జాడ లేని వాన
చిత్తూరు రూరల్ మండలంలోని ఆనగల్లు గ్రామానికి చెందిన ఆర్ముగం ఎకరా విస్తీర్ణంలో వేరుశెనగ పంట సాగుచేశాడు. నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. వాన వచ్చే వరకు పంటను కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఇంట్లో వాళ్లంతా కలసి వ్యవసాయ బోర్ల నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి పంటపై చల్లుతూ తడుపుకుంటున్నారు.
- ఎండుతున్న పంటలు
- నేలపాలైన వేరుశెనగ గింజలు
- మండుతున్న ఎండలు
- ఈసారీ తప్పని నష్టాలు, కష్టాలు
జిల్లాపై వరుణుడు శీతకన్నేశాడు. దాదాపుగా నెల రోజులుగా కనీస వర్షపాతం లేకపోవడంతో వర్షాధార పంటగా విత్తిన వేరుశెనగ విత్తు తడిలేక శక్తిని కోల్పోయి భూమిలోనే సమాధైంది. తనతో పాటు రైతు ఆశలనూ తీసుకుపోయింది. వర్షాభావంతో భూగర్భజలాలు కూడా అడుగంటిపోయి డేంజర్ జోన్‌కు చేరువైంది. సమీప భవిష్యత్తులో తాగునీటి సమస్యలనూ కళ్లకు కడుతోంది. మరోవైపు సూర్యుడు తన ఉగ్రరూపాన్ని ఇంకా ఉపసంహరించుకోకపోవడంతో ముందుగా వేసిన పంటలు మలమల మాడిపోతున్నాయి.
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజనుకు గాను రైతులు మొత్తం 2,07,502 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 1,23,981 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేశారు. ప్రధానంగా వర్షాధారంగా వేరుశెనగ పంటను రైతులు ఏటా 1,36,375 హెక్టార్లలో సాగుచేస్తారు. ఈ ఖరీఫ్ సీజనుకు జిల్లాలో ముందస్తుగా ఏప్రిల్ నెలలోనే మంచి వర్షాలు కురవడంతో రైతుల్లో పంటల సాగుపై ఆశలు రేకెత్తాయి. దీంతో వేరుశెనగ పంటను సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతూ దాదాపుగా 1.10 లక్షల హెక్టార్ల మేరకు ముందస్తుగా మే నెల మొదటి వారంలోనే దుక్కులు సిద్ధం చేశారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా జిల్లాకు 83 వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనకాయలు కేటాయించినా, ఆఖరుకు 60 వేల క్వింటాళ్లు మాత్రమే రైతులకు పంపిణీ చేసింది.
దీంతో రైతులు జిల్లా వ్యాప్తంగా 88 వేల హెక్టార్లలో వేరుశెనగను సాగు చేశారు. రైతులు వేరుశెనగను విత్తిన తరువాత దాదాపు నెల రోజులుగా జిల్లాలో కనీస వర్షపాతం లేకపోవడంతో వేరుశెనగ పంట మొలక దశలోనే ఎండిపోయింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి విత్తిన విత్తనాలు నేలపాలయ్యాయి. ఇదిలా ఉండగా తూర్పు మండలాల్లో వర్షాలు ఓ మోస్తరుగా కురవడంతో రైతులు వరిపంటను 15,365 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 4,343 హెక్టార్లలో సాగు చేశారు. పడమటి మండలాల్లోని రైతులు టమోటా పంటను 15 వేల హెక్టార్లకు దాదాపు 7 వేల హెక్టార్లలో సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులు చెరకు పంటను 27,705 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 20,101 హెక్టార్లలో సాగు చేశారు. అయితే ప్రస్తుతం నెల రోజులుగా ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటిపోయి సాగునీరు అందక వేసిన పంటలు దాదాపుగా ఎండిపోయాయి. ఏటికేడాది వివిధ కారణాలతో పంటల ద్వారా నష్టాలను చవిచూసే రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ సాగు కూడా అదే కష్టనష్టాలను మిగుల్చుతోంది.
మండుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు
గత నెలరోజులుగా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే ప్రజలు కనీసం ఇళ్లు వదలి రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. సాయంత్రం 5 గంటలు దాటినా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం ఎండ తీవ్రత 33 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మేర చూపెడుతోంది. వర్షాభావంతో సాగునీరు అందక ఎండుతున్న పంటలకు ఎండలు కూడా తోడవడంతో కనీసం పశువులకు గడ్డి కూడా దొరకడం లేదు.