ఆందెమే నయం
ప్రత్యామ్నాయ సమయాల్లో మేలైన పంట
తక్కువ పెట్టుబడితో సాగు
పంట కాలం 120 నుంచి 240 రోజులు
త్వరలోనే సబ్సిడీపై విత్తనాల పంపిణీ
యాజమాన్య పద్ధతులపై ఏడీఏ శ్రావణ్‌కుమార్ సూచనలు
గజ్వేల్: ఈ ఏడాది జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు. వీటిలో ఒకటైన ఆముదం (ఆందెం) వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై ఈ విత్తనాలను అందజేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయి. కిలో విత్తనంపై రూ.25 రాయితీ ఇవ్వనున్నారు. తక్కువ పెట్టుబడితో ఆముదం పంటను పండించవచ్చు. దీని సాగు విశేషాలపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ రైతులకు అందించిన సలహాలు, సూచనలు...
ముఖ్యమైన అంశాలు
- నూనె గింజల పంటల్లో ఆముదం ఒకటి. ఈ విత్తనాల్లో 40-55శాతం చమురు కలిగి ఉంటుంది.
- తక్కువ తేమ కలిగిన ప్రాంతాల్లోనూ మంచి దిగుబడులను ఇస్తుంది.
- అన్ని రకాల నేలల్లో దీన్ని సాగుచేయవచ్చు.
- నీరు బాగా ఇంకిపోయే నేలలు అనుకూలమైనవి.
- హెక్టారుకు ఏడు కిలోల విత్తనం పడుతుంది. హైబ్రీడ్ రకాలైతే 5 కిలోలు సరిపోతాయి.
- వ్యవసాయశాఖ అధికారుల సూచనల ప్రకారం మేలైన వంగడాలు వాడాలి.
విత్తనశుద్ధి తప్పని సరి...
- కిలో విత్తనానికి 3గ్రాములు థైరమ్ లేదా కాఫ్టాన్ లేదా 2 గ్రాముల కార్బన్‌డిజమ్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి.
- దీనివల్ల విత్తనం ద్వారా సంక్రమించే మొలక ఆకులు మాడటం మరియు కొరివి లేక ఎండు తెగులును నివారించవచ్చు.
ఎరువుల వాడకం...
- మట్టి పరీక్షల ఆధారంగా తగినంత మోతాదులో ఎరువులను వాడాలి.
- విత్తనం వేసేందుకు రెండు లేక మూడు వారాల ముందు హెక్టారుకు 5 నుంచి 10 టన్నుల మేర బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి.
- అధిక నూనె దిగుబడి కోసం హెక్టారుకు 20కిలోల పాస్పరస్‌తో పాటు వర్షాధార పంటకు 40-60, 15-60, 15-30, కిలోల ఎన్‌పీకే మరియు నీటిసాగు పంటకు 80-120, 30-60, 30కిలోల ఎన్‌పీకే వాడాలి.
- సూక్ష్మపోషకాలైన జింక్ మరియు ఇనుము తక్కువగా ఉన్న నేలల్లో 10కిలోల జింక్ సల్ఫేట్ మరియు 30కిలోల ఫై సల్ఫేట్ వాడాలి.
నీటి యాజమాన్యం...
పంట నీటి పారుదలకు చక్కగా స్పందిస్తుంది. సుదీర్ఘమైన పొడి వాతావరణంలో మొదటి గెల దశ లేక రెండో గెల ప్రారంభంలో ఒకసారి నీరు అందిస్తే మంచి దిగుబడి వస్తుంది.
నేల స్వభావాన్ని బట్టి 10-15రోజుల వ్యవధిలో నీటి తడులను పెట్టాలి.
కలుపు, అంతర కృషి
పంట మొదటి దశలో కలుపు మొక్కల వల్ల ఎక్కువగా నష్టపోతుంది. కాబట్టి విత్తిన 20 రోజుల వ్యవధిలో కలుపుతీసి, 40రోజుల్లోపు రెండు లేదా మూడుసార్లు గుంటుక తోలాలి. కూలీలు దొరకని చోట్ల అలాక్లోర్ 2.5 లీ/హె గానీ ఫ్లూకోరలిన్ లేక ట్రైప్లురలిన్ 2లీ. హెక్టారుకు విత్తనం వేసిన మరుసటి రోజు నేల తడిచే విధంగా పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు.