ఆశలు ఆవిరి
ధాతు కరువు తరువాత 2012లో అత్యంత దుర్భర పరిస్థితులు చవిచూసిన జనం ప్రస్తుతం మరోమారు అంతటి విపత్కర పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నారు. పంటలతో కళకళలాడాల్సిన ఖరీఫ్ సీజన్‌లో ఎటుచూసినా బీడు భూములు దర్శనమిస్తున్నాయి. ఓ వైపు పశువులకు గ్రాసం కొరత.. మరోవైపు తాగు నీటి కొరత.. వెరసి రైతులు తీవ్ర ఇక్కట్లు అనుభవిస్తున్నారు. గత్యంతరం లేక కన్నబిడ్డలాంటి పశువులను కబేలాకు తరలిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా కురిసిన చోటే వర్షం కురుస్తోంది. అది కూడ అరకొర పదునే కావడంతో ఎటూ పాలుపోని రైతన్న విత్తనం సిద్ధం చేసుకుని ఆకాశం కేసి చూస్తూండిపోయాడు.
- ఎటుచూసినా బీడు భూములే
- కుదేలైన ఖరీఫ్ పంటల సాగు
- గ్రాసం, నీటి కొరతతో పశువులను తెగనమ్ముకుంటున్న రైతులు
- ఇక స్వల్ప కాలిక పంటలే శరణ్యం
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ప్రధాన పంటలైన వేరుశనగ, పత్తి, వరి పంటలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పంటల సాగుకు అదును దాటుతున్నా వర్షాభావ పరిస్థితులే కొనసాగుతుండడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 1.65 లక్షల హెక్టార్లు సాగు చేయాల్సి ఉండగా కేవలం 25 వేల హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. 15 శాతం భూములు మాత్రమే పంటకు నోచుకోగా అవి కూడ వర్షం లేకపోవడంతో వాడు ముఖం పట్టాయి. ఈ పరిస్థితిలో జిల్లా వ్యవసాయశాఖాధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. దీనికి గాను 10,391 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవసరం అవుతాయని నివేదికలు రూపొందించారు. ఆ మేరకు అనుమతుల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపించారు.
కళావిహీనంగా పల్లెలు....
పంట పొలాలు, పాడి సంపదతో సుఖ సంతోషాలతో పల్లె ప్రజానీకం జీవించేవారు. అలాంటి పల్లెలు కళావిహీనంగా మారాయి. జీవం కోల్పోయిన మనిషి దర్శనమిచ్చినట్లుగా పల్లెలు కన్పిస్తున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న పశు సంపదను పల్లె జనం తెగనమ్ముకుంటున్నారు. కళ్లు ముందు పస్తులు ఉండబెట్టలేక, బక్కచిక్కిన పశువులను చూడలేక దిగాలు చెందిన గ్రామీణులు వాటిని కబేళాకు తరలిస్తున్నారు. తామైనా కొంత కాలం జీవించాలనే దృక్పథంతో పశుసంతతని అమ్ముకుంటున్నారు. పంటలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న పాడిపశులకు మేత లేకపోవడం మరో భారంగా భావిస్తున్నారు. వెరసి కళకళలాడే పల్లెలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి.
85 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగు
వరుణుడు కరుణిస్తే జిల్లాలో 85 వేల హెక్టార్లులో ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే సంకల్పంతో రైతులున్నారు. ప్రధాన పంటలకు కాలం, అదును దాటిపోవడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం తప్ప జిల్లాలోని రైతులకు మరో మార్గం లేదు. ఈ నెలలో వర్షం కురిస్తే మినుము, పెసర,హైబ్రిడ్ మొక్కజొన్న, సజ్జ, జొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 67.0 మిల్లీ మీటర్లు కాగా 72.4 మిల్లీ మీటర్ల వర్షం (కొన్ని ప్రాంతాల్లో) కురిసింది. జూలై నెలలో సాధారణ వర్షం 97.2 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా 19.4 మిల్లీ మీటర్ల వర్షపాతం మించి నమోదు కాలేదు.
జిల్లాలో ప్రధాన పంటలైన వేరుశనగ, పత్తి, వరి పంటలు కలిపి 1,28,372 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా అరకొర వర్షంతో కేవలం 1808 హెక్టార్లకే పంటలు పరిమితమయ్యాయి. పప్పుధాన్యపు పంటలు 12,221 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా అవి కూడా 10981 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 1,60,635 హెక్టార్ల సాధారణ సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 25,743 హెక్టార్లలో మాత్రమే సాగుకాగా, మిగిలిన 1,28,372 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వర్షాభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించిన అధికారులు అవసరమైన విత్తనాలను కోసం రాష్ట్ర శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాకు అవసరమైన విత్తనాలను తెప్పించే పనిలో నిమగ్నమయ్యారు. మరో మూడు రోజుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు మండల కేంద్రాలకు చేరుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
- ప్రత్యేక కథనాలు సెంటర్‌స్ప్రెడ్‌లో