సాగర్‌ రైతు కన్నీటి సేద్యం! | Water problems to the farmers to the Crops Cultivation | Sakshi
Sakshi News home page

సాగర్‌ రైతు కన్నీటి సేద్యం!

Published Tue, Sep 5 2017 12:47 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

సాగర్‌ రైతు కన్నీటి సేద్యం! - Sakshi

సాగర్‌ రైతు కన్నీటి సేద్యం!

500 అడుగులకు పడిపోయిన నాగార్జున సాగర్‌ నీటిమట్టం
నీటి విడుదలపై ఎడమ కాలువ ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి
- పొలాల్లో బోర్లు, బావులు తవ్విస్తూ భగీరథ యత్నం
ఇందుకోసం రూ.లక్షల్లో అప్పులు
అయినా సరిగా నీళ్లు పడక ఆందోళన
వర్షాధార పంటలు వేద్దామన్నా భయమే!
అవసరమైనప్పుడు కురవని వానలు
ఆయకట్టులో 90 శాతం భూమి బీడుగానే వదిలేసిన వైనం
నీటి వనరులున్న కొన్ని చోట్ల మాత్రం సాగు మొదలు
రైతుల దైన్యంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన
 
బొల్లం శ్రీనివాస్‌.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్‌ ఎడమకాలువ ఆయకట్టుకు కష్టకాలం వచ్చింది.. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు సరిగా లేక సాగర్‌లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. దీనికితోడు ఎగువ నుంచి వరద వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కాలువ నీటి విడుదలపై ఆశలు వదిలేసుకున్న కొందరు రైతులు తమ పొలాల్లో బోర్లు, బావులు తవ్విస్తున్నారు.. మరికొందరు రైతులు వర్షాధార పంటలు వేస్తున్నారు.

కానీ పెద్ద సంఖ్యలో రైతులు సాగుచేసే పరిస్థితి లేక భూములను బీడుగా వదిలేశారు. సాగర్‌ ఎడమ కాలువ పరిధిలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న 3.68 లక్షల ఎకరాల ఆయకట్టులో.. ఈసారి ఏకంగా 90 శాతం భూములు బీడుగానే ఉండడం ఆందోళనకరంగా మారింది. మొత్తంగా అటు సాగర్‌ నీళ్లు రాక.. ఇటు వర్షాలూ సరిగా లేక.. బోర్లు, బావులు తవ్వించినా నీళ్లు పడక.. పంటలు వేసే పరిస్థితి లేక.. వేసిన పంటలను కాపాడుకునే పరిస్థితి లేక.. బోర్లు, బావుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ ఆయకట్టు రైతుల దైన్యంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ఇదీ..
 
రైతుల భగీరథ యత్నం
సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదలపై ఆశలు సన్నగిల్లడంతో.. రైతులం తా బోర్లు వేయించడం, బావులు తవ్వించ డాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా నల్లగొండలో సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉన్న 17 మండలాలు, ఖమ్మంలోని 16 మండలాల్లో బోర్లు, బావుల సంఖ్య పెరు గుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 3,79,623 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. కానీ ఇటీవల జిల్లాలోని సాగర్‌ ఆయకట్టు పరిధిలో వ్యవసాయ విద్యుత్‌ కనె క్షన్లు పెరిగాయి. సాగర్‌ నీళ్లు వస్తే మొత్తం ఆ నీటితో.. రాకపోతే బోరు, బావుల నీటితో కొద్ది గా పంటలు సాగు చేయవచ్చని రైతులు యోచి స్తున్నారు. నీళ్లు పడకుంటే..  రెండు, మూడు బోర్లు వేస్తూ భగీరథయత్నం చేస్తున్నారు.
 
వర్షాధార పంటలు వేసినా..
సాగర్‌ నీళ్లు వస్తే వేసిన పంటలు దున్నేసి వరిసాగు చేద్దామని.. నీళ్లు రాకపోతే ఆ పంటలే ఉండిపోతాయని ఆలోచించిన ఆయకట్టు రైతులు.. వర్షాధారంగా పత్తి, పెసర, కంది, జొన్న, సజ్జ పంటలు వేశారు. బోరు, బావుల కింద 20 వేల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 6 వేల ఎకరాల్లో మెట్ట పంటలు వేశారు. ఇక నీళ్లున్న చెరువుల కింద 5 వేల ఎకరాల్లో వరి సాగైంది. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా లో సాగర్‌ ఆయకట్టు 3.68 లక్షల ఎకరాలుం టే.. కేవలం 31 వేల ఎకరాల్లో పంటలు సాగుకావడం గమనార్హం. మిగతాదంతా బీడు భూమిగానే ఉంది. ఇటీవలి వర్షాలతో రైతులు పంటల సాగు కోసం దుక్కులను దున్ని పెట్టుకున్నారు. నీళ్లు వచ్చే అవకాశముంటే వెంటనే నారు పోయాలనే యోచనతో ఉన్నారు. కానీ ఇప్పటికీ సాగర్‌లోకి నీటి చేరిక మొదలు కాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు.
 
పుష్కరకాలంలో ఇదే తొలిసారి..
పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని మహాబ లేశ్వరంలో జన్మించిన కృష్ణా నది.. నాగార్జున సాగర్‌ వరకు 1,100 కిలోమీటర్లు ప్రయాణి స్తుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నదిలో ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ.. పరీవాహక ప్రాం తంలోని ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో ఈసారి సాగర్‌ నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. వాస్తవానికి ఇంతకుముందు పలుమార్లు నాగార్జున సాగర్‌లో 540 అడుగుల వరకు నీరు తగ్గినా సాగుకు నీటిని విడుదల చేశారు. కానీ ఈసారి విడుదల చేయకపో వడానికి కారణం ఎగువ నుంచి ప్రవాహాలు లేకపోవడమే. ప్రస్తుతం నీటిమట్టం 500 అడుగులకు పడిపోయింది. గత 12 ఏళ్లలో ఈ స్థాయికి నీటిమట్టం తగ్గడం ఇదే తొలిసారి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురిసి ఆ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు పూర్తిగా నిండితేనే.. రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు, అక్కడి నుంచి నాగార్జున సాగర్‌కు నీరు వస్తుంది.
 
సాగర్‌ ఎండిపోతే ఎలా బతకాలి?
ఈ రైతు పేరు మెగావత్‌ భీంలాల్‌. అనుముల (హాలియా) మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని పంగోనికుంట తండాకు చెందిన ఈ రైతు రెండెకరాల్లో సాగు చేస్తాడు. ఈసారి సాగర్‌లో నీళ్లు తక్కువగా ఉన్నాయని, పంటలకు నీరిచ్చేది కష్టమేనని తెలుసుకుని పొలంలో బోర్లు వేయించాడు. ముందు వేసిన బోరులో చుక్క నీరు కూడా పడలేదు. తర్వాత వేసిన బోరులోనూ కొన్ని నీళ్లే పడ్డాయి. బోరు వేయించేందుకు కొత్తపల్లిలోని నాగార్జున గ్రామీణ బ్యాంకు నుంచి రూ.70 వేలు అప్పు తీసుకున్నాడు. అందులోంచి ఈ రెండు బోర్లు వేయించేందుకే రూ.50 వేలకుపైగా ఖర్చయ్యాయి.

మిగిలింది రూ.20 వేలు. నీళ్లు పడిన బోరులో మోటార్‌ బిగించడం, పైప్‌లైన్, కరెంటు పనుల కోసం అవి సరిపోని పరిస్థితిలో.. మరో రూ. 20 వేల వరకు అప్పు చేసేందుకు సిద్ధమయ్యాడు. అసలు నీళ్లుపడిన బోరు నుంచి ఎంత వరకు నీళ్లు వస్తాయి, అవి పంట సాగుకు సరిపోతాయో లేదో అనేది తెలియక ఆందోళన చెందుతున్నాడు. పక్కన ఉన్న సోదరుడి పొలం నుంచి మోటారు తీసుకెళ్లి పెట్టి పరీక్షిస్తున్నాడు. నీళ్లు సరిపోయే పరిస్థితి లేకపోతే.. ఇక వర్షాధార పంటలే దిక్కు అని వాపోతున్నాడు.
 
రెండెకరాలు ఉంటే 10 గుంటలే సాగు
పంగోనికుంట తండాకు చెందిన మహిళా రైతు మెగావత్‌ బోడికి 2 ఎకరాల భూమి ఉంది. గతంలో సాగర్‌ నీళ్లు విడుదల ఆలస్యమైన నేపథ్యంలో అందులో బోరు వేయించింది. కానీ అందులో నీళ్లు తక్కువగా పడ్డాయి. ఇటు సాగర్‌ నీరు రాక, అటు బోరులో నీళ్లు సరిగా లేక.. ఈసారి కేవలం 10 గుంటల్లో మాత్రమే వరి పంట వేసింది. మరికొంత భూమిలో కంది పంట వేసినా నీళ్లు లేక సరిగా ఎదగలేదు. బోరులోనూ నీళ్లు తగ్గిపోతుండడంతో.. సాగు చేసిన పంట కొంచమైనా చేతికివస్తుందో, లేదోనన్న ఆందోళనలో మునిగిపోయింది. ‘‘పంట ఏమో ఇట్ల ఉంది.. కూలి పనికి పోదామన్నా.. ఎక్కడా పని దొరకడం లేదు. సాగర్‌ నీళ్లే లేకుంటే బయట పని ఎలా దొరుకుతుంది..?’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఉన్న నీళ్లూ ఎండిపోతే..?
కొన్నేళ్లుగా సాగర్‌ నీటి కష్టాలు చూస్తున్న అనుముల మండలం హజారుగూడేనికి చెందిన చిమ్మట బాలసైదులు.. గతేడాది యాసంగిలో బావి తవ్వించాడు. బావికి, మోటారు, విద్యుత్‌ లైన్, పైపులకు కలిపి రూ.1.25 లక్షలు ఖర్చు చేశాడు. అతడికి నాలుగెకరాల పొలం ఉన్నా.. ఈ ఖరీఫ్‌లో మాత్రం ఎకరన్నరలోనే వరి వేశాడు. సాగర్‌లోకి నీళ్లు రాకపోతే సమీపంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో నీళ్లుండవని ముందే ఊహించి... తక్కువగా పంటసాగు చేశాడు. అయితే సాగర్‌కు నీళ్లు రాక ఈ బావిలోని నీళ్లు కూడా ఎండిపోతే.. పంటల సాగు పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement