ఏదీ జలసిరి.. కరిగె తరి సిరి | There Is No Water In Nagarjun Sagar | Sakshi
Sakshi News home page

ఏదీ జలసిరి.. కరిగె తరి సిరి

Published Tue, Jul 17 2018 12:52 AM | Last Updated on Fri, Oct 19 2018 7:23 PM

There Is No Water In Nagarjun Sagar - Sakshi

నీళ్లు లేక కళ తప్పిన సాగర్‌ జలాశయం

నాగార్జునసాగర్‌ ఆయకట్టు నుంచి సాక్షి ప్రతినిధి బొల్లం శ్రీనివాస్‌ 
ఒకప్పుడు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు.. రైతుల్లో ‘సాగర’మంత ఆనందం.. తొలకరితోనే ఎరువాక సాగేవారు.. ఖరీఫ్, రబీ సీజన్లు వచ్చాయంటే బీడు భూములన్నీ పచ్చని పైర్లతో కళకళలాడేవి.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు! ఖరీఫ్‌ సీజన్‌ మొదలై నెల గడిచినా అన్నదాతలు దిక్కుతోచని స్థితిలోనే ఉన్నారు. వరుసగా రెండు కార్లు (పంటలు) నీళ్లందకపోవడంతో వేలాది మంది రైతులు బోర్లు, బావులకు లక్షలు ఖర్చు చేసి నీటి కోసం తిప్పలు పడుతున్నారు. నీళ్లు లేక వర్షాధార పంటల వైపు మొగ్గుతున్నారు. ఇక ఏ ఆదరువు లేని సన్న, చిన్నకారు రైతులు పట్టణాల్లో అడ్డా కూలీలుగా మారారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతుల దయనీయ స్థితి ఇదీ!! ఈ ఆయ కట్టు ‡రైతుల కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు. 

చి‘వరి’కి నిరాశే.. 
కృష్ణా నది బేసిన్‌లో నైరుతి వర్షాలు ఆలస్యమవుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో పడే వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండిన తర్వాతే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి నీళ్లు వస్తున్నాయి. సాగర్‌ నిండిన తర్వాత రబీలో ఆరుతళ్లకు నీరు విడుదలవుతుంది. నవంబర్, డిసెంబర్‌లో నీళ్లివ్వడంతో ఆయకట్టు చివరి భూములకు అందడం లేదు. ఒకప్పుడు వరి పండిన భూములు నీళ్లు లేక మెట్టగా మారాయి. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని తిరుమలగిరి, హాలియా, మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి, హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని పాలకీడు, నేరడుచర్ల మండలాల్లో వేలాది ఎకరాలు మెట్ట భూములుగా మారాయి. ఈ భూములకు ఇక నీళ్లు అందవని ఆయకట్టు రైతులు ఇప్పటికే పత్తి, కంది, పెసర సాగు చేశారు. ఆగస్టు నాటికి ప్రాజెక్టు నిండి ఖరీఫ్‌కు నీటిని విడుదల చేసినా ఈ భూములకు నీళ్లందడం లేదు. దీంతో రైతులు ఏటా మెట్ట పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఇలా నాడు తరి పంటలు వేసే భూములు మెట్ట పంటలకు నెలవయ్యాయి.  

బోర్లు, బావులకు లక్షల ఖర్చు 
ఆయకట్టుకు రెండు సీజన్లలో ఒకే పంటకు నీటిని విడుదల చేస్తుండడంతో రైతులు పంట సాగును వదులుకోలేక బోర్లు, బావులు తవ్విస్తున్నారు. పదేళ్లలో సాగర్‌ ఆయకట్టులో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు చూస్తే బోర్లు, బావుల కోసం రైతులు పడుతున్న పాట్లు స్పష్టమవుతోంది. 2004 ముందు ఆయకట్టులో 69,451 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,17,244కు చేరింది. అంటే పదిహేనేళ్లలో 47,793 కనెక్షన్లు పెరిగాయి. మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో 22,642 కనెక్షన్లు ఉంటే ఈ ఏడాది మార్చి నాటికి 51,337 కనెక్షన్లు అయ్యాయి. అలాగే కోదాడ డివిజన్‌ పరిధిలో 25,151 కనెక్షన్లుంటే ప్రస్తుతం 65,907 కనెక్షన్లకు చేరాయి. మిర్యాలగూడ, వేములపల్లి, నిడమనూరు, గరిడేపల్లి, నేరడుచర్ల, కోదాడ, మునగాల మండలాల్లో బోర్లు, బావుల తవ్వకం ఎక్కువగా ఉంది. మూడు, నాలుగు ఎకరాలున్న ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేస్తూ రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్, పైపులు, తవ్వకం అంతా కలిపి ఒక్కో బావికి రూ.లక్షపైనే ఖర్చు పెడుతున్నారు. 

మెట్ట సాగు చేసినా తరి కౌలు 
ఆయకట్టులో 2.50 లక్షల ఎకరాలు కౌలు కింద సాగవుతుంది. కొంత భూమి ఉన్న రైతులు, అసలు భూమి లేని వారు.. కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. వరి లేకపోతే మెట్ట పంటలు ఏవి వేసినా ఎకరానికి రూ.20 వేల చొప్పున రెండు సీజన్లు ఖరీఫ్, రబీకి రూ.40 వేలు చెల్లించాలి. భూములను కౌలుకు తీసుకునే రైతులు సాగర్‌ నీళ్లు వచ్చినా, రాకున్నా.. వర్షాధారంగా పంటలు వేసినా కౌలు మాత్రం తరి (వరి) సాగు ప్రకారం కట్టాలి. ఖరీఫ్‌ సీజన్‌లో ముందే పంట సాగు చేయకున్నా ఒక పంటకు కౌలు చెల్లించాలి. సాగర్‌ నీళ్లు వస్తాయనుకొని ఆశగా ఎదురుచూస్తున్న కౌలు రైతులు చివరకు నీళ్లు రాక పత్తి, కంది, పెసర పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలకు చీడపీడలు, పంట చేతికొచ్చే సమయంలో వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కష్టాలన్నింటనీ తట్టుకొని చేతికొచ్చిన పంటను అమ్మితే కౌలు, పంట నూర్పిడి ఖర్చులు పోను రోజు కూలైనా గిట్టుబాటు కావడం లేదు. 

పట్టణాల్లో అడ్డా కూలీలుగా రైతులు 
ఆయకట్టుకు నీళ్లు రాక రెండు, మూడెకరాలున్న సన్న, చిన్నకారు రైతులు పట్టణాల్లో అడ్డాకూలీలుగా మారుతున్నారు. మిర్యాలగూడ, హాలియా, హుజూర్‌నగర్, కోదాడ పట్టణాల్లో ఉదయం 8 గంటలకే రోజువారీ కూలీలతో వచ్చి పనుల కోసం ఎదురుచూస్తున్నారు. నీళ్లుంటే దుక్కులు దున్నడం, వరి నాట్లతో ఆయకట్టు కళకళలాడేది. కానీ పరిస్థితి తిరగబడటంతో రైతులు పట్టణాల బాట పడుతున్నారు. గ్రామాల్లో ఉంటే ఏ పని దొరకడం లేదని, కుటుంబం ఖర్చుల కోసమైనా అడ్డా కూలీలుగా మారుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పట్టణాల్లో భవన నిర్మాణ పనులకు వెళ్తే వీరికి.. ఒక్కొక్కరికి రూ.350 నుంచి రూ.400 వరకు కూలి ఇస్తున్నారు. 

అప్పు చేసి ట్రాక్టర్లు తెచ్చినా.. 
5 నుంచి 10 ఎకరాలు ఆపైన భూములున్న రైతులు ట్రాక్టర్లతో పంటలు సాగు చేస్తున్నారు. ఈ రైతులు తమ భూములు దున్నుకోవడంతోపాటు ట్రాక్టర్లు లేని రైతుల భూములు కూడా కిరాయికి దున్నుతారు. ట్రాక్టర్లకు బ్యాంకులు ఆర్థిక సహాయం అందిస్తున్నా మిగిలిన సొమ్ము అప్పుగా తెచ్చుకుంటున్నారు. చివరికి నీళ్లు రాక పంటల సాగు లేకపోవడంతో ట్రాక్టర్లు మూలకు పడి ఉంటున్నాయి. అప్పు పెరిగిపోతుందనుకుంటున్న కొందరు రైతులు మళ్లీ ట్రాక్టర్ల షోరూంలకే వాటిని అమ్మకానికి తీసుకెళ్తున్నారు. 

‘ఉత్తి’పోతలు 
సాగర్‌ ఆయకట్టు కింద ఉన్న ఎత్తిపోతలు ఉత్తిపోతలుగా మారుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎడమ కాల్వకు 49 ఎత్తిపోతల పథకాల పరిధిలో 90 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో నీటిని విడుదల చేస్తే వీటి పరిధిలో వరి సాగవుతుంది. ఖరీఫ్‌ లేదా రబీలో ఆరుతళ్లకు నీటిని విడుదల చేస్తే.. ఒక్కోసారి ఎత్తిపోతలకు నీళ్లివ్వడం లేదు. దీంతో ఎత్తిపోతల కింద చివరి భూములకు నీరందడం లేదు. చేసేది లేక ఎత్తిపోతల కింద రైతులు మెట్ట పంటల వైపు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో దోసపహాడ్‌ లిఫ్ట్‌ కింద 2 వేల ఎకరాల పైగా ఆయకట్టులో ఇప్పటికే 1,500 ఎకరాల్లో పత్తి, కంది, పెసర వంటి పంటలు సాగు చేశారు. 

ప్రాజెక్టు లక్ష్యం ఇదీ.. 

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో మొత్తం ఆయకట్టు 6,45,085 ఎకరాలు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో 1,56,456 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో 2,29,206 ఎకరాలు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో 2,59,423 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో జూలై, ఆగస్టు నాటికి సాగర్‌ నిండితే ఈ మాసాల్లోనే నీటిని విడుదల చేస్తారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం సామర్థ్యం 590 (312.05 టీఎంసీలు) అడుగులు. 550 అడుగుల వరకు నీరుంటే ఖరీఫ్‌కు నీటిని విడుదల చేస్తారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి ప్రవాహాలు లేకపోవడంతో ప్రస్తుతం సాగర్‌లో 511 అడుగులే నీరుంది. 

నాలుగేళ్లుగా నీళ్లు లేవు.. 

ఈ రైతు దంపతుల పేరు మాంకాళి లక్ష్మయ్య, కౌసల్య. వీరిది తిరుమలగిరి మండలం బడాయిగడ్డ గ్రామం. ఆయకట్టు కింద ఎకరం భూమి ఉంది. ఇందులో వరి పండితేనే వారికి తిండి గింజలు. వీరు సాగు చేస్తున్న భూమికి అల్వాల కాల్వ నుంచి నాలుగేళ్లుగా నీళ్లు రావడం లేదు. అంతకుముందు వరి పండించిన భూమిలో మెట్ట పంటలు సాగు చేస్తున్నారు. రెండేళ్లు పత్తి, ఒకేడు జొన్న, మరో ఏడు సజ్జలు సాగు చేశారు. ఇప్పుడు కూడా పత్తి వేశారు. నీళ్లు సక్రమంగా అందితే వరి పండేదని, కానీ ఇప్పుడు బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

నాలుగెకరాలు.. ఆరు బోర్లు 

సాగర్‌ నీళ్లు రావడం లేదని తిరుమలగిరి మండలం యల్లాపురం గ్రామానికి చెందిన కాంసాలి గోవింద్‌ తన నాలుగు ఎకరాల్లో ఆరు బోర్లు వేయించాడు. కేవలం రెండు బోర్లలో ఇంచు మేర నీళ్లు పడ్డాయి. వాటితో అరెకరం వరి సాగవుతుంది. మిగతా మూడున్నర ఎకరాలు పత్తి వేశాడు. బోర్లకు చేసిన రూ.2 లక్షల అప్పు ఎలా తీర్చాలని గోవింద్‌ సతమతమవుతున్నాడు. 

మూడెకరాల అడ్డా కూలీ 

ఈయన పేరు ధనావత్‌ సైదా. త్రిపురారం మండలం రాగడప గ్రామం. సాగర్‌ ఆయకట్టు కింద మూడెకరాల భూమి ఉన్న ఈయన ఇప్పుడు అడ్డాకూలీగా మారాడు. భూమి సాగు చేయాలంటే సాగర్‌ నీళ్లు రావాల్సిందే. ఇప్పట్లో నీళ్లొచ్చే అవకాశాలు లేకపోవడంతో మిర్యాలగూడలో అడ్డాకూలీకి వెళ్తున్నాడు. రోజు రూ.350 నుంచి రూ.400 వరకు కూలి వస్తుందని, ఇదీ లేకపోతే ఇంటి ఖర్చులు ఎలా గడుస్తాయని సైదా ఆవేదన వ్యక్తం చేశాడు. 

700 ఎకరాలు.. 250 బోర్లు

నేరడుచర్ల మండలంలోని నర్సయ్యగూడెం గ్రామంలో 150 కుటుం బాలకు 700 ఎకరాల భూమి ఉంది. సాగర్‌ నీళ్లు రావడం లేదని ఎనిమి దేళ్లుగా ఈ గ్రామంలోని రైతులు బోర్లు వేయించడంతోపాటు బావులు తవ్విస్తు న్నారు. ఇప్పటి వరకు 700 ఎకరాలకు 250 బోర్లు, 30 బావులు తవ్వించారు. విద్యుత్‌ సరఫరా, మెటార్లు, పైపులు వేయడం, బోర్లు, బావులు తవ్వించినం దుకు సుమారు ఈ గూడెం రైతులు రూ.1.55 కోట్లు ఖర్చు చేశారు. అయినా బోర్లలో నీరు లేక వరి చివరి వరకు పారడం లేదని రైతులు వాపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement