కృష్ణమ్మా.. పరవళ్లు ఏవమ్మా?
- బోసిపోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు
- వర్షాకాలం మొదలై నెలన్నరైనా ఎగువ నుంచి వరద కరువు
వానాకాలం మొదలై నెలన్నర అయింది.. కానీ వర్షాల్లేవు.. ఎగువ నుంచి వరద లేదు.. ఫలితంగా కృష్ణమ్మ వెలవెలబోతోంది. ఈపాటికి జలకళ సంతరించుకోవాల్సిన కృష్ణా ప్రాజెక్టులన్నీ బోసిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరలేదు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ జంటనగరాలు, నల్లగొండతోపాటు ఏపీలోని రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు అటు తాగునీటికి, ఇటు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటిని తాగు అవసరాలకు వాడేయడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటిమట్టాలు డెడ్ స్టోరేజీ కన్నా దిగువకు చేరాయి. ఆయకట్టుకు సాగునీరు సంగతి అటుంచితే తాగునీటి అవసరాలకు కూడా సరిపోయేంత నీటి లభ్యత లేదు. దీంతో రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎగువన మరో 206 టీఎంసీల నీరు చేరితే కానీ దిగువకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
-సాక్షి, హైదరాబాద్
వచ్చింది ఏడు టీఎంసీలే..
దక్షిణ తెలంగాణకు ప్రధాన ఆదరువుగా ఉన్న కృష్ణా నది గతంలో ఎన్నడూ లేనంత నీటి కటకటను ఎదుర్కొంటోంది. తెలంగాణ, ఏపీలోని కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటివరకు సరైన వర్షాలు కురవకపోవడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరలేదు. సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులుకాగా.. ప్రస్తుతం 504.2 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో 885 అడుగులకుగాను 787.8 అడుగులకు పడిపోయింది. నెలన్నర వ్యవధిలో సాగర్ పరిధిలో వ చ్చిన నీరు ఒక టీఎంసీ మాత్రమే. శ్రీశైలంలో ఇప్పటికే 834 అడుగుల కనీస మట్టాన్ని దాటి నీటిని వాడేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం 787.8 అడుగుల వద్ద 23.47 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. తుంగభద్రకు కొద్దిమేర వరద ఉండడంతో శ్రీశైలానికి సాగర్ కన్నా కాస్త మెరుగ్గా 4 టీఎంసీల మేర నీరు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. జూరాలకు కూడా 2 టీఎంసీల నీరే వచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ ప్రాజెక్టుల్లోకి 7 టీఎంసీల నీరు రాగా.. మొత్తంగా 389 టీఎంసీల కొరత ఉంది. సాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న నీటిలో సుమారు 6 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు వాడుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కర్ణాటకలోనూ ఖాళీ..
ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ ఎన్నడూ లేనివిధంగా జూలైలోనూ ప్రాజెక్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆలమట్టి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.15 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఈ సీజన్‌లో ఆలమట్టిలోకి 7 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి 62.61 టీఎంసీల మేర నీరుండగా ప్రస్తుతం 28 టీఎంసీల మేర తక్కువగా ఉంది. అయితే గడచిన రెండ్రోజులుగా అక్కడ గరిష్ట ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఆదివారం 17 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక 37.64 టీఎంసీల సామర్థ్యం ఉన్న నారాయణపూర్‌లో ప్రస్తుతం 15.15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నెలన్నర సమయంలో అక్కడ 4 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. తుంగభద్రలో 100 టీఎంసీలకుగానూ 27.39 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతగా ఉంది. మొత్తంగా ఎగువ ప్రాజెక్టుల్లో ఏకంగా 206 టీఎంసీల మేర లోటు కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలకు మరో నెల రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కలవరపెడుతున్నాయి. అయితే పుష్కరాల సమయానికీ అనుకున్నంత మేర నీరు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సందిగ్ధంలో ఆయకట్టు
తెలంగాణలో సాగర్ కింద 6 లక్షలు, జూరాల కింద లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుల్లోకి నీరు రాకపోవడంతో ఈ 7 లక్షల ఎకరాల్లో పంటలసాగు సందిగ్ధంలో పడింది. మిగతా చోట్ల ఖరీఫ్ ఆరంభమై నాట్లకు సిద్ధమవుతున్నా.. ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో నీళ్లు లేక రైతులు తలలు పట్టుకున్నారు. కాస్త ఆలస్యంగానైనా నీళ్లొస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు.