సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్‌లో ఈ–పంట నమోదుకు అధికార యంత్రాంగం సోమవారం నుంచి శ్రీకారం చుడుతోంది. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులు సంయుక్తంగా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇందుకోసం గ్రామాల్లో దండోరాతోపాటు రైతు వాట్సాప్ గ్రూపులు, ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు.
పక్కాగా నమోదు
ఈ ఖరీఫ్‌లో 92.05 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 47.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలుకు ఈ క్రాప్ నమోదే ప్రామాణికం. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో అనుసంధానిస్తూ అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి ఈ పంట నమోదే ప్రామాణికం. ఈ నేపథ్యంలో చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం లేకుండా ఈ క్రాప్ నమోదు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా సన్నద్ధమైంది.
క్షేత్రస్థాయిలో పరిశీలన..
ఈ క్రాప్ నమోదు కోసం ఆధార్, 1 బీ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నెంబర్, సీసీఆర్సీ కార్డులతో రైతులు ఆర్బీకేల వద్దకు వెళితే సరిపోతుంది. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో యాప్‌ను అనుసంధానించినందున రైతు ఆధార్ నెంబర్ నమోదు చేయగానే సర్వే నంబర్లవారీగా భూముల వివరాలు తెలుస్తాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఏ సర్వే నెంబర్ పరిధిలో ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు.
ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి రోజూ కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపడతారు. యాప్‌లో నమోదైన వివరాలతో సరి పోల్చుకుని జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంటల ఫోటోలు తీసి అప్‌లోడ్ చేస్తారు. అనంతరం యాప్‌లో నమోదు చేసిన వివరాలన్నీ తెలియచేసి రైతు వేలిముద్ర (మీ పంట తెలుసుకోండి – ఈకేవైసీ) తీసుకోగానే యాప్ ద్వారానే సంబంధిత ఫోన్ నెంబర్‌కు డిజిటల్ రసీదు జారీ అవుతుంది.
ఆ తర్వాత వీఏఏ /వీహెచ్‌ఏ, వీఆర్‌వో వేలిముద్రలు వేసి సబ్మిట్ చేస్తారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే రైతుకు భౌతిక రసీదు అందజేస్తారు. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను కూడా నమోదు చేసేలా యాప్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూమి ఖాళీగా ఉంటే నో క్రాప్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వా కల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రి ల్యాండ్ అని నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. పండ్ల తోటలు, సుబాబుల్, యూకలిఫ్టస్, ఆర్చర్డ్ (అలంకరణ పుష్పాలు) తోటలను వయసువారీగా నమోదు చేస్తారు.
ఈ ఆప్షన్‌లో వివరాలు..
సీసీఆర్సీ కార్డులు లేని సాగుదారులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కానివారు ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుంటే పర్యవేక్షణాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకసారి వివరాలు అప్‌లోడ్ చేసిన తర్వాత మార్పు (ఎడిట్) చేసే అవకాశం వీఏఏ/వీహెచ్‌ఏలకు కల్పించలేదు. ఎంఏవోలు/ ఎంఆర్‌వోలు 10 శాతం, ఏడీఏ/ఏడీహెచ్‌లు 5 శాతం, డీఏవో/డీహెచ్‌ఒలు మూడు శాతం, జాయింట్ కలెక్టర్లు రెండు శాతం, కలెక్టర్లు ఒక శాతం చొప్పున విధిగా ఈ పంట నమోదును ర్యాండమ్‌గా తనిఖీ చేయాలి.
ఈసారి పబ్లిక్ సెర్చ్ ఆప్షన్ కూడా కల్పించారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ఆ వివరాలను ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ పంట నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అనంతరం సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేల్లో పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment