వానలు జోరుగా కురుస్తున్నాయి.
- సాగుకు అనుకూలంగా వానలు
- అంచనా కంటే నాలుగు రెట్లు అధికంగా సేద్యం
- మంచి వర్షాలతో ఆశాజనకంగా ఖరీఫ్ సీజను
- భారీగా పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వానలు జోరుగా కురుస్తున్నాయి. వారం రోజులుగా తెరిపి ఇవ్వడం లేదు. సగటున రోజు గంటపాటు వర్షం కురుస్తూనే ఉంది. ఇలా జోరు వానలతో ఖరీఫ్ బాగా సాగవుతోంది. అదనులో వానలు కురుస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. గత పదేళ్లలో ఖరీఫ్ సీజను ఆరంభంలో ఇలాంటి వర్షాలు ఎప్పుడు రాలేదని చెబుతున్నారు. అన్ని పంటల విత్తనాలు వేస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంట పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పప్పుధాన్యాల సాగు ఇలాగే ఉంది. ప్రతిసారి జూలై ఆఖరులో ఉండే సాగు విస్తీర్ణం ఈసారి ఇప్పటికే పూర్తయ్యిందని వ్యవసాయ శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఐదారేళ్లలోనే అధిక విస్తీర్ణం
ఖరీఫ్‌లో సీజనులో జిల్లాలో సగటున 12.64 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. జూన్ 18 వరకు 1.03 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అంచనా వేసింది. అదనులో వర్షాలు కురవడంతో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 4.03 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటల విత్తనాలు వేశారు. వ్యవసాయ అంచనాల కంటే ఇదినాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ఐదారేళ్ల ఖరీఫ్ సీజను పరిశీలిస్తే జూన్ 18 నాటికే ఇంత ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు ఈ ఏడాదే మొదటిసారి. అధిక వర్షపాతం నమోదైన 2013 ఖరీఫ్‌లోనూ ఇప్పటితో పోల్చితే తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి.