వానమ్మా.. నీ జాడేదమ్మా!
కర్షకుడితో వర్షం దోబుచులాడుతోంది. ఆకాశంలో కమ్ముకున్న కారుమబ్బులు.. చివరకు చెదురుమదురు జల్లులతో సరిపెడుతున్నాయి.. ఇలా రెండు నెలలుగా రుతుపవనాలు అన్నదాతను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయి నెల దాటినా భూమి పదునెక్కే వాన కరువయింది. తొలకరి పైర్లు నీటి తడుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఖరీఫ్ సాధారణ సాగు ప్రారంభమయ్యే వేళ.. ఓవైపు పొలాలు దుక్కులు దున్నుకుంటూనే మరోవైపు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుణుడు కరుణిస్తే తప్ప.. ఖరీఫ్ సాగు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో 2.40 హెక్టార్లలో వివిధ పంటల సాగు లక్ష్యం కాగా..ఇప్పటి వరకు కేవలం మూడు శాతమే విత్తనం పడింది. 22,530 హెక్టార్లలో విత్తనం పడాల్సి ఉంటే 6,440 హెక్టార్లలో మాత్రమే సాగుకు నోచుకుంది. వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు ఎంత మందగించిందో అర్ధం చేసుకోవచ్చు. గత ఏడాది ఇదే సీజన్‌లో 37,727 హెక్టార్లతో పంటలు సాగయ్యాయి. నిరుటితో పోల్చితే ఐదోవంతు కూడా సాగుకు నోచుకోలేదు. గత నెలలో 58 ఎం.ఎం. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 88.7 ఎం.ఎం. వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో ఓమోస్తరులో వర్షం పడి రైతుల్లో ఆశలు రేకెత్తించింది. కానీ గత ఏడాది ఖరీఫ్ నుంచి జిల్లాను వర్షాభావం వెంటాడుతుండటంతో భూగర్భజలాలు అడుగంటాయి. దాదాపు వెయ్యి అడుగుల లోతుకు పడిపోయాయి. ఇటు తీరప్రాంతంతో పాటు పశ్చిమప్రాంతంలో కూడా బోర్లలో చుక్కనీరు రావడంలేదు.
కొన్ని ప్రాంతాలలో 300 అడుగుల వరకు వ్యవసాయ బోర్లు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే తీరప్రాంతంలో బోర్లు కూడా మొరాయిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చిరుజల్లులతో పదునెక్కిన భూమిలో విత్తనం విత్తితే.. రానురాను వరుణుడు ముఖం చాటేస్తే ఉన్న పంట ఎండిపోయి పెట్టుబడి కాస్తా నేలపాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఖరీఫ్ సాగుపై అన్నదాతలో అయోమయం నెలకొంది. ప్రస్తుతం సాగయిన పంటలపైనా ఆందోళన నెలకొంది.
ఎరువులు.. విత్తనాలు సిద్ధం..
ఈ ఏడాది వ్యవసాయశాఖ రెండెంకెల వృద్ధిసాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. ఖరీఫ్‌కు ముందస్తుగా కావాల్సిన ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసింది. అన్ని మండలాల్లో అందుబాటులో ఉంచింది. రాయితీ విత్తన పంపిణీలో అవకతవకలు జరగకుండా బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చింది. ఆధార్ సంఖ్య ఆధారంగా విత్తన పంపిణీ చేస్తున్నారు. 4,500 టన్నుల సూక్ష్మపోషకాలను అందుబాటులో ఉంచారు. జింక్ 818 టన్నులు, బోరాన్ 42 టన్నులు, జిప్సం 3,900 టన్నులు సరఫరా చేయనున్నారు. కొత్తగా మెగ్నీషియం, ఇనుము సూక్ష్మధాతు లోపాల ఎరువులు కూడా అందజేస్తున్నారు. 27,250 క్వింటాళ్ల విత్తనాలు సరఫరాకు సిద్ధంగా ఉన్నాయి.
33 శాతం రాయితీపై సరఫరా..
జనుము 3, 500 క్వింటాళ్లు, దహించు విత్తనాలు 2,500 క్వింటాళ్లు, పిల్లిపెసర 3,000 క్వింటాళ్లు ఇప్పటికే రైతులకు సరఫరా చేశారు. ఇంకా వేరుశనగ 4,000 క్వింటాళ్ళు, నువ్వులు 500 క్వింటాళ్ళు, కందులు 4, 200 క్వింటాళ్లు, మినుములు 3, 800 క్వింటాళ్లు, పచ్చ పెసర 2, 100 క్వింటాళ్లు, జొన్నలు 150 క్వింటాళ్లు, సజ్జలు 500 క్వింటాళ్లు, మొక్కజొన్న 300 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. జీలుగ విత్తనాలు కిలో రూ.40 కాగా రైతులు రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. జనుము విత్తనాలు కిలో రూ.55.90 కాగా రైతులు రూ.13.95 చెల్లించాల్సి ఉంది. పిల్లిపెసర కిలో రూ.114 కాగా రైతులు రూ.28.50 చెల్లిస్తే సరిపోతుంది. భూసార పరీక్షల ఆధారంగా ప్రతి రైతుకి 50 శాతం రాయితీపై గరిష్టంగా ఐదు ఎకరాల వరకు సూక్ష్మ పోషకాలను అందజేస్తున్నారు. అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందగా తయారైంది అన్నదాత పరిస్థితి. నైరుతి రుతుపవనాల మందగమనం సాగుకు ప్రతిబంధకంగా మారింది.