రుణమాఫీ ఒక మాయ
రుణమాఫీ ఒక మాయ అని తేలిపోయింది. మూడు విడతలుగా విడుదలైన జాబితాలో తప్పులు దొర్లడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆధార్ ఫీడింగ్ లోపాలతో అనేక మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. అర్హత ఉన్న రైతులను కూడా అనర్హుల జాబితాలో చేర్చడంపై మండిపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉదయగిరికి చెందిన చిన్నారెడ్డికి ఎనిమిదెకరాల పొలం ఉంది. పంటల సాగు కోసం రూ.3 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో రూ.1.50 లక్షల రుణం మాఫీ అయిందని వెబ్‌సైట్‌లో పేరుంది. అయితే రైతు సాధికారత సదస్సులో రైతులకు ఇచ్చే పత్రాల జాబితాలో చిన్నారెడ్డి పేరు కనిపించలేదు.
మండిపడ్డ రైతాంగం
రుణమాఫీ జాబితా తప్పుల తడకగా ఉండడంతో జిల్లాలో సోమవారం జరిగిన రైతు సాధికరత సదస్సులు, బ్యాంకుల వద్ద బాధితులు నిరసనలు తెలియజేశారు. రైతు సాధికారత సదస్సు ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు. ‘మాయ మాటలు చెప్పి మోసం చేయవద్దు. ముందుగా గ్రామం విడిచి వెళ్లండి’ అంటూ అధికారులపై తిరగబడ్డారు. రైతులు నిలదీయడంతో బ్యాంకర్లు, అధికారులు ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
రైతులు అధికారులను నిలదీయడంతో జిల్లాలో జరిగిన రైతు సాధికార సదస్సులు రసాభాసగా మారాయి. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో రైతురుణమాఫీ ఒకటి. ఆ హామీని అమలు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడిగా ప్రకటన చేశారు. అయితే అమలులో చంద్రబాబు నైజాన్ని ప్రదర్శించారనే ప్రచారం సాగుతోంది.
గందరగోళంగా జాబితా
రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికి మూడు జాబితాలు విడుదల చేసింది. మొదటి జాబితాలో 1.85 లక్షల మందిని తేల్చారు. వీరికి 20 శాతం చొప్పున రూ.206.22 కోట్లు జమచేస్తున్నట్లు ప్రకటించింది. ఆ నగదును రైతుల ఖాతాల్లో జమచేయలేదు. సదస్సులో రైతులకు పత్రాలు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. అదేవిధంగా మరో రెండు జాబితాలు విడుదల చేసినప్పటికీ వాటిని బ్యాంకర్లు, అధికారులు బయటపెట్టలేదు.
మొదటి జాబితానే గందరగోళంగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొదటి జాబితాలో వేలాది మంది అర్హుల పేర్లు గల్లంతయ్యాయి. అందుకు నిరసనగా మనోబోలులో జరిగిన రైతు సాధికారత సదస్సును అడ్డుకున్నారు. మాఫీ జాబితాలో కేవలం వందలాది మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయని రైతులు అధికారులను నిలదీశారు.
వెయ్యి మందికి పైగా అర్హులు ఉంటే మొక్కుబడిగా కొంతమంది పేర్లు మాత్రమే ఉండటమేంటని ప్రశ్నించారు. దీంతో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన రైతులు ఫ్లెక్సీలు, కరపత్రాలను చించివేసి తగులబెట్టారు. కుర్చీలు పడేసి, షామియానా కిందకు తోసేసి సదస్సును అడ్డుకున్నారు. అదే విధంగా వాకాడు మండలం ముట్టెంబాక గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.
అదేవిధంగా తిరుమూరు, వాకాడు, నెల్లిపూడి, దుగ్గరాజుపట్నం గ్రామాల్లోనూ రైతులు ఆందోళన చేశారు. సీతారాంపురం మండల పరిధిలో గతంలో జరిగిన ఆధార్ ఫీడింగ్‌లో పొరబాట్లు చోటు చేసుకోవడంతో రంగనాయుడుపల్లి, నెమళ్లదిన్నె, బెడుసుపల్లి, సింగారెడ్డిపల్లి, సంగసానిపల్లి, గంగవరం గ్రామాలకు చెందిన వందలాది మంది అర్హులైన రైతులను అనర్హులుగా గుర్తించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండాపురం మండలం ఎర్రబల్లి యూనియన్ బ్యాంక్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను మోసం చేశారంటూ మండిపడ్డారు.