ఎండుతున్న పంట
- వర్షం కోసం రైతుల ఎదురు చూపు
- బళ్లారి జిల్లాలో ముఖం చాటేసిన వరుణుడు
- 23 శాతం భూముల్లో పంట సాగు
- ఆయకట్టు, నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో పంట సాగు అంతంత మాత్రమే
- అన్నదాతల బతుకు అగమ్యగోచరం
సాక్షి, బళ్లారి : ఈఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరుణుడు ఆశలు రేకెత్తించాడు. ప్రారంభంలో వర్షాలు బాగా కురవడంతో బళ్లారి జిల్లా వ్యాప్తంగా రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనులు చేపట్టారు. విత్తేందుకు, వరినాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో దాదాపు నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బళ్లారి జిల్లాలో తుంగభద్ర ఆయకట్టు కూడా విస్తారంగా ఉంది. బళ్లారి, కంప్లి, హొస్పేట, సిరుగుప్ప తాలూకాలలో లక్షలాది ఎకరాల్లో తుంగభద్ర ఆయకట్టు సాగు అవుతోంది. మిగిలిన హడగలి, హగరిబొమ్మనహళ్లి, సండూరు, కూడ్లిగి నియోజకవర్గాల్లో వర్షాధారిత భూములే అధికంగా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉంది. ఇప్పటి వరకు 1.50 లక్షల ఎకరాలలో మాత్రమే వివిధ పంటలు సాగు చేశారు.
వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు విత్తడానికి అదును దాటిపోతోందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 77 శాతం పైగా రైతులు పంటలు సాగు చేయలేదు. ఎటు చూసినా బీడు భూములే కనిపిస్తున్నాయి. పచ్చదనంతో కళకళలాడాల్సిన భూములు నై బారుతున్నాయి. వేరుశనగ, జొన్న, సజ్జ, సూర్యకాంతి, రాగి తదితర పంటలు సాగు చేసేందుకు అనువైన సమయం కావడంతో రైతులు ప్రతి రోజు ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం దిగాలుగా ఎదురు చూస్తున్నారు. వర్షం వచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించక పోవడంతో రైతులు జిల్లాలో పలు గ్రామాల్లో వర్షం కోసం ప్రత్యేక పూజలు, భజనలు, హోమాలు చేస్తున్నారు. సకాలంలో వరుణుడు కనికరిస్తేనే జిల్లాలో మెట్ట భూముల్లో ఖరీఫ్ పంటలు సాగు చేసేందుకు వీలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బళ్లారి జిల్లాతో పాటు తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని కొప్పళ, రాయచూరు జిల్లాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
ఖరీఫ్‌కు దుక్కిలు దున్ని పంటలు వేసుకునేందుకు సిద్ధంగా సమయంలో వరుణుడు కనికరించకపోవడంతో రైతులు ఎటు పాలు పోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జూలై నెలాఖరులోపు ఖరీఫ్ పంట సాగు చేసుకునేందుకు మంచి సమయమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్న తరుణంలో మెట్ట ప్రాంతంలో సాగు చేసే రైతాంగం ప్రతి రోజు ఆకాశం వైపు చూస్తూ కాలం గడుపుతున్నారు. అక్కడక్కడ పంటలు సాగు చేసినా తగిన వర్షాలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తక పోవడం, మొలకెత్తినా వాడిపోవడం జరిగింది.