నాగార్జునసాగర్
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ నీటి విడుదలపై ఎడమ కాల్వ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రెండు రోజులుగా కృష్ణాబేసిన్‌లో కురుస్తున్న వర్షాల వల్ల నీరు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నుంచి కూడా దిగువకు నీటిని వదులుతుండడంతో దిగువన ఉన్న జలాశయాల్లోకి కూడా నీరు చేరుతుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 522.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 17,226 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలోకి రాగానే దిగువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నందున రైతులు ఆశతో ఉన్నారు.
ఆల్మట్టి వైపు చూపు
కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌పైనే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ రైతుల ఆశలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మినహా అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి మట్టాలు ఉన్నాయి. వస్తున్న వర్షపు నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువకు వస్తున్న నీటి విషయంలో ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎంత మేరకు దిగువకు వదులుతున్నారనే విషయాన్ని ఆయకట్టు రైతులు ప్రతిరోజు పరిశీ లిస్తున్నారు.
ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 1705 అడుగు పూర్తిస్థాయి నీటి మట్టంకు గాను ప్రస్తుతం 1704.66 అడుగుల మేర నీరుంది. ప్రస్తుతం డ్యామ్‌లోకి 57,500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా దిగువకు 90,900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా నారాయణపూర్ ప్రాజెక్టులో 1615 అడుగులకు గాను 1614.27 అడుగుల మేర నీరుం డగా 90 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 92,680 క్యూసెక్కుల నీరు దిగువకు వదులు తున్నారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులోకి 30వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 44,621 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
తుంగభద్ర కు పెరిగిన వరద
తుంగభద్ర ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టులో 1633 అడుగులకు గాను 1632.30 అడుగుల నీరుంది. కాగా 1,12,671 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో దిగువకు 1,18,445 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 872 అడుగలు మేర నీరుంది.
కాగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 57,906 క్యూసెక్కుల నీరు చేరుతుండగా దిగువకు 24,851 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇంకా 13 అడుగుల నీరు చేరితే దిగువకు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలంకు ప్రాజెక్టులోకి వస్తున్న నీరు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కూడా ప్రస్తుతం వస్తున్న నీరు 17,226 క్యూసెక్కులు ఉండగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment