కూసుమంచి : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించాలని, అధిక దిగుబడులు పొంందాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ చేరాలు అన్నారు. మండలంలోని పెరికసింగారం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే రైతు డ్రమ్‌సీడర్‌తో సాగు చేసిన వరి పంటలో శుక్రవారం క్షేత్రప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఈ పంటను పరిశీలించారు.
అనంతరం డాక్టర్ చేరాలు రైతులకు డ్రమ్‌సీడర్‌తో వరి సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. డ్రమ్‌సీడర్‌తో వరిని నాటడం వల్ల తడులు తక్కువగా అవసరం అవుతాయని, దిగుబడి కూడా ఎక్కువ ఉంటుందని అన్నారు. సస్యరక్షణ కోసం పెట్టుబడులు కూడా ఎక్కువ అవసరం ఉండవని అన్నారు. ఈ పద్ధతిలో సాగు చేసిన పంట మిగతా పద్ధతిలో వేసిన పంట కంటే పది రోజుల తక్కువ సమయంలో కోతకు వస్తుందని అన్నారు. కంకి పొడవు, గింజలు, నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.
డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరిని నాటిన రైతు శ్రీనివాసరావును మిగిలిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడి, ఎరువులు తక్కువ వేశానని రైతు శ్రీనివాసరావు వివరించారు. ఒక్కో కంకికి 200 గింజలు ఉన్నాయని, ధాన్యం కూడా నాణ్యంగా ఉందని రైతులకు వివరించారు. ఎకరాకు 45 బస్తాల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త బాలాజీనాయక్, హెచ్‌డీ డాక్టర్ శివాని, డాట్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్రాములు, డీడీఏ రత్నమంజుల, ఏడీఏ కొంగర వెంకటేశ్వర్లు, ఏఓ టి.అరుణజ్యోతి, ఏఈఓ .జయరాములు, రైతులు పాల్గొన్నారు.
రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి
Published Sat, Nov 15 2014 4:30 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement