ఇప్పటికే మూడుచోట్ల గండి
చాలాచోట్ల దెబ్బతిన్న సాగర్ కాలువ లైనింగ్
2009లో పనులు చేపట్టినా అంతటా పూర్తి చేయకుండా వదిలేసిన వైనం
భారీగా నీరొస్తే ఎక్కడ గండి పడుతుందో తెలియని పరిస్థితి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ:
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం చెరువు వద్ద దాదాపు 100 మీటర్ల పొడవున నాగార్జునసాగర్ ఎడమ కాలువ దెబ్బతింది. అందులో సగం వరకు కట్ట కోతకు గురైంది. భారీగా ప్రవాహం వస్తే ఎప్పుడు కట్ట తెగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ముప్పారం 30/2వ కిలోమీటర్ వద్ద 50 మీటర్ల వరకు ఎడమ కాలువ లైనింగ్ పోయి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు తెగిపోతుందో తెలియదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితారామచంద్రపురం వద్ద కుంగిపోయిన వెంపలబోడు తూము. అధిక ప్రవాహం వస్తే ఎప్పుడు తూము తెగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ దుస్థితికి ఇవి కేవలం మూడు ఉదాహరణలు మాత్రమే. నల్లగొండ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లా వరకు 172 కిలోమీటర్ల పొడవున అనేక చోట్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితులే నెలకొన్నాయి. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. 2022లో నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద ఎడమ కాలువకు గండిపడటంతో వందల ఎకరాల్లో పంటలు పాడైపోయి రైతులు నష్టాలపాలయ్యారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు 25 రోజులపాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పంటలకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
నిర్లక్ష్యం కారణంగానే మళ్లీ గండ్లు
ఎడమ కాలువకు నిడమనూరు వద్ద గండి పడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే గండిపూడ్చి వదిలేసింది. నీటిపారుదల శాఖ కాలువ పొడవునా లైనింగ్ దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలని రూ.44 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదు. 2009లో ప్రపంచ బ్యాంకు ని«ధులు రూ.4,444 కోట్లతో ఎడమ, కుడి కాలువల ఆధునీకరణ (లైనింగ్, మరమ్మతులు) పనులు చేపట్టారు. అందులో ఎడమ కాలువ పనులను చేపట్టినా చాలావరకు పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో అవి మరింతగా దెబ్బతిన్నాయి.
ఈనెల 1వ తేదీన నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రంగులవంతెన వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పాలేరు వెనుక జలాల కారణంగా గండ్లు పడ్డాయి. రెండు చోట్ల 50 నుంచి 70 మీటర్ల పొడవునా కాలువ కట్ట కొట్టుకుపోయింది. పాలేరు వాగు నీటితోపాటు ఈ కాలువ నీరు కలిసి నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, వల్లాపురం, అనంతగిరి మండలం చనుపల్లి, పాలారం, కిష్టాపురం, కొత్తగూడెం, గోండ్రియాల, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మందడి నర్సయ్యగూడెం, చీతిలితండా, రాజపేట, ఈశ్వరమాదారం గ్రామాలను నీరు ముంచెత్తింది. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
పొంచి ఉన్న ప్రమాదం
ఎడమ కాలువ పొడవునా పలుచోట్ల లైనింగ్, కోతకు గురైన కాలువ కట్టలతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాద్గార్‌పల్లి మేజర్ పరిధిలోని మిర్యాలగూడ మండలం ఐలాపురం, వేములపల్లి మండలంలోని అన్నపరెడ్డిగూడెం మధ్య దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవునా లైనింగ్ దెబ్బతింది. నడిగూడెం మండలం రామాపురం, చాకిరాల, సిరిపురం, కాగితరామచంద్రాపురం గ్రామాల సమీపాన కాలువ కట్టలు దెబ్బతిన్నాయి.
నిడమనూరు మండలంలోని 32/2 వద్ద కాల్వ కరకట్ట లైనింగ్ పూర్తిగా తొలగిపోయి మట్టి పూర్తిగా కాల్వలోకి జారి ప్రమాదకరంగా మారింది. ముప్పారం బ్రిడ్జి వెంట లైనింగ్ పూర్తిగా ధ్వంసమై కట్ట బలహీనంగా మారింది. 30/4 కిలో మీటర్ వద్ద కాల్వ లైనింగ్ పూర్తిగా ధ్వంసమైంది. 29/6 కిలోమీటర్ వద్ద గుంటికగూడెం మేజర్ కాల్వ తూముకు ఇరువైపులా కాల్వ కట్ట లైనింగ్ పాడైపోయింది. ముకుందాపురం–దుగ్గెపల్లి బ్రిడ్జి వెంట లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. గరిడేపల్లి మండలం వెలిదండ సమీపంలో ఎడమ కాలువ కట్ట దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో కాలువ నీటిని వాగులు, చెరువుల్లోకి మళ్లించే ఎస్కేప్ కెనాల్స్ (నీటిని మళ్లించేవి)ను పట్టించుకోకపోవడం, పైగా వాటిని ఓపెన్ చేయరాకుండా వెల్డింగ్ చేసి పెట్టడంతో గండ్లు పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment