చినుకమ్మ కినుక..!
♦ ఖరీఫ్ మొదలై పక్షం రోజులవుతున్నా జాడలేని తొలకరి
♦ ఇప్పటికే 46 శాతం విత్తనాలు విక్రయించిన వ్యవసాయశాఖ
♦ గోదాముల్లో 50 శాతం ఖాళీ అయిన ఎరువుల నిల్వలు
♦ వర్షం కోసం అన్నదాతల ఎదురుచూపులు
ముందస్తు వానలు జాడలేకుండా పోయాయి. నడివేసవిలో అకాలవర్షాల రాకతో ఖరీఫ్ సీజన్ కలిసి వస్తుందని భావించిన అన్నదాతలు.. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో నిరాశ చెందుతున్నారు. రుతుపవనాల రాక ఆలస్యమవుతుండడంతో సాగుకోసం ముడిసరుకును సిద్ధం చేసుకున్న కష్టజీవులు ఆకాశంవైపు దీనంగా చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై పక్షం రోజులు కావస్తున్నా తొలకరి వానలు రైతును పలకరించలేదు. మూడేళ్లుగా వరుసగా అనావృష్టి ప్రభావంతో అతలాకుతలమైన వ్యవసాయ రంగం తాజా ఖరీఫ్‌పై గంపెడాశలు పెట్టుకుంది. కానీ జూన్ రెండోవారం ముగిసినా వాన జాడ లేకపోవడం కలవరపరుస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,17,303 హెక్టార్లు. అయితే సీజన్ ఆశాజనకంగా ఉంటుందని ముందస్తు సంకేతాలుండడంతో వ్యవసాయ శాఖ 2,34,962 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఈమేరకు ఎరువు లు, విత్తనాలు సిద్ధంచేసింది. మండలాల వారీ గా ప్రణాళిక తయారు చేసిన ఆ శాఖ.. నిల్వల్ని మండల కేంద్రాల్లోని గోదాములకు తరలించింది. జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాల ద్వారా విత్తనాలు, 12 కేంద్రాల ద్వారా ఎరువుల్ని రైతులకు పంపిణీ చేసేందుకు ఉపక్రమించింది. జూన్ మాసంలో జిల్లాలో 121 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1.8సెం.మీ. మాత్రమే కురిసింది.
గోదాములు సగం ఖాళీ
వరుస కరువుతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈసారీ నష్టాల నుంచి గట్టెక్కాలని నిర్ణయించుకుని సాగుకు సిద్ధమయ్యారు. అధికారగణం.. శాస్త్రవేత్తలు సైతం సంతృప్తికరమైన వానలుంటాయని సూచనలిస్తుండడంతో రైతులు ముందస్తుగా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. జూన్, జులై నెలల్లో అవసరమైన ఎరువులు, విత్తనాల కోటాను వ్యవసాయ శాఖ గోదాముల్లో నిల్వ చేయగా.. అందులో సగం కోటా ఇప్పటికే ఖాళీ అయినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
2016-17 వార్షికంలో జిల్లాలో 9 రకాల పంటలకు సంబంధించి 45,950 క్వింటాళ్ల విత్తనాలను విక్రయించేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక తయారు చేసింది. ఇందులో భాగంగా 10,743 క్వింటాళ్ల విత్తనాలను ఈనెల మొదటివారంలో క్షేత్రస్థాయిలో నిల్వలు పెట్టింది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 4,677 క్వింటాళ్ల విత్తనాలు విక్రయించారు. మిగతా 6,066 క్వింటాళ్ల విత్తనాల విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నాయి. అదేవిధంగా ఈ సీజన్ తొలి త్రైమాసికంలో 65వేల మెట్రిక్ టన్నుల ఎరువుల్ని రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో భాగం గా స్టాకును మండల కేంద్రాల్లో నిల్వ చేయగా.. ఇందులో 30,430 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని రైతులకు విక్రయించారు. మొత్తంగా ఖరీఫ్ సీజన్లో రైతాంగం ఉత్సాహంతో సాగుపనులకు ఉపక్రమించినప్పటికీ వానలు కురవకపోవడం తో అయోమయంలో పడింది.