KRMB Water Distribution for AP and Telangana for 2022-23 - Sakshi
Sakshi News home page

Krishna River Management Board: మళ్లీ అవే పంపకాలు..ఏపీకి 66..తెలంగాణకు 34 శాతం

Published Sat, May 7 2022 2:25 AM | Last Updated on Sat, May 7 2022 9:18 AM

Krmb Water Distribution for AP and Telangana for 2022-23 - Sakshi

కృష్ణా బోర్డు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న  రజత్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం కృష్ణా జలాలను తాత్కాలికంగా కేటా యిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని, 2022– 23లో సైతం అమలు చేయాలని కృష్ణా నది యాజ మాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్ణయించింది. శుక్రవా రం జలసౌధలో సుదీర్ఘంగా సమావే శమైన కృష్ణా బోర్డు దీనితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు చైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ సి.మురళీధర్‌ రావు, ఓఎస్డీ శ్రీధర్‌ రావు దేశ్‌పాండే పాల్గొని తమ వాదనలు వినిపించారు. 

8 ఏళ్లుగా అన్యాయం: తెలంగాణ
2013 నాటి వినియోగం ఆధారంగా 2015లో ఖరా రు చేసిన తాత్కాలిక వాటాలను 8 ఏళ్లుగా కొసాగిం చడం తీవ్ర అన్యాయమని, దీనికి సమ్మతి తెలిపేది లేదని తెలంగాణ గట్టిగా వాదనలు వినిపించింది. ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ 811 టీఎంసీల కృష్ణా జలాలను  కేటాయించగా, ప్రస్తుతం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయిస్తున్నారు. అలాకాకుండా 50:50 నిష్పత్తిలో తాత్కాలిక కోటాను ఖరారు చేయాలని, తమకు 405.5 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టింది. 

34 శాతంతో మా అవసరాలు తీరవు
కృష్ణా బేసిన్‌ పరిధిలో తెలంగాణలో నిర్మించిన/ నిర్మిస్తున్న ఏఎమ్మార్పీ, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రా జెక్టుల కింద ఉన్న 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు 120 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల కింద ఉన్న 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు మరో 225 టీఎంసీల అదనపు అవసరాలున్నాయని, 34 శాతం కోటాతో తమ రాష్ట్ర అవసరాలు తీరవని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. 34 శాతం తాత్కాలిక కోటాను 2021–22లో మాత్రమే అమలు చేయాలన్న షరతుతో గతేడాది ఆమోదించామని, ఇంకా కొనసాగిస్తే అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. నదీ జలాల చట్టం కింద నీటి కేటాయింపులను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేసింది. అయితే నీటి కేటాయింపులు జరిపే అధికారం బోర్డుకు లేకపోవడంతో ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కోటానే కొనసాగించాలని చైర్మన్‌ ఎంపీ సింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ తరఫున ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి వాదనలు వినిపించారు.

తెలంగాణను కట్టడి చేయండి: ఏపీ
    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏడాదిగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జల విద్యుదుత్పత్తిపై బోర్డు సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. తాగు, సాగునీటి అవసరాలను ఫణంగా పెట్టి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని ఏపీ కోరింది. విద్యుదుత్పత్తి ద్వారా వృధాగా నీళ్లను సముద్రం పాలు చేయడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కేవలం 5 టీఎంసీలే మిగిలి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకే..
    తెలంగాణలో బోరుబావుల కింద వరిసాగుకు విద్యుత్‌ అవసరాలు భారీగా పెరిగాయని, రాష్ట్ర గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 14,200 మెగావాట్లకు చేరిందని తెలంగాణ తెలిపింది. విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేశామని, జల విద్యుత్‌ కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని వాదించింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తికి అనుసరించాల్సిన విధానంపై అధ్యయనం జరిపి 15 రోజుల్లో నివేదికను సమర్పించడానికి ఆరుగురు సభ్యులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. కాగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 34 టీఎంసీలకు మించి వినియోగించకుండా ఏపీని కట్టడి చేయాలని తెలంగాణ కోరింది. అయితే జలాశయాలన్నీ పూర్తిగా నిండాక వచ్చే మిగుల జలాలను వినియోగిస్తే వాటిని కోటా కింద పరిగణనలోకి తీసుకోరాదని ఏపీ వాదించింది. దీంతో ఈ అంశంపై అధ్యయనం జరిపే బాధ్యతను ఆరుగురు సభ్యుల ఉప కమిటీకి బోర్డు అప్పగించింది.

డ్యాంల భద్రతపై ఏకాభిప్రాయం
    ఉమ్మడి జలాశయాల భద్రత, మరమ్మతులపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. శ్రీశైలం డ్యాం మరమ్మతులకు రూ.800 కోట్ల వ్యయం అంచనా వేయగా, రెండు రాష్ట్రాలు కలిసి మరమ్మతులు చేపట్టేందుకు అంగీకరించాయి. నాగార్జునసాగర్‌ మరమ్మతులకు తెలంగాణ ఇప్పటికే రూ.20 కోట్లను విడుదల చేసింది. పులిచింతల డ్యాం రేడియల్‌ గేటు మరమ్మతుకు ఏపీ సమ్మతి తెలిపింది. ఆర్డీఎస్‌ ఆధునికీకరణ కోసం అధ్యయనం జరపడానికి రెండు రాష్ట్రాలు సమ్మతించాయి.

సీడబ్ల్యూసీ రూల్‌కర్వ్‌పై చర్చ
     శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలకు ఏ పరిమాణంలో నీళ్లు వస్తే.. అందులో ఏ రాష్ట్రం, ఏ ప్రాజెక్టుకు ఎంత నీళ్లు కేటాయించాలన్న అంశంపై సీడబ్ల్యూసీ రూపొందించిన ముసాయిదా నిబంధనలపై (రూల్‌ కర్వ్‌) బోర్డు సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల మేరకు రూల్‌ కర్వ్‌ ఉండాలని రెండు రాష్ట్రాలు బోర్డును కోరాయి. కాగా కృష్ణా బోర్డుకు ఏపీ 10, తెలంగాణ 13 ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాల్సి ఉండగా, 20 రోజుల్లో వీటిని సమర్పించాలని, లేని పక్షంలో ఆయా ప్రాజెక్టుల పురోగతిని తెలుపుతూ నివేదికలు సమర్పించాలని బోర్డు ఆదేశించింది. కాగా కృష్ణా జలాల కేటాయింపులను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని రజత్‌కుమార్‌ మీడియాకు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement