Grain production
-
ఏపీలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువే
సాక్షి, అమరావతి: ధాన్యం ఉత్పత్తి వ్యయం పంజాబ్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే తక్కువగా ఉంది. దేశ సగటుతో పోల్చినా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగానే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడించింది. పంజాబ్‌లో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం రూ.808 ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,061గా నమోదైంది. దేశంలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి సగటు వ్యయం రూ.1,360 ఉన్నట్టు తెలిపింది. వ్యవసాయ భూమి లీజుతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, కుటుంబ సభ్యుల శ్రమ, పశువుల శ్రమ, ఇరిగేషన్ చార్జీలు, పెట్టుబడి వ్యయం, వడ్డీలను కలిపి రాష్ట్రాల వారీగా 2022–23లో ధాన్యం క్వింటాల్ ఉత్పత్తి వ్యయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ చర్యలే కారణం రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి సేద్యానికి అవసరమైన అన్నిరకాల ఇన్‌పుట్స్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీపై విత్తనాలను అందించడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతింటే ఆ సీజన్ దాటకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తోంది. కూలీలకు బదులుగా వ్యవసాయ పరికరాలను వినియోగించడాన్ని ప్రోత్సహించడంతో సేద్యం వ్యయం తగ్గుతోంది. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా 50 సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. యంత్ర పరికరాల వినియోగం కారణంగా ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తుండటం, మెరుగైన వ్యవసాయ పద్ధతుల కారణంగా ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటోంది. దేశంలో ఎక్కువగా ధాన్యం పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండగా మహారాష్ట్రలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం అత్యధికంగా ఉంది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంది. వరి పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం మిగతా రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంది. -
ఖరీఫ్‌లో సిరుల పంట
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 80.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుంది. ఇది గత ఖరీఫ్ కన్నా 12.86 లక్షల మెట్రిక్ టన్నులు అధికం. భారీ వర్షాలవల్ల ఈసారి ఉభయ గోదావరి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరి పంట దెబ్బతిన్నప్పటికీ దిగుబడి కూడా మెరుగ్గా ఉంది. వ్యవసాయ రంగంపై రెండో ముందస్తు అంచనాలతో కూడిన వాస్తవ పత్రాన్ని ఆ శాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సమర్పించారు. ఆ వివరాలు.. ► ఈ ఖరీఫ్‌లో 40.29 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేయగా 80.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. అదే గత ఖరీఫ్‌లో 39.86 లక్షల హెక్టార్లలో వరి పంట సాగుచేయగా 67.60 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అయినట్లు తుది అంచనాలు స్పష్టంచేశాయి. ► గత ఖరీఫ్‌లో ఎకరానికి సగటున 1,700 కేజీల ధాన్యం దిగుబడి కాగా.. ఈ ఖరీఫ్‌లో 1,997 కేజీలు రానుందని అంచనా వేశారు. ► మొక్కజొన్న ఉత్పత్తి కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి పెరిగింది. గత ఏడాది 4.34 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈ ఖరీఫ్‌లో 5.26 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. ► కందులు కూడా ఈ ఖరీఫ్‌లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి. ఇవి ఈసారి 1.19 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా గత ఖరీఫ్‌లో కేవలం 80 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయి. ► ఇక గత ఖరీఫ్‌లో మొత్తం పప్పు ధాన్యాలు 1.15 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే.. ఇప్పుడు 1.60 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయి. ► గత ఖరీఫ్‌తో పోలిస్తే మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ ఖరీఫ్‌లో అదనంగా 13.96 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. గత ఖరీఫ్‌లో 74.15 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా ఈ ఖరీఫ్‌లో 88.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కానున్నాయి. రూ.172 కోట్లతో సబ్సిడీ విత్తనాలు గడచిన ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.172 కోట్ల సబ్సిడీతో 11.80 లక్షల మంది రైతులకు 6.91 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసింది. అలాగే.. రైతుభరోసా కేంద్రాల ద్వారా 1.29 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసింది. -
సాగు లక్ష్యం 24.03 లక్షల హెక్టార్లు
సాక్షి, అమరావతి: అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది. 24.03 లక్షల హెక్టార్లలో ఈసారి పలు రకాల పంటల్ని సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది కన్నా 33 వేల హెక్టార్లు ఎక్కువ. రబీకి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. రబీకి సంబంధించిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. మేలైన ఎరువులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల నుంచే ఆర్డరు చేసుకునేలా వ్యవసాయ శాఖ పెద్దఎత్తున రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. రబీ సాగు ప్రణాళిక ఇలా.. రబీ సీజన్ అక్టోబర్ నుంచి అధికారికంగా మొదలైంది. ఈ సీజన్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ఈ సీజన్లో ప్రధానంగా పండించే పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలున్నాయి. 8.05 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయించడం ద్వారా 57.12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. 4.03 లక్షల హెక్టార్లలో శనగ, 3.85 లక్షల హెక్టార్లలో మినుము, 1.36 లక్షల హెక్టార్లలో పెసర, 70 వేల హెక్టార్లలో పొగాకు సాగు విస్తీర్ణంగా ఉంది. ఆర్బీకేల వద్ద సబ్సిడీ విత్తనాలు గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచే మేలైన విత్తనాలు, ఎరువులు తీసుకుంటే భరోసా ఉంటుందని ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాయి. ముందుగా పరీక్షించిన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు సరఫరా చేస్తుంది. రబీలో రైతులకు సరఫరా చేసేందుకు విత్తనాభివృద్ధి సంస్థ 4,08,151 క్వింటాళ్ల వివిధ రకాల వంగడాలను సిద్ధం చేసింది. ఇందులో చిరుధాన్యాలైన కొర్ర, ఊద, అరిక, సామ, ఆండ్రు కొర్రలు వంటివి కూడా ఉన్నాయి. ఎరువుల పరిస్థితి రబీ సీజన్‌కు కావాల్సిన మొత్తం ఎరువులు 25.04 లక్షల టన్నులు ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏయే నెలలో ఎంతెంత అవసరం ఉంటుందో అంచనా వేసి ఆ మేరకు సిద్ధం చేసింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు 10 లక్షల టన్నుల యూరియా, 2.50 లక్షల టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల మ్యూరేట్ పొటాషియం, 9 లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్షన్నర టన్నుల ఎస్ఎస్పీ (సింగిల్ సూపర్ ఫాస్పేట్), 4 టన్నులు ఇతర ఎరువులు కావాల్సి ఉంటాయని భావిస్తోంది. -
ధాన్య‘లక్ష్మి’!
ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ రికార్డు మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు పోటీపడుతున్న బ్యాంకులు జగిత్యాల అగ్రికల్చర్ : ధాన్యం ఉత్పత్తిలో జగిత్యాల జిల్లా రైతులు ముందుంటే..కొనుగోళ్లలో జగిత్యాల ఐకేపీ మహిళలు ముందు వరుసలో నిలిచారు. నెల రోజుల్లోనే రూ 2.74 కోట్ల కమీషన్ పొంది సరికొత్త రికార్డు సృష్టించారు. సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పోటీపడి ప్రచారం చేస్తున్నాయి. మేమిస్తామంటే.. మేమని ముందుకువస్తున్నాయి. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 144 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 121 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించారు. గ్రామాల్లోని మహిళ సంఘాలకు ముందుగానే జగిత్యాల జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ధాన్యంలో తేమ ఎలా చూడాలి. తేమ శాతం ఎంత ఉండాలి. సీరియల్‌గా ఎలా తూకం వేయాలి. తూకం వేసిన బస్తాలను ఎలా మిల్లులకు పంపించాలి. రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే విధానాన్ని ఎంపిక చేసిన సంఘాలకు అవగాహన కల్పించారు. మహిళలు కొనుగోలు చేసింది 8.57 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఖరీఫ్‌లో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలోని అన్నిగ్రామాల్లో నవంబర్ 15 నుంచి కేంద్రాలు ప్రారంభించారు. వీటి ద్వారా 23, 225 రైతులకు చెందిన 8,57,450 క్వింటాళ్లు(85745 మెట్రిక్‌టన్నులు) ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రూ. 129.46 కోట్ల డబ్బును రైతుల ఖాతాల్లో జమచేశారు. జగిత్యాల, సారంగాపూర్, రాయికల్ మండలాల్లోని పలు కేంద్రాల్లో త్వరగా తూకం వేయాలని రైతులు గొడవకు దిగినప్పటికీ సహనంతో కొనుగోళ్లను సాఫీగా జరిపారు. వీరికి కలెక్టర్ శరత్‌తోపాటు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ , మార్కెటింగ్ అధికారి తిరుపతి, వారి సిబ్బంది సంఘాలకు సహకరించారు. భారీగా కమీషన్ జిల్లా మొత్తం మీద 18 మండలాల్లోని మహిళా సంఘాలకు నెల రోజుల్లోనే రూ .2.74 కోట్ల కమీషన్ వచ్చింది. ఒక క్వింటాల్ ధాన్యం కొనుగోలుపై రూ.32 కమీషన్ ఇస్తారు. ఇలా మహిళలు కొనుగోలు చేసిన క్వింటాళ్ల ఆధారంగా లెక్కించగా రూ .2.74 కోట్ల కమీషన్ వచ్చింది. ఎలాంటి పెట్టుబడి లేకుండా నెలరోజుల్లోనే భారీగా కమీషన్ ఆర్జించిన సంఘాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు బాధ్యతను తొలిసారిగా మహిళా సంఘాలకు అప్పగించారు. అప్పటి నుంచి నేటి వరకు మహిళలే ధాన్యం కొనుగోలు బాధ్యతను నిర్వహిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. గ్రామస్థాయిలో కొనుగోలు కమిటీ గ్రామంలోని మహిళలందరు కొనుగోలు సీజన్‌కు ముందు గ్రామైక్య సంఘంగా ఏర్పడుతారు. వీరిలోంచి ఓ ఐదుగురిని ఎంపిక చేసి కొనుగోలు కమిటీకి పంపిస్తారు. చాలా గ్రామాల్లో ఒక్కసారి నియమించిన కమిటీని, ఏదైన అవకతవకలకు పాల్పడతారని మళ్లీ నియమించడం లేదు. దీంతో కొనుగోలు కమిటీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలను ఏర్పాటు చేస్తూ గ్రామంలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఈ కొనుగోలు కమిటీ సభ్యులకు రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు కూలీ చెల్లిస్తారు. ధాన్యం కొనుగోలు చేయగా వచ్చిన కమీషన్ డబ్బును ఐక్య సంఘానికి జమ చేస్తారు. ఈ డబ్బుతోనే గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గోదాంలు నిర్మించుకుంటే, మరికొన్ని చోట్ల మహిళా సంఘాల భవనాలు నిర్మించుకుంటున్నారు.