టెలీమెట్రీ పరికరాలు, నీటి కేటాయింపులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల నీటి వినియోగంపై చర్చించేందుకు ఈనెల 8న కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశం జరగ నుంది. బుధవారం ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు బోర్డు సమాచారం అందిం చింది. బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి లభ్యత, రాష్ట్రాలకు దక్కే వాటా, ఇప్పటి వరకు జరిగిన వినియోగం, డిమాండ్లు, టెలీ మెట్రీ పరికరాల అమరిక, ఏకే బజాజ్ కమిటీ రాష్ట్ర పర్యటన, పులిచింతలలో కనీస నీటి మట్టాల నిర్వహణ వంటి అంశాలపై ఈ సమా వేశంలో చర్చించనున్నారు.
బేసిన్ పరిధి లోని సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల, ఆర్డీఎస్, కేసీకెనాల్ తదితర ప్రాజెక్టుల పరిధిలో మొదటి విడతలో 18 చోట్ల, రెండో విడతలో 19 చోట్ల టెలీమెట్రీ పరికరాలను అమర్చాలని ప్రతిపాదిస్తోంది. ఇందులో మొదటి విడత 4 కోట్లు ఏపీ విడుదల చేయాల్సి ఉండగా, రెండో విడత టెలీమెట్రీపై ఇరు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది. కాగా, ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ 16 నుంచి రాష్ట్ర పర్యటనకు రానుంది. నిజానికి 6వ తేదీ నుంచి వారంపాటు రాష్ట్ర పర్యటన ఉంటుందని మొదట సమాచారమిచ్చినా పర్యటనలో మార్పులపై బుధవారం కమిటీ సభ్య కార్యదర్శి బోర్డుకు సమాచారం అందించారు.