విశ్లేషణ
వ్యవసాయరంగ విషాదగాథలోని విలన్‌లు ప్రైవేటు వడ్డీ వ్యాపారులేనని పట్టణ ఉన్నత వర్గాల వారు సాధారణంగా తప్పు పడుతుంటారు. కానీ, సంఘటిత ద్రవ్య సంస్థలు సైతం అంతకంటే మెరుగేమీ కావనే విషయాన్ని మనం విస్మరించాం. రైతులకు ఆచరణలో 3 శాతం వడ్డీ రేటుకు (సకాలంలో తిరిగి చెల్లించేట్టయితే) పంట రుణాలు లభిస్తున్నప్పుడు, అదే పద్ధతిని రైతుకూలీలకు విస్తరింపజేయక పోవడంలోని తర్కం ఏమిటో అంతుపట్టదు. ఎంతైనా భూమిలేని రైతు కూలీలు కూడా రైతులే, వారు కూడా అవే ఆర్థిక నిబంధనలకు అర్హులు అవుతారు కదా!
ఏదైనా గ్రామంలోని పేదల్లోకెల్లా కడు పేదరాలైన ఒక మహిళ అప్పుచేసి ఓ మేకను కొని పెంచుకోవాలని అనుకుందనుకోండి. మేకను కొనడానికి ఆమెకు రూ. 5,000 కంటే కొంచెం ఎక్కువ రుణం అవసరమవుతుంది. ఏ మైక్రో–ఫైనాన్స్ సంస్థ (ఎంఎఫ్‌ఐ) వద్దకో వెళ్లమని ఆమెకు సలహా ఇస్తారు. అది ఆమెకు 26 శాతం వడ్డీకి ఆ రుణం ఇస్తుంది. వడ్డీని పదిహేను రోజులకు ఓసారి చొప్పున ఆమె చెల్లించాల్సి ఉంటుంది. ఆచరణలో ఆ రుణంపై వడ్డీ రేటు 60 శాతానికి మించిపోతుంది.
నడ్డి విరిచే వడ్డీలు పేదలకే
ఈ విషయం వైపు ఓసారి దృష్టి సారించండి. అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో నానో కార్ల ఫ్యాక్టరీని స్థాపించడానికి గుజరాత్ ప్రభుత్వం టాటాలకు రూ. 558.58 కోట్ల రుణం ఇచ్చింది. అంత భారీ రుణాన్ని 0.1 శాతం వడ్డీకి 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఇచ్చామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. మరోవిధంగా చెప్పాలంటే, ఆ భారీ అప్పు దాదాపుగా వడ్డీయే లేని దీర్ఘకాలిక రుణం. మరో ఉదాహరణ, భటిండా చమురు శుద్ధి కర్మాగారంలో పెట్టుబడిగా పెట్టడం కోసం పంజాబ్ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ దిగ్గజం లక్ష్మీనారాయణ్ మిట్టల్‌కు రూ. 1,200 కోట్ల రుణం ఇచ్చింది. ఆ రుణాన్ని కూడా 0.1 శాతం వడ్డీ రేటుకే ఇచ్చారు. అంటే, కళ్లు తిరిగేటంత ఆ పెద్ద రుణాన్ని దాదాపుగా వడ్డీ లేకుండానే ఇచ్చేశారు. గ్రామంలోని పేదల్లోకెల్ల కడు పేదరాలైన ఆ మహిళకు కూడా టాటాలకు, మిట్టల్‌కు ఇచ్చినట్టే ఆ రూ. 5,000ల అప్పును 0.1 శాతం వడ్డీకే, ఐదేళ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికపై ఇచ్చి ఉంటే... ఆమె ఏడాది తిరిగేసరికి నానో కారు నడుపుతూ ఉంటుంది.
మైక్రో ఫైనాన్స్ రక్త పిశాచులు
పంజాబ్ ఖేత్ మజ్దూర్ సంఘ్ (రైతుకూలీ సంఘం) కొన్ని వారాల క్రితం భటిండాలో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించింది. ఆ సందర్భంగా నాకు మైక్రో–ౖఫైనాన్స్ సంస్థల దారుణమైన ఈ దోపిడీ సర్వసాధారణమైనదే తప్ప, మినహాయింపు కాదని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. పంజాబ్‌లో 23 మైక్రో ఫైనాన్స్ కంపెనీలు పనిచేస్తున్నాయని, అవి 26 నుంచి 60 శాతం వరకు విపరీతమైన వడ్డీలను వసూలు చేస్తున్నాయని ఆ సంస్థ కార్యదర్శి లచ్చమన్‌సింగ్ చెప్పారు. 38.8 శాతం కుటుంబాలు ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణగ్రస్తులై ఉన్నాయని, దాదాపు అన్నే కుటుంబాలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధనిక భూస్వాముల వద్ద అప్పులు తీసుకుంటున్నాయని తెలిపారు. మరోవిధంగా చెప్పాలంటే, ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు తోడు సంఘటితమైన మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా అతి పెద్ద రక్త పిశాచులుగా మారాయి.
రుణ రక్కసి కోరల్లో రైతుకూలీ
పంజాబ్ వ్యవసాయ రంగంలోకి మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇంత లోతుగా విస్తరించిపోయాయని నేను అప్పుడే మొదటిసారి విన్నాను. వ్యవసాయరంగం కథలోని విలన్‌లుగా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను పట్టణ ఉన్నత వర్గాలు సాధారణంగా తప్పు పడుతుంటాయి. కానీ, సంఘటిత ద్రవ్య సంస్థలు సైతం అంతకంటే మెరుగేమీ కావనే విషయాన్ని మనం విస్మరించాం. రైతులకు ఆచరణలో 3 శాతం వడ్డీ రేటుకు (సకాలంలో తిరిగి చెల్లించేట్టయితే) పంట రుణాలు లభిస్తున్నప్పుడు, అదే పద్ధతిని రైతు కూలీలకు విస్తరింపజేయక పోవడంలోని తర్కం ఏమిటో నాకు అంతుపట్టదు. ఎంతైనా భూమిలేని రైతు కూలీలు కూడా రైతులే, వారికి కూడా అదే ఆర్థిక నిబంధనలకు అర్హులు.
రైతు కూలీని నేను కనిపించని మొహం అంటాను ఎందుకు? కొన్ని నెలల క్రితం పంజాబ్ శాసన సభలో ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ వ్యవసాయ రుణ బకాయిల మాఫీకి చేపడుతున్న చర్యల వివరాలను వెల్లడించారు. ఆ సందర్భంగా, మరి రైతు కూలీల మాటేమిటి? అని ఆయన్ను ప్రశ్నించారు. ‘‘రైతుకూలీల ఆర్థిక పరిస్థితుల గురించిన విశ్వసనీయ సమాచారం మా వద్ద లేదు’’అని ఆయన సమాధానం ఇచ్చారు. దిగ్భ్రాంతికరం, కాదూ? 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఇప్పటికి కూడా పేదల్లోకెల్లా పేదలైన రైతుకూలీలు ఎలాంటి దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నారో మనకు తెలియదు.
రుణ విషవలయంలో రైతుకూలీలు
పంజాబ్ ఖేత్ మజ్దూర్ సంఘ్ ఈ సవాలును స్వీకరించింది. అది అత్యంత వివరమైన సర్వేను నిర్వహించింది. పంజాబ్‌లోని ఆరు జిల్లాలలో విస్తరించి ఉన్న 13 గ్రామాలను తీసుకుని అది ఆ పనిని వృత్తి నిపుణులు చేసే పద్ధతిలో చేసిందనే విషయాన్ని తప్పక చెప్పి తీరాలి. ఈ సర్వే ప్రాథమిక ఫలితాలను ఆ భటిండా సభలో వెల్లడించారు. సర్వే చేసిన 1,618 రైతుకూలీ కుటుంబాలలో 84 శాతం రుణగ్రస్తులుగా జీవిస్తున్నారు. వారిలో ఒక్కో కుటుంబానికి సగటున ఉన్న రుణం రూ. 91,437. ఈ రుణంలో అత్యధిక భాగం, దాదాపు 25 శాతం ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్నది. అలా అని ఊహాత్మకమైన తప్పుడు యోచనతో ఉండకండి. ఆ సర్వే ఇంటి నిర్మాణానికి అన్నప్పుడల్లా, దాని అసలు అర్థం తల దాచుకోవడానికి ఇంత నీడను కల్పించడమనే ప్రాథమిక లక్ష్యంతో ఓ గదిని వేసుకోవడం అని మాత్రమే.
దాచేస్తే దాగని దైన్యం
ఇంచుమించుగా 35 శాతం ఇళ్లు ఒక్క గదివి, 79 శాతం ఇళ్లు వరండా లేనివి. సర్వేకు ఎంచుకున్న ఇళ్లలో 38 శాతం స్నానాల గది విడిగా ఉన్నవి, మరో 33 శాతం తాత్కాలికమైన స్నానాల గది ఏర్పాటు ఉన్నవి. మిగతా ఇళ్ల విషయంలో ఆ ఒక్క గదిలోనే ఓ మూలను ఆడవాళ్లు విలాసవంతమైన స్నానాల గదిగా వాడుకుంటారు. 67 శాతం ఇళ్లు తాగు నీరుగా పంపు నీళ్లను ఉపయోగిస్తాయి. ఏ ఒక్క ఇంట్లోనూ మంచి నీటి కోసం ఆర్‌ఓ సిస్టమ్ లేదు. కనీసం 31 శాతం ఇళ్లకు మరుగుదొడ్లు లేవు.
ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుండగా బయటపడ్డ కళ్లు చెదిరే వాస్తవం... 72 శాతం ఇళ్లకు వంటగదులు లేవు అని తెలిసివచ్చింది. ఒక శ్రామిక కుటుంబానికి మొట్టమొదట అవసరమైనది వంట గదో లేక మరుగుదొడ్డో నాకు తెలియదు. ఏది ఏమైనా ఆ రెండూ లేకపోవడం రైతుకూలీ కుటుంబాలలో ఎంతటి దుర్భర ఆర్థికపరిస్థితి లోతుగా వేళ్లూనుకుపోయి ఉన్నదో తెలుపుతుంది. రైతుకూలీ కుటుంబాలు 15 లక్షల వరకు ఉంటాయి. అంటే వారు పంజాబ్ జనాభాలో దాదాపుగా 15%. అంటే ఇది విస్మరించాల్సినంతటి లేదా కనబడకుండా దాచేయాల్సినంతటి తక్కువ సంఖ్యేమీ కాదు.
సబ్‌కా వికాస్‌కు రాజమార్గం ఇదే
ఇది నన్ను, మొట్ట మొదట్లోనే నేను చెప్పిన ఉదాహరణకు చేరుస్తోంది. ఈ రైతుకూలీలకే గనుక పారిశ్రామికవేత్తలకు లభించే వడ్డీ రేటుకు రుణాలు ఇచ్చి ఉన్నట్టయితే వారు ఇప్పటికల్లా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుని ఉండేవారని నేను ఖాయంగా చెప్పగలను. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు లేదా ఐటీ æకంపెనీలకు ఒక రూపాయికి చదరపు మీటరు రేటున అతి ఖరీదైన భూములను కారుచౌకకు కట్టబెడుతూ, పేదలు మాత్రం తమకు అవసరమైన చిన్న మడి చెక్కకోసం మార్కెట్ ధరను చెల్లించాలనడంలో ఆర్థిక తర్కం ఏదీ ఉన్నట్టుగా అనిపించడం లేదు. రైతు కూలీలకు కూడా ఏ 25 చదరపు మీటర్ల చిన్న ప్లాట్లను ఇచ్చేట్టయితే (ఏ చిన్న బడ్డీ కొట్టో పెట్టుకోవడానికి)... ఉచిత నజరానాలను, ట్యాక్స్‌హాలీడేలను పుచ్చుకుని చక్కాపోయే స్టార్టప్ కంపెనీల కంటే చాలా మెరుగైన ఫలితాలను చూపిస్తారని నేను పందెం కాస్తాను. ఇదే నిజమైన సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అవుతుంది.
దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment