Working Manual
-
కృష్ణా బోర్డుకు జవసత్వాలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి జవసత్వాలు చేకూర్చడానికి కేంద్రం సిద్ధమైంది. పరిధిని ఖరారు చేసి.. వర్కింగ్ మాన్యువల్ (కార్యనిర్వాహక నియమావళి)ని ఆమోదించడం ద్వారా బోర్డుకు పూర్తిస్థాయిలో అధికారాలు కల్పించాలని నిర్ణయించింది. తద్వారా కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూడవచ్చని భావిస్తోంది. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్)–2 తీర్పు నోటిఫై అయ్యేదాకా బోర్డు పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఖరారు చేయకూడదంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఆ తీర్పునకూ బోర్డు వర్కింగ్ మాన్యువల్‌కు సంబంధంలేదని స్పష్టీకరించింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వస్తే బోర్డు పరిధి విస్తృతమవడమే కాక.. విస్తృత అధికారాలు వస్తాయని.. బేసిన్ పరిధిలోని తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా బోర్డు పరిధిలోకి వస్తాయని కేంద్ర జల్‌శక్తి శాఖ వివరించింది. విభజన చట్టం ప్రకారం బోర్డు పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదించి.. అపెక్స్ కౌన్సిల్ భేటీ తర్వాత అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఆరేళ్లు పూర్తయిన తర్వాత.. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం ప్రకారం మే 28, 2014న కృష్ణా బోర్డు ఏర్పాటైంది. ♦కానీ, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణలో తలెత్తుతున్న ఇబ్బందులతో కృష్ణా బోర్డు పరిధి, వర్కింగ్ మాన్యువల్ ఖరారు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంటే, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగలేదని.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వచ్చాక బోర్డు వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదిస్తే తమకు అభ్యంతరం లేదంటూ చెబుతోంది. ♦వాస్తవానికి పరిధిని ఖరారు చేయకపోవడం.. వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదించకపోవడంవల్ల బోర్డుకు అధికారాలు లేకుండాపోయాయి. దాంతో బోర్డు ఉత్తర్వులకు విలువ లేకుండాపోతోందని, విభేదాలను పరిష్కరించడం కష్టమవుతోందని కేంద్ర జల్‌శక్తి శాఖ భావిస్తోంది. ♦ఈ నేపథ్యంలో.. జనవరి 21న ఏపీ, తెలంగాణ జలవనరుల అధికారులు, కృష్ణా బోర్డు చైర్మన్‌తో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఖరారుచేస్తామని.. వీటికి, కేడబ్ల్యూడీటీ–2 తీర్పునకూ సంబంధం లేదని స్పష్టంచేశారు. వీటిపై అపెక్స్ కౌన్సిల్ భేటీ తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
అపెక్స్ కౌన్సిల్ భేటీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివాదంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సిద్ధమయ్యారు. ఇదే అంశంపై సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్కే జైన్ తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి షెకావత్‌కు సీడబ్ల్యూసీ అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లు సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక పంపినట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులను కొత్తగా ప్రాజెక్టులుగా పరిగణించాలని సీడబ్ల్యూసీ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఈనెల 10లోగా ఇవ్వాలని ఆదేశించినట్లు బోర్డుల చైర్మన్లు నివేదికలో పేర్కొన్నారని మంత్రికి సీడబ్ల్యూసీ అధికారులు వివరించారు. ఇరు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇచ్చాక.. వాటిని పరిశీలించి నివేదిక ఇస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లతో చర్చించి.. అపెక్స్ కౌన్సిల్‌కు ఎజెండాను సిద్ధం చేయాలని సీడబ్ల్యూసీ అధికారులను కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ఆదేశించినట్లు సమాచారం. ఎజెండా సిద్ధమయ్యాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి.. వారి వీలును బట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి షెకావత్ నిర్ణయించినట్లు సీడబ్ల్యూసీ అధికారవర్గాలు తెలిపాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లకుండా తాను జారీ చేసిన ఉత్తర్వులను ఇరు రాష్ట్రాలు అమలు చేసేలా చూడాలని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను మంత్రి షెకావత్ మరోసారి ఆదేశించినట్లు వెల్లడించాయి. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, వర్కింగ్ మాన్యువల్ ఆమోదం తదితర అంశాలపై మంగళవారం వాటి చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్ తదితరులతో మంత్రి షెకావత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. -
ప్రాజెక్టులపై పెత్తనమెవరికి?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవాలా? లేక రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలా అన్నది తేలే సమయం ఆసన్నమయింది. ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఇరు రాష్ట్రాల ఉద్యోగులూ బోర్డు అధీనంలోనే పని చేసేలా గతంలో రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌పై ఈ నెల 8న జరుగనున్న కృష్ణాబోర్డు భేటీలో కీలక చర్చ జరుగనుంది. ప్రాజెక్టుల నియంత్రణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో బోర్డు మెట్టు దిగుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా ఉంది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డులు ఎప్పటినుంచో కోరుతోంది. దీంతో పాటే ఇప్పటికే నీటి వినియోగం జరుగుతున్న ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటామని చెబుతోంది. తమ పరిధిలో ఉంటేనే పర్యవేక్షణ సులువవుతుందని అంటోంది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి బోర్డుపెత్తనమే మేలని చెబుతూ వస్తోంది. దీంతో రేపు జరిగే భేటీ కీలకం కానుంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య 34ః66గా ఉన్న నీటి వినియోగ వాటాను 50ః50గా చేయాలని తెలంగాణ కోరే అవకాశం ఉంది. దీనిపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
చైర్మన్‌కు విచక్షణాధికారం వద్దు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణపై రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌లో పలు అంశాలకు సవరణలు చేయాలని తెలంగాణ కోరుతోంది. ముఖ్యంగా బోర్డు చైర్మన్‌కు ఓటు హక్కు విషయంలో విచక్షణాధికారాలను వ్యతిరేకిస్తోంది. చైర్మన్‌కు ఓటు వేసే హక్కు వద్దని, కేవలం రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు, సమన్వయం వరకే ఆయన అధికారాలు ఉండేలా మాన్యువల్‌లో మార్పులు చేయాలని సూచిస్తోంది. ఈ మేరకు మాన్యువల్‌లో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చించేందుకు నీటి పారుదల శాఖ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషితో భేటీ అయ్యారు. ఒక రాష్ట్రానికే ఒత్తాసు మంచిది కాదు... కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ ప్రకారం చైర్మన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయి. ఓటు హక్కు కూడా ఉంటుంది. బోర్డు సమావేశంలో ఏదైనా ఒక అంశంపై ఓటింగ్ నిర్వహించినప్పుడు రెండు రాష్ట్రాలకూ సమానంగా ఓట్లు వస్తే చైర్మన్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే దీనిని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల అమలు వరకే బోర్డు చైర్మన్ వ్యవహరించాలని.. అలాకాకుండా ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా ఏదో ఒక రాష్ట్రానికి ఒత్తాసు పలకడం మంచిది కాదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. బోర్డు పరిధిలో సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం లభించకుంటే అపెక్స్ కౌన్సిల్‌కు సిఫార్సు చేయాలని, అక్కడా పరిష్కారం కాకుంటే ట్రిబ్యునల్‌కు కేంద్రం సిఫార్సు చేస్తుందని పేర్కొంటోంది. ఇక బోర్డు వర్కింగ్ మాన్యువల్‌లో ప్రత్యేకంగా పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో ఉన్న హంద్రీనీవా, గాలేరు–నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగోడు, జూరాల ప్రాజెక్టులనే ప్రస్తావించి.. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులను విస్మరించారు. అలాగే గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులనూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 11వ షెడ్యూల్‌ను పట్టించుకోకూడదని తెలంగాణ కోరుతోంది. ఇక ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో తెలం గాణ రాష్ట్రం విభేదిస్తోంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడి అమల్లోకి వచ్చేవరకూ బోర్డు పరిధిని నిర్ణయించరాదని పేర్కొంటూ తన వాదన సిద్ధం చేసింది. వీటికి సీఎస్ ఆమోదం తెలపడంతో ఒకట్రెండు రోజుల్లో అధికారులు తమ వినతులతో బోర్డుకు లేఖ రాయనున్నారు. -
ప్రాజెక్టుల నియంత్రణ పక్కకు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకునేం దుకు కృష్ణా బోర్డు చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకునేలా రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌పై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తడం, నీటి వాటాల భయంతో ఆంధ్ర ప్రదేశ్ పెద్దగా అడ్డుపడక పోవడంతో కృష్ణా బోర్డు వెనక్కి తగ్గింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం పక్కకు జరిగినట్లేనని రాష్ట్ర నీటిపారు దల వర్గాలు చెబుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన కృష్ణాబోర్డు సమావేశంలో ప్రాజెక్టుల వర్కింగ్ మాన్యువల్‌పై వాడీవేడి చర్చ జరిగింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు లతో పాటు హంద్రినీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లు కూడా బోర్డు నియం త్రణలో ఉంటాయని తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొం దించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా నియంత్రణలు ఉంటాయని తెలుప గా, తెలంగాణ వ్యతిరేకించింది. రాష్ట్ర పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక కేవలం బోర్డు వీటి నిర్వహణనే చూడాలని స్పష్టం చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న సాగర్, శ్రీశైలం కింద వాటాలను ఎలా తేలుస్తారని ప్రశ్నించింది. ట్రిబ్యునల్ కేటాయించిన ఎన్ బ్లాక్ కేటాయింపులకు అనుగుణంగానే పంపి ణీ జరగాలని, అంతకుమించి ఇతర ప్రత్యామ్నాయాలేవీ ఒప్పుకోమని స్పష్టం చేసింది. దీన్ని ఏపీ వ్యతిరేకించింది. దీనికి సమాధానంగా ఇప్పటికే ఉన్న కేటాయింపుల మేర పక్కాగా, పారదర్శకంగా నీటి వినియో గం జరిగేందుకు టెలీమెట్రీ పరికరాలను సైతం ఏర్పాటు చేస్తుండగా, మళ్లీ ప్రాజెక్టుల నియంత్రణ అవసరం ఏంటని తెలంగాణ ప్రశ్నించింది. ఏపీలో ఉన్న గురురాఘవేంద్ర తదితర లిఫ్టులు, వెలిగొండ టన్నెల్, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలిగోడు, శ్రీశైలం ఆఫ్ టేక్–1, శ్రీశైలం ఆఫ్ టేక్–2, చిన్న ముక్కపల్లి ఆఫ్ టేక్, సోమశిల కండలేరు లింక్, కండ లేరు–పూండి, పూండి ఆఫ్ టేక్ (ఏపీ తమిళ నాడు సరిహద్దు), శ్రీశైలం ఫోర్ షోర్ దగ్గర ఇతర లిఫ్టులు, ఏఎమ్ఆర్పీ ఆఫ్ టేక్‌ల కింద సైతం టెలీమెట్రీ ఏర్పాటు చేయాలని కోరింది. ఈ అంశంతో పాటు, లభ్యత జలాలపై తెలం గాణ పట్టుబడితే తమకు అసలుకే నష్టం వస్తుందన్న ఆందోళన సైతం ఏపీని వెనక్కి తగ్గేలా చేసింది. దీంతో బోర్డుసైతం ఈ అంశం పై మళ్లీ చర్చిద్దామని వాయిదా వేసింది. దీం తో ప్రస్తుతానికి నియంత్రణ అంశం మరుగు న పడినట్లేనని తెలంగాణ స్పష్టం చేస్తోంది.