా 80 టీఎంసీలకు అవసరం ఉంటోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ కల్వకుర్తికింద 1.80 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వనున్నారు. దీనికి, తాగునీటి అవసరాలకు కలుపుకొని మొత్తంగా 20 టీఎంసీలు శ్రీశైలం నుంచి తీసుకో నున్నారు. శ్రీశైలంలోనూ 215 టీఎంసీలకు గానూ 182.61 టీఎంసీల లభ్యత ఉంది. మొత్తం రెండు ప్రాజెక్టుల్లోనూ ఉన్న నీటి లభ్యతలోంచి తెలంగాణకు ఇప్పటివరకు వినియోగించిన వాటా, ఇకపై వినియోగించే వాటాలు కలిపి గరిష్టంగా 175 టీఎంసీల వాటా దక్కే అవకాశం ఉందని ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖలో కృష్ణా బోర్డు పేర్కొంది. ఈ వాటాల్లోంచే 100 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించనుండగా, మిషన్ భగీరథతో పాటు జిల్లాల తాగునీటి అవసరాలకు మరింత నీటిని వినియోగించుకునే వెసులుబాటు తెలంగాణకు ఉండనుంది. ఎజెండాలో మళ్లింపు జలాలను చేర్చిన రాష్ట్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వచ్చే జూన్ వరకు నీటి కేటాయింపులకు సంబంధించి చర్చించేందుకు ఈనెల 3న మంగళవారం కృష్ణాబోర్డు భేటీ కానుంది. బోర్డు భేటీలో నీటి కేటాయింపులతో పాటు, కార్యాలయాన్ని అమరావతికి తరలింపు, బడ్జెట్ కేటాయింపులు, వర్కింగ్ మాన్యువల్, ఇతర అంశాలపై ఇందులో చర్చిద్దామని ప్రతిపాదించింది. ఇందులో పట్టిసీమ, పోలవరం ద్వారా మళ్లిస్తున్న జలాల్లో తెలంగాణకు దక్కే వాటా, తాగునీటికి కేటాయిస్తున్న నీటిలో వినియోగాన్ని కేవలం 20%గా మాత్రమే పరిగణించాలన్న అంశాలను చేర్చాలని కోరుతూ తెలంగాణ బోర్డును కోరింది. దీనికి బోర్డు అంగీకరించింది. -
కడలివైపు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలుగా మారడంతో దిగువకు వదులుతున్న నీరంతా ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలుస్తోంది. కృష్ణమ్మ ఉరకలెత్తుతుండటంతో రెండ్రోజులుగా ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. ప్రకాశం బ్యారేజీలోకి 4,27,635 క్యూసెక్కులు ప్రవాహం వస్తుండగా..4,98,781 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటివరకూ 46.5 టీఎంసీలు సముద్రంలోకి విడుదల చేశారు. ఇందులో గత 24 గంటల్లోనే 33 టీఎంసీలు విడుదల చేయడం గమనార్హం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండటంతో గత మూడ్రోజులుగా నాగార్జునసాగర్ 26 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. రెండ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నందున, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. -
‘మళ్లింపు’ కథ మళ్లీ మొదటికి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశమై అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ గడువు ఆదివారంతో ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పర్యటనలు, సమావేశాలు నిర్వహించకుండానే కమిటీ అధికారికంగా రద్దయిపోయింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న మళ్లింపు జలాల అంశం మళ్లీ మొదటికొచ్చింది. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించడం లక్ష్యంగా కేంద్ర జల వనరుల శాఖ గతేడాది అక్టోబర్‌లో ఏకే బజాజ్ నేతృత్వంలో ఐదుగరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో పర్యటించిన కమిటీ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని కోరింది. అయితే మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని కమిటీ చేతులెత్తేసింది. ఈ సమయంలోనే కమిటీ గడువు ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ ఆరు నెలల వ్యవధిలో రాష్ట్రంలో ఒక్క పర్యటన కూడా కమిటీ చేయలేదు. ప్రస్తుతం కమిటీ రద్దయిన నేపథ్యంలో ఈ వివాదాన్ని ట్రిబ్యునల్ పరిధిలోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. -
బిరబిరా కృష్ణమ్మ.. కదలి రావమ్మా!
► రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి కృష్ణా పరవళ్లు.. ► 100 టీఎంసీలకు చేరిన ఆల్మట్టి నిల్వ ► ప్రస్తుతం 1.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ► రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం.. ► ఇప్పటికే నారాయణపూర్‌కు 33 వేల క్యూసెక్కులు విడుదల ► మరో 20 టీఎంసీలు చేరితే దిగువకు కృష్ణమ్మ పరుగులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం వైపు మరో రెండు మూడు రోజుల్లో కృష్ణమ్మ పరవళ్లు మొదలు కానున్నాయి. ఎగువ కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకో వడంతో దిగువ ఆశలు సజీవమయ్యాయి. అక్కడ కురుస్తున్న వర్షాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవడంతో ఆల్మట్టిలోకి నీటి ప్రవాహాల ఉధృతి కొనసాగుతోంది. దీంతో సోమవారం ఉదయానికి 88.94 టీఎంసీలు ఉన్న నిల్వ సాయంత్రానికి 100 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 1.42 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయి. వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని దిగువ నారాయణపూర్‌కి నీటి విడుదల కొనసాగుతుండటంతో అక్కడ మట్టాలు పెరిగాయి. రెండు ప్రాజెక్టుల్లో మరో 20 టీఎంసీల మేర నీరు చేరితే దిగువ జూరాలకు నీటి విడుదల జరిగే అవకాశాలున్నాయి. ఆల్మట్టికి జల కళ కృష్ణా పరీవాహకంలో గడిచిన పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి జలకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టులోకి ఈ పది రోజుల్లోనే సుమారు 70 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 1.42 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టి వాస్తవ నీటి మట్టం 1,705 అడుగుల కాగా ప్రస్తుతం 1,696.52 అడుగులకు నీరు చేరింది. 129.7 టీఎంసీలకు గానూ సోమవారం ఉదయానికి 88.94 టీఎంïసీల నీటి లభ్యత ఉంది. ఉదయం నుంచి భారీగా ప్రవాహాలు కొనసాగడంతో సాయంత్రానికి మట్టం 100 టీఎంసీలకు చేరినట్లు కర్ణాటక నీటి పారుదల వర్గాలు తెలంగాణ అధికారులకు సమాచారం ఇచ్చాయి. భారీ వరదను దృష్టిలో పెట్టుకొని పవర్ హౌజ్ ద్వారా 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి నుంచి వదిలిన నీరంతా దిగువ నారాయణపూర్‌కు వస్తుండటంతో ఆ ప్రాజెక్టు నిండేందుకు సిద్ధంగా ఉంది. నారాయణపూర్‌లో 37.64 టీఎంసీ సామర్థ్యానికి గానూ సోమవారం ఉదయం 29.88 టీఎంసీల నీరు లభ్యంగా ఉంది. ఉదయం నుంచి 35,740 క్యూసెక్కుల ప్రవాహాలు ఉండటంతో ప్రాజెక్టు ఏ క్షణమైనా నిండే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు నిండేందుకు మరో రెండు, మూడు రోజులు పడుతుందని, అదే జరిగితే దిగువ జూరాలకు నాలుగు రోజుల్లో కృష్ణా ప్రవాహాలు నమోదవుతాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జూరాలలో 9.6 టీఎంసీల సామర్థ్యానికి గానూ 6.73 టీఎంసీల నిల్వ ఉంది. ఒక్కసారి ప్రవాహాలు మొదలైతే ప్రాజెక్టు నీటిపై ఆధారపడిన ఆయకట్టుకు నీటి విడుదల మొదలు కానుంది. 5 లక్షల ఎకరాలకు సాగునీరు.. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి రెండుమూడు రోజుల్లో నీటి విడుదల జరిగే అవకాశం ఉండటం, మరో నాలుగు రోజుల్లో జూరాలకు ప్రవాహాలు ఉండే అవకాశం ఉన్నందున మహబూబ్‌నగర్‌లో జూరాలపై ఆధారప నడిన ఆయకట్టుకు నీరందించే ప్రక్రియపై నీటి పారుదల శాఖ దృష్టి పెట్టింది. జూరాల కింద ఉన్న లక్ష ఎకరాలకు నీటిని అందించడంతో పాటు బీమా నుంచి 2 లక్షలు, నెట్టెంపాడు నుంచి 1.5 లక్షలు, కోయిల్‌సాగర్ నుంచి 50 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చెరువులను నింపేందు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఇదివరకే అధికారులను ఆదేశించారు. -
కృష్ణమ్మా.. పరవళ్లు ఏవమ్మా?
- బోసిపోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు - వర్షాకాలం మొదలై నెలన్నరైనా ఎగువ నుంచి వరద కరువు వానాకాలం మొదలై నెలన్నర అయింది.. కానీ వర్షాల్లేవు.. ఎగువ నుంచి వరద లేదు.. ఫలితంగా కృష్ణమ్మ వెలవెలబోతోంది. ఈపాటికి జలకళ సంతరించుకోవాల్సిన కృష్ణా ప్రాజెక్టులన్నీ బోసిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరలేదు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ జంటనగరాలు, నల్లగొండతోపాటు ఏపీలోని రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు అటు తాగునీటికి, ఇటు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటిని తాగు అవసరాలకు వాడేయడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటిమట్టాలు డెడ్ స్టోరేజీ కన్నా దిగువకు చేరాయి. ఆయకట్టుకు సాగునీరు సంగతి అటుంచితే తాగునీటి అవసరాలకు కూడా సరిపోయేంత నీటి లభ్యత లేదు. దీంతో రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎగువన మరో 206 టీఎంసీల నీరు చేరితే కానీ దిగువకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. -సాక్షి, హైదరాబాద్ వచ్చింది ఏడు టీఎంసీలే.. దక్షిణ తెలంగాణకు ప్రధాన ఆదరువుగా ఉన్న కృష్ణా నది గతంలో ఎన్నడూ లేనంత నీటి కటకటను ఎదుర్కొంటోంది. తెలంగాణ, ఏపీలోని కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటివరకు సరైన వర్షాలు కురవకపోవడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరలేదు. సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులుకాగా.. ప్రస్తుతం 504.2 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో 885 అడుగులకుగాను 787.8 అడుగులకు పడిపోయింది. నెలన్నర వ్యవధిలో సాగర్ పరిధిలో వ చ్చిన నీరు ఒక టీఎంసీ మాత్రమే. శ్రీశైలంలో ఇప్పటికే 834 అడుగుల కనీస మట్టాన్ని దాటి నీటిని వాడేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం 787.8 అడుగుల వద్ద 23.47 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. తుంగభద్రకు కొద్దిమేర వరద ఉండడంతో శ్రీశైలానికి సాగర్ కన్నా కాస్త మెరుగ్గా 4 టీఎంసీల మేర నీరు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. జూరాలకు కూడా 2 టీఎంసీల నీరే వచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ ప్రాజెక్టుల్లోకి 7 టీఎంసీల నీరు రాగా.. మొత్తంగా 389 టీఎంసీల కొరత ఉంది. సాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న నీటిలో సుమారు 6 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు వాడుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోనూ ఖాళీ.. ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ ఎన్నడూ లేనివిధంగా జూలైలోనూ ప్రాజెక్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆలమట్టి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.15 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఈ సీజన్లో ఆలమట్టిలోకి 7 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి 62.61 టీఎంసీల మేర నీరుండగా ప్రస్తుతం 28 టీఎంసీల మేర తక్కువగా ఉంది. అయితే గడచిన రెండ్రోజులుగా అక్కడ గరిష్ట ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఆదివారం 17 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక 37.64 టీఎంసీల సామర్థ్యం ఉన్న నారాయణపూర్‌లో ప్రస్తుతం 15.15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నెలన్నర సమయంలో అక్కడ 4 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. తుంగభద్రలో 100 టీఎంసీలకుగానూ 27.39 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతగా ఉంది. మొత్తంగా ఎగువ ప్రాజెక్టుల్లో ఏకంగా 206 టీఎంసీల మేర లోటు కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలకు మరో నెల రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కలవరపెడుతున్నాయి. అయితే పుష్కరాల సమయానికీ అనుకున్నంత మేర నీరు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సందిగ్ధంలో ఆయకట్టు తెలంగాణలో సాగర్ కింద 6 లక్షలు, జూరాల కింద లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుల్లోకి నీరు రాకపోవడంతో ఈ 7 లక్షల ఎకరాల్లో పంటలసాగు సందిగ్ధంలో పడింది. మిగతా చోట్ల ఖరీఫ్ ఆరంభమై నాట్లకు సిద్ధమవుతున్నా.. ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో నీళ్లు లేక రైతులు తలలు పట్టుకున్నారు. కాస్త ఆలస్యంగానైనా నీళ్లొస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు.