
మిగిలిన నీటితో పంటల పరిరక్షణ
15 రోజులకోసారి ఈఎన్‌సీల సమావేశం
తెలంగాణ, ఏపీలకు కృష్ణా బోర్డు స్పష్టీకరణ
తాము నెలకోసారి సమీక్షిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలిన నిల్వలను.. తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇస్తూ సాగు చేసిన పంటల పరిరక్షణకు జాగ్రత్తగా వాడుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. పంటల పరిరక్షణకు అవసరమైన నీళ్లు, వాటి వినియోగంపై ప్రతి 15 రోజులకోసారి ఈఎన్‌సీలు సమావేశమవుతూ.. పొదుపుగా నీటిని వాడుకోవాలని సూచించింది.
నెలకోసారి బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తామని, నీటి వినియోగంపై సమీక్షిస్తామని తెలిపింది. జూలై వరకూ ఇదే రీతిలో సమావేశాలు నిర్వహిస్తూ సమీక్షించడం ద్వారా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని పేర్కొంది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జలసౌధలో కృష్ణా బోర్డు రెండో అత్యవసర సమాశం జరిగింది.
తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ (జనరల్) అనిల్‌కుమార్, సీఈ రమేశ్‌బాబు, ఎస్‌ఈ విజయ్‌కుమార్, ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
సమర్థ వినియోగంపై దృష్టి పెట్టండి
వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ వాడుకుందని తెలంగాణ అధికారులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. అయితే శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేసి సముద్రంలో కలిసేలా చేసి వృథా చేసింది తెలంగాణానేనని ఏపీ అధికారులు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న బోర్డు చైర్మన్.. రెండు రాష్ట్రాలు ఉమ్మడి ప్రాజెక్టుల్లో మిగిలిన నీటి నిల్వలను సమర్థవంతంగా వాడుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు.
ఏపీకి 55, తెలంగాణకు 63 టీఎంసీలు అవసరమని సీఈల కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఉమ్మడి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టానికి ఎగువన 60 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి 16–20 టీఎంసీలను బోర్డు కేటాయించే అవకాశం ఉండగా, మిగిలిన నీళ్లు తెలంగాణకు కేటాయించనుందని సమావేశానంతరం అధికార వర్గాలు తెలిపాయి.
శ్రీశైలంపై ఎన్డీఎస్‌ఏ ఆరా
శ్రీశైలం జలాశయం ప్రమాదంలో ఉందంటూ తెలంగాణ ఈఎన్‌సీ రాసిన లేఖపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) స్పందించింది. ఏపీ ఈఎన్‌సీతో ఫోన్‌లో మాట్లాడిన సంస్థ చైర్మన్.. వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో మరమ్మతు పనులకు సంబంధించి సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు చెల్లించాల్సి ఉన్న బిల్లులను ఏపీ ప్రభుత్వం క్లియర్ చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ ప్రమాదంలో ఉందనే అంశాన్ని తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్ మరోసారి కృష్ణా బోర్డు సమావేశంలో ప్రస్తావించగా, ఏపీ అధికారులు పై వివరాలు తెలియజేశారు.
నీటి వినియోగంపై ఈఎన్‌సీల భేటీ
కృష్ణా బోర్డు బోర్డు సూచనల మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు సమావేశమయ్యారు. పంటల పరిరక్షణ కోసం సాగర్ కుడి కాలువ నుంచి 7 నుంచి 8 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 7 వేల క్యూసెక్కులు వాడుకోవాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాల విషయంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment