ఈ నెల ఒకటి నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. సీజన్‌లో తొలిసారిగా తొలకర్లు పలకరించాయి.
- పలకరించిన తొలకర్లు
- ఖరీఫ్ సేద్యానికి రైతుల సమాయత్తం
-రెండు, మూడురోజుల్లో ‘నైరుతి’ రాక
అనంతపురం అగ్రికల్చర్ : ఈ నెల ఒకటి నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. సీజన్‌లో తొలిసారిగా తొలకర్లు పలకరించాయి. దీంతో అన్నదాత ఇంట ఆశలు మొలకెత్తుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి 50 మండలాల పరిధిలో 8.6 మిల్లీమీటర్ల (మి.మీ) సగటు వర్షపాతం నమోదైంది. ‘నేనొస్తున్నా..’ అంటూ కేరళ నుంచి నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా మంగళ లేదా బుధవారం జిల్లాలోకి ప్రవేశించే అవకాశముంది. సకాలంలో విస్తారంగా వర్షాలు కురిస్తే జిల్లాలో ఈ సారి 8.01 లక్షల హెక్టార్లలో పంటలు వేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారికంగా అంచనా వేసింది. ఇందులో ప్రధానపంట వేరుశనగ 6.04 లక్షల హెక్టార్లుగా పేర్కొన్నారు.
బుక్కరాయసముద్రంలో భారీ వర్షం
శుక్రవారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. బుక్కరాయసముద్రం మండలంలో 68.2 మి.మీ భారీ వర్షం పడింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. అలాగే నార్పలలో 47.2 మి.మీ, తాడిమర్రి 38.7, గార్లదిన్నె 34.1, బత్తలపల్లి 29.1, తనకల్లు 28.6, ధర్మవరం 28.4, పెద్దవడుగూరు 23.2, శింగనమల 22.4, ముదిగుబ్బ 20.9, సోమందేపల్లి 15.3, కూడేరు 13.7, బుక్కపట్నం 13.6, ఉరవకొండ 11, పుట్లూరు 10.8, యల్లనూరులో 10.6 మి.మీ మేర వర్షం కురిసింది. ఇంకా గుత్తి, పెద్దపప్పూరు, కూడేరు, అనంతపురం, రాప్తాడు, కనగానపల్లి, ఓడీ చెరువు, నల్లమాడ, పుట్టపర్తి, కొత్తచెరువు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం పడింది.
మడకశిర, హిందూపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ డివిజన్లు మినహా తక్కిన డివిజన్ల పరిధిలో వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా.. ప్రస్తుతానికి 10.7 మి.మీ నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాలను బాగా దుక్కులు చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ డి.సంపత్‌కుమార్, డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి, డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ రైతులకు సూచించారు. సమయం ఇంకా ఉన్నందున వేరుశనగ పంట ఇప్పుడే వేసుకోవద్దని చెబుతున్నారు. ఈ నెలాఖరు నుంచి జూలై చివరి వరకు వేరుశనగ సాగుకు మంచి అనుకూలమని తెలిపారు.