ఖరీఫ్‌లో సిరుల పంట | 80 lakh metric tonnes of grain produce in kharif season At Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌లో సిరుల పంట

Published Sun, Jan 23 2022 3:09 AM | Last Updated on Sun, Jan 23 2022 8:41 AM

80 lakh metric tonnes of grain produce in kharif season At Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 80.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుంది. ఇది గత ఖరీఫ్‌ కన్నా 12.86 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికం. భారీ వర్షాలవల్ల  ఈసారి ఉభయ గోదావరి, కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరి పంట దెబ్బతిన్నప్పటికీ దిగుబడి కూడా మెరుగ్గా ఉంది. వ్యవసాయ రంగంపై రెండో ముందస్తు అంచనాలతో కూడిన వాస్తవ పత్రాన్ని ఆ శాఖ ప్రత్యేక సీఎస్‌ పూనం మాలకొండయ్య శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సమర్పించారు. ఆ వివరాలు..

► ఈ ఖరీఫ్‌లో 40.29 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేయగా 80.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. అదే గత ఖరీఫ్‌లో 39.86 లక్షల హెక్టార్లలో వరి పంట సాగుచేయగా 67.60 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం ఉత్పత్తి అయినట్లు తుది అంచనాలు స్పష్టంచేశాయి. 
► గత ఖరీఫ్‌లో ఎకరానికి సగటున 1,700 కేజీల ధాన్యం దిగుబడి కాగా.. ఈ ఖరీఫ్‌లో 1,997 కేజీలు రానుందని అంచనా వేశారు. 
► మొక్కజొన్న ఉత్పత్తి కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి పెరిగింది. గత ఏడాది 4.34 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా ఈ ఖరీఫ్‌లో 5.26 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయింది. 
► కందులు కూడా ఈ ఖరీఫ్‌లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి. ఇవి ఈసారి 1.19 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి కాగా గత ఖరీఫ్‌లో కేవలం 80 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చాయి.
► ఇక గత ఖరీఫ్‌లో మొత్తం పప్పు ధాన్యాలు 1.15 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయితే.. ఇప్పుడు 1.60 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చాయి. 
► గత ఖరీఫ్‌తో పోలిస్తే మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ ఖరీఫ్‌లో అదనంగా 13.96 లక్షల మెట్రిక్‌ టన్నులు పెరిగింది. గత ఖరీఫ్‌లో 74.15 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి కాగా ఈ ఖరీఫ్‌లో 88.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కానున్నాయి. 

రూ.172 కోట్లతో సబ్సిడీ విత్తనాలు
గడచిన ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.172 కోట్ల సబ్సిడీతో 11.80 లక్షల మంది రైతులకు 6.91 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసింది. అలాగే.. రైతుభరోసా కేంద్రాల ద్వారా 1.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement