ఏమి తేల్చెదరో ‘కృష్ణా’!
- హైదరాబాద్ చేరుకున్న ఏకే బజాజ్ కమిటీ
- పోలవరం, పట్టిసీమల ద్వారా కృష్ణాకు తరలిస్తున్న నీటి వాటాలను తేల్చనున్న కమిటీ
- నేడు తెలంగాణ,రేపు ఏపీ అధికారులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలకు వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించడం లక్ష్యంగా కేంద్ర జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ హైదరాబాద్ చేరుకుంది. సోమవారం తెలంగాణతో చర్చలు, మంగళవారం ఆంధ్ర ప్రదేశ్‌తో.. తర్వాత కృష్ణా బోర్డుతో వివిధ దఫాలుగా చర్చలు జరిపి తుది నివేదికను కేంద్రానికి అందజేయనుంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణాలో లభ్యతగా ఉన్న 2,130 టీఎంసీలలో ఉమ్మడి ఏపీకి 811, మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయింపులున్నాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటిలో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీలు వినియోగించుకునేలా ఒప్పందాలున్నాయి.
ఏపీ కొత్తగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తుండటంతో కొత్త సమస్య వచ్చి పడింది. పోలవరం, సహా ఏ ఇతర కొత్త ప్రాజెక్టు చేపట్టినా ఎగువ రాష్ట్రాలకు అంతే పరిమాణం వాటా కృష్ణా జలాల్లో దక్కుతుందని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు లో స్పష్టంగా ఉంది. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంతో ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటకలకు 35 టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు దక్కాయి. 35 టీఎంసీ ల్లో 14 టీఎంసీలు మహారాష్ట్రకు, కర్ణాటకకు 21 టీఎంసీలు దక్కుతాయి. ఏపీ, తెలంగా ణల మధ్య నీటి వాటాల విషయం మాత్రం తేలలేదు.
గతంలో అపెక్స్ ముందు ఇదే అంశమై వాదనలు వినిపించిన సమయంలో 80 టీఎంసీల కేటాయింపుల్లో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రకు దక్కినట్లే మిగతా 45 టీఎంసీలు ప్రస్తుతం ఎగువ రాష్ట్రమైన తమకే దక్కుతుందని తెలంగాణ తెలిపింది. ఏపీ పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరింది. దీనికి ఏపీ అడ్డు లగులుతోంది. బజాజ్ కమిటీ ఈ అంశాన్ని తేల్చాల్సి ఉంది. మరోవైపు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకు మార్గదర్శకాలతో వర్కింగ్ మాన్యువల్‌ను కమిటీ తయారు చేయాల్సి ఉంది. కృష్ణా బోర్డు తాను రూపొందించిన మ్యాన్యువల్ డ్రాఫ్ట్‌ను ఇప్పటికే బజాజ్ కమిటీకి అందజేసింది. వీటిపై ఇరు రాష్ట్రాలతో చర్చించి కమిటీ ఓ నిర్ణయం చేయాల్సి ఉంటుంది.