కర్ణాటకలో రైతు రుణమాఫీ
సాక్షి, బెంగళూరు: నాలుగేళ్ల నుంచి కరువుతో అల్లాడుతున్న కర్ణాటక రైతుకు కాస్త ఊరట.ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌ల కోవలో కర్ణాటక ప్రభుత్వం కూడా రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సహకార బ్యాంకులు, సంఘాల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే, అది కూడా రూ.50 వేల వరకే మాఫీ వర్తించనుంది. జాతీయ, గ్రామీణ, ప్రైవేటు బ్యాంకుల్లో అప్పులు పొందిన రైతులకు రుణమాఫీ వర్తించదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో స్పష్టం చేశారు.
రుణాలను రద్దు చేయడం వల్ల ఖజానాపై రూ.8,165 కోట్ల భారం పడనుంది. ఈ నెల 20 వరకూ వ్యవసాయ రుణాలు తీసుకున్న 22,27,506 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక ఇప్పటికైనా ప్రతిపక్ష బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రంలోని ప్రైవేటు, జాతీయ, గ్రామీణ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. బీజేపీ చేస్తున్న నిరసనలు, ఒత్తిళ్లకు తలొగ్గే రుణమాఫీని ప్రకటించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు.