ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ రికార్డు
మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు పోటీపడుతున్న బ్యాంకులు
జగిత్యాల అగ్రికల్చర్ : ధాన్యం ఉత్పత్తిలో జగిత్యాల జిల్లా రైతులు ముందుంటే..కొనుగోళ్లలో జగిత్యాల ఐకేపీ మహిళలు ముందు వరుసలో నిలిచారు. నెల రోజుల్లోనే రూ 2.74 కోట్ల కమీషన్ పొంది సరికొత్త రికార్డు సృష్టించారు. సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పోటీపడి ప్రచారం చేస్తున్నాయి. మేమిస్తామంటే.. మేమని ముందుకువస్తున్నాయి. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 144 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 121 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించారు. గ్రామాల్లోని మహిళ సంఘాలకు ముందుగానే జగిత్యాల జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ధాన్యంలో తేమ ఎలా చూడాలి. తేమ శాతం ఎంత ఉండాలి. సీరియల్‌గా ఎలా తూకం వేయాలి. తూకం వేసిన బస్తాలను ఎలా మిల్లులకు పంపించాలి. రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే విధానాన్ని ఎంపిక చేసిన సంఘాలకు అవగాహన కల్పించారు. మహిళలు కొనుగోలు చేసింది 8.57 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఖరీఫ్‌లో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలోని అన్నిగ్రామాల్లో నవంబర్ 15 నుంచి కేంద్రాలు ప్రారంభించారు. వీటి ద్వారా 23, 225 రైతులకు చెందిన 8,57,450 క్వింటాళ్లు(85745 మెట్రిక్‌టన్నులు) ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రూ. 129.46 కోట్ల డబ్బును రైతుల ఖాతాల్లో జమచేశారు. జగిత్యాల, సారంగాపూర్, రాయికల్ మండలాల్లోని పలు కేంద్రాల్లో త్వరగా తూకం వేయాలని రైతులు గొడవకు దిగినప్పటికీ సహనంతో కొనుగోళ్లను సాఫీగా జరిపారు. వీరికి కలెక్టర్ శరత్‌తోపాటు, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ , మార్కెటింగ్ అధికారి తిరుపతి, వారి సిబ్బంది సంఘాలకు సహకరించారు.
భారీగా కమీషన్
జిల్లా మొత్తం మీద 18 మండలాల్లోని మహిళా సంఘాలకు నెల రోజుల్లోనే రూ .2.74 కోట్ల కమీషన్ వచ్చింది. ఒక క్వింటాల్ ధాన్యం కొనుగోలుపై రూ.32 కమీషన్ ఇస్తారు. ఇలా మహిళలు కొనుగోలు చేసిన క్వింటాళ్ల ఆధారంగా లెక్కించగా రూ .2.74 కోట్ల కమీషన్ వచ్చింది. ఎలాంటి పెట్టుబడి లేకుండా నెలరోజుల్లోనే భారీగా కమీషన్ ఆర్జించిన సంఘాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు బాధ్యతను తొలిసారిగా మహిళా సంఘాలకు అప్పగించారు. అప్పటి నుంచి నేటి వరకు మహిళలే ధాన్యం కొనుగోలు బాధ్యతను నిర్వహిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
గ్రామస్థాయిలో కొనుగోలు కమిటీ
గ్రామంలోని మహిళలందరు కొనుగోలు సీజన్‌కు ముందు గ్రామైక్య సంఘంగా ఏర్పడుతారు. వీరిలోంచి ఓ ఐదుగురిని ఎంపిక చేసి కొనుగోలు కమిటీకి పంపిస్తారు. చాలా గ్రామాల్లో ఒక్కసారి నియమించిన కమిటీని, ఏదైన అవకతవకలకు పాల్పడతారని మళ్లీ నియమించడం లేదు. దీంతో కొనుగోలు కమిటీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలను ఏర్పాటు చేస్తూ గ్రామంలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఈ కొనుగోలు కమిటీ సభ్యులకు రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు కూలీ చెల్లిస్తారు. ధాన్యం కొనుగోలు చేయగా వచ్చిన కమీషన్ డబ్బును ఐక్య సంఘానికి జమ చేస్తారు. ఈ డబ్బుతోనే గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గోదాంలు నిర్మించుకుంటే, మరికొన్ని చోట్ల మహిళా సంఘాల భవనాలు నిర్మించుకుంటున్నారు.
ధాన్య‘లక్ష్మి’!
Published Wed, Jan 25 2017 9:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement