సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేలా తుది ముసాయిదా నోటిఫికేషన్‌ను ఆ నదీ జలాల బోర్డు సిద్ధం చేసింది. ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులు బోర్డు అధీనంలోనే పని చేసేలా రూపొందించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం కేంద్రానికి పంపింది. దీన్ని కేంద్రం ఆమోదిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు కూడా బోర్డు పరిధిలోకి రానున్నాయి. ఇప్పటికే బోర్డు పరిధిని ఖరారు చేసే అధికారం రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తమకుం దని కేంద్రం కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో త్వరలో ఈ ఆమోదం ఉండొచ్చని తెలుస్తోంది.
దసరా తర్వాత నిర్ణయం..
కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ, ఏపీలు కొత్తగా చేపట్టిన, చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను తన పరిధిలోకి తెచ్చుకునేందుకు బోర్డు ఎప్పటినుంచో యత్నాలు చేస్తోంది. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వీలుగా ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాలని కేంద్రానికి విన్నవించింది. దీనిపై కేం ద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో శ్రీశైలం, సాగర్‌తో పాటు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, ఏఎమ్మార్పీలను తమ పరిధిలోకి తెచ్చుకుంటామని తెలుపుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను సిద్ధం చేసిన కృష్ణా బోర్డు ఇప్పటికే ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. గతంలో వెలువరించిన ట్రిబ్యునల్ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేసింది.
ప్రాజెక్టుల విద్యుదుత్పత్తిని సైతం తామే పర్యవేక్షిస్తామని పేర్కొంది. అయితే ఈ సమయంలోనే ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణను తెలంగాణ గట్టిగా వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం.. ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, నీటి లెక్కలు తేలాక, బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలని తేల్చిచెప్పింది. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటినుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమంటూ ఏపీ కేంద్రానికి లేఖలు సైతం రాసింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం సైతం మరో లేఖ రాసింది. తెలంగాణ రెండ్రోజుల కింద దీన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఘాటు లేఖ రాసింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగాకే నియంత్రణపై ముందుకెళ్లాలని, లేని పక్షంలో అడ్‌హక్‌గా ప్రస్తుతమున్న కేటాయింపులను మార్చి కృష్ణా జలాల పంపిణీని 50ః50 నిష్పత్తిన దామాషాలో చేపట్టాలని కోరింది. అయితే వీటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని బోర్డు.. కేంద్ర జల శక్తి శాఖ సూచనల మేరకు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకు నేలా ముసాయిదా నోటిఫికేషన్ ను కేంద్రా నికి నివేదించినట్లు తెలిసింది. దీనిపై దసరా తర్వాత కేంద్రం నిర్ణయం చేయనుంది.
రాష్ట్రాలకు చేరిన అపెక్స్ మినిట్స్..
ఇటీవలి అపెక్స్ కౌన్సిల్ భేటీకి సంబంధించిన మినిట్స్ కాపీలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేరినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మినిట్స్‌లోని అంశాలను ముఖ్యమంత్రులు పరిశీలించాక తుది ఆమోదం ఇస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. మినిట్స్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈఎన్‌సీ మురళీధర్‌తో శుక్రవారం చర్చించారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్న అంశాలు సానుకూలంగా ఉన్నా.. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తామని, కొత్త ప్రాజెక్టులు కేంద్ర అనుమతులు వచ్చే వరకు ఆపాలని ఉన్న అంశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో వీటిపై పూర్తిస్థాయిలో సమీక్షించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment