సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను తమకు అప్పగించాల్సిందేనని కృష్ణా బోర్డు మరోమారు తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాలను అమల్లో పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని, దీనికి రెండు రాష్ట్రాలు సహకరించాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్ తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. కృష్ణా బేసిన్‌కు సంబంధించి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 15 ఔట్‌లెట్‌లను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరినా తెలంగాణ నుంచి స్పందన లేకపోవడంతో ఈ లేఖలను సీఎస్‌లకు రాసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పవర్‌హౌస్‌లను అప్పగించేందుకు రాష్ట్రం అయిష్టత చూపుతుండటంతో గెజిట్ అమలు అంశం సందిగ్ధంలో పడింది.
గెజిట్ అమలు చేసేలా ఆదేశాలివ్వండి
తాజా లేఖల్లో బోర్డు చైర్మన్ గెజిట్ అంశాలను మరోమారు ప్రస్తావించారు. నోటిఫికేషన్‌లోని అంశాల అమలు దిశగా రెండు రాష్ట్రాలతో విస్తృతంగా చర్చించామని, అయితే పలు అంశాలపై వివరాలు అందజేయడంతో పాటు, తదుపరి చర్యలు తీసుకోవడంలో రెండు రాష్ట్రాలు జాప్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 14 నుంచే గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రావాల్సి ఉందని తెలిపారు. అందులో పేర్కొన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని బ్యారేజీలు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటరీ నిర్మాణాలు, కెనాల్ నెట్‌వర్క్, ట్రాన్స్‌మిషన్ లైన్‌లు బోర్డు స్వాధీనంలోకి రావాల్సి ఉందని గుర్తు చేశారు.
అలాగే అక్టోబర్ 14 నాటికి రెండు రాష్ట్రాలు తమ ప్రాజెక్టులను, వాటి పరిపాలన, నిర్వహణ, నియంత్రణను బోర్డుకు అప్పగించాల్సి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగర్, శ్రీశైలం పరిధిలోని పలు ఔట్‌లెట్‌లను కొన్ని ఆంక్షలతో బోర్డుకు అప్పగిస్తూ జీవో 54, జీవో 17లను విడుదల చేసిందని గుర్తు చేశారు. దీంతో పాటే గెజిట్ ప్రకారం రెండు రాష్ట్రాలు వన్‌టైమ్ సీడ్‌మనీ కింద చెరో రూ.200 కోట్లు బోర్డు బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాల్సి ఉందని, అయితే ఇప్పటికీ రెండు రాష్ట్రాలు ఈ మేరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. నగదు జమ చేయని పక్షంలో బోర్డు తన విధులను ప్రభావవంతంగా కొనసాగించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. గెజిట్ అంశాల అమలుకు సహకరించేలా ఆయా ప్రభుత్వ శాఖలకు సరైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీఎస్‌లను బోర్డు చైర్మన్ కోరారు.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అప్పగించాల్సిందే!
Published Mon, Nov 8 2021 1:39 AM | Last Updated on Mon, Nov 8 2021 1:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment