సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణపై రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌లో పలు అంశాలకు సవరణలు చేయాలని తెలంగాణ కోరుతోంది. ముఖ్యంగా బోర్డు చైర్మన్‌కు ఓటు హక్కు విషయంలో విచక్షణాధికారాలను వ్యతిరేకిస్తోంది.
చైర్మన్‌కు ఓటు వేసే హక్కు వద్దని, కేవలం రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు, సమన్వయం వరకే ఆయన అధికారాలు ఉండేలా మాన్యువల్‌లో మార్పులు చేయాలని సూచిస్తోంది. ఈ మేరకు మాన్యువల్‌లో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చించేందుకు నీటి పారుదల శాఖ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్‌కే జోషితో భేటీ అయ్యారు.
ఒక రాష్ట్రానికే ఒత్తాసు మంచిది కాదు...
కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ ప్రకారం చైర్మన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయి. ఓటు హక్కు కూడా ఉంటుంది. బోర్డు సమావేశంలో ఏదైనా ఒక అంశంపై ఓటింగ్ నిర్వహించినప్పుడు రెండు రాష్ట్రాలకూ సమానంగా ఓట్లు వస్తే చైర్మన్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే దీనిని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల అమలు వరకే బోర్డు చైర్మన్ వ్యవహరించాలని.. అలాకాకుండా ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా ఏదో ఒక రాష్ట్రానికి ఒత్తాసు పలకడం మంచిది కాదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.
బోర్డు పరిధిలో సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం లభించకుంటే అపెక్స్ కౌన్సిల్‌కు సిఫార్సు చేయాలని, అక్కడా పరిష్కారం కాకుంటే ట్రిబ్యునల్‌కు కేంద్రం సిఫార్సు చేస్తుందని పేర్కొంటోంది. ఇక బోర్డు వర్కింగ్ మాన్యువల్‌లో ప్రత్యేకంగా పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో ఉన్న హంద్రీనీవా, గాలేరు–నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగోడు, జూరాల ప్రాజెక్టులనే ప్రస్తావించి.. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులను విస్మరించారు. అలాగే గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులనూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 11వ షెడ్యూల్‌ను పట్టించుకోకూడదని తెలంగాణ కోరుతోంది.
ఇక ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో తెలం గాణ రాష్ట్రం విభేదిస్తోంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడి అమల్లోకి వచ్చేవరకూ బోర్డు పరిధిని నిర్ణయించరాదని పేర్కొంటూ తన వాదన సిద్ధం చేసింది. వీటికి సీఎస్ ఆమోదం తెలపడంతో ఒకట్రెండు రోజుల్లో అధికారులు తమ వినతులతో బోర్డుకు లేఖ రాయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment