సాగు లక్ష్యం 24.03 లక్షల హెక్టార్లు | Agriculture department has finalized the plan for rabi season which has officially started | Sakshi
Sakshi News home page

సాగు లక్ష్యం 24.03 లక్షల హెక్టార్లు

Published Wed, Oct 7 2020 4:15 AM | Last Updated on Wed, Oct 7 2020 4:47 AM

Agriculture department has finalized the plan for rabi season which has officially started - Sakshi

సాక్షి, అమరావతి: అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది. 24.03 లక్షల హెక్టార్లలో ఈసారి పలు రకాల పంటల్ని సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది కన్నా 33 వేల హెక్టార్లు ఎక్కువ. రబీకి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. రబీకి సంబంధించిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. మేలైన ఎరువులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల నుంచే ఆర్డరు చేసుకునేలా వ్యవసాయ శాఖ పెద్దఎత్తున రైతుల్లో అవగాహన కల్పిస్తోంది.

రబీ సాగు ప్రణాళిక ఇలా..
రబీ సీజన్‌ అక్టోబర్‌ నుంచి అధికారికంగా మొదలైంది. ఈ సీజన్‌లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ఈ సీజన్‌లో ప్రధానంగా పండించే పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలున్నాయి. 8.05 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయించడం ద్వారా 57.12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. 4.03 లక్షల హెక్టార్లలో శనగ, 3.85 లక్షల హెక్టార్లలో మినుము, 1.36 లక్షల హెక్టార్లలో పెసర, 70 వేల హెక్టార్లలో పొగాకు సాగు విస్తీర్ణంగా ఉంది. 

ఆర్బీకేల వద్ద సబ్సిడీ విత్తనాలు 
గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచే మేలైన విత్తనాలు, ఎరువులు తీసుకుంటే భరోసా ఉంటుందని ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాయి. ముందుగా పరీక్షించిన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు సరఫరా చేస్తుంది. రబీలో రైతులకు సరఫరా చేసేందుకు విత్తనాభివృద్ధి సంస్థ 4,08,151 క్వింటాళ్ల వివిధ రకాల వంగడాలను సిద్ధం చేసింది. ఇందులో చిరుధాన్యాలైన కొర్ర, ఊద, అరిక, సామ, ఆండ్రు కొర్రలు వంటివి కూడా ఉన్నాయి.

ఎరువుల పరిస్థితి  
రబీ సీజన్‌కు కావాల్సిన మొత్తం ఎరువులు 25.04 లక్షల టన్నులు ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏయే నెలలో ఎంతెంత అవసరం ఉంటుందో అంచనా వేసి ఆ మేరకు సిద్ధం చేసింది. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు 10 లక్షల టన్నుల యూరియా, 2.50 లక్షల టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల మ్యూరేట్‌ పొటాషియం, 9 లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్షన్నర టన్నుల ఎస్‌ఎస్‌పీ (సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌), 4 టన్నులు ఇతర ఎరువులు కావాల్సి ఉంటాయని భావిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement