కృష్ణా బోర్డుకు జవసత్వాలు | Center Has Decided To Approve The Krishna Board Working Manual | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డుకు జవసత్వాలు

Published Fri, Aug 7 2020 8:21 AM | Last Updated on Fri, Aug 7 2020 8:21 AM

Center Has Decided To Approve The Krishna Board Working Manual - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి జవసత్వాలు చేకూర్చడానికి కేంద్రం సిద్ధమైంది. పరిధిని ఖరారు చేసి.. వర్కింగ్‌ మాన్యువల్‌ (కార్యనిర్వాహక నియమావళి)ని ఆమోదించడం ద్వారా బోర్డుకు పూర్తిస్థాయిలో అధికారాలు కల్పించాలని నిర్ణయించింది. తద్వారా కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూడవచ్చని భావిస్తోంది. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌)–2 తీర్పు నోటిఫై అయ్యేదాకా బోర్డు పరిధి, వర్కింగ్‌ మాన్యువల్‌ను ఖరారు చేయకూడదంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఆ తీర్పునకూ బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌కు సంబంధంలేదని స్పష్టీకరించింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వస్తే బోర్డు పరిధి విస్తృతమవడమే కాక.. విస్తృత అధికారాలు వస్తాయని.. బేసిన్‌ పరిధిలోని తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా బోర్డు పరిధిలోకి వస్తాయని కేంద్ర జల్‌శక్తి శాఖ వివరించింది. విభజన చట్టం ప్రకారం బోర్డు పరిధి, వర్కింగ్‌ మాన్యువల్‌ను ఆమోదించి.. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ తర్వాత అమల్లోకి తేవాలని నిర్ణయించింది.

ఆరేళ్లు పూర్తయిన తర్వాత..
కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం ప్రకారం మే 28, 2014న కృష్ణా బోర్డు ఏర్పాటైంది.
కానీ, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణలో తలెత్తుతున్న ఇబ్బందులతో కృష్ణా బోర్డు పరిధి, వర్కింగ్‌ మాన్యువల్‌ ఖరారు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంటే, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగలేదని.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వచ్చాక బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ను ఆమోదిస్తే తమకు అభ్యంతరం లేదంటూ చెబుతోంది.
వాస్తవానికి పరిధిని ఖరారు చేయకపోవడం.. వర్కింగ్‌ మాన్యువల్‌ను ఆమోదించకపోవడంవల్ల బోర్డుకు అధికారాలు లేకుండాపోయాయి. దాంతో బోర్డు ఉత్తర్వులకు విలువ లేకుండాపోతోందని, విభేదాలను పరిష్కరించడం కష్టమవుతోందని కేంద్ర జల్‌శక్తి శాఖ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో.. జనవరి 21న ఏపీ, తెలంగాణ జలవనరుల అధికారులు, కృష్ణా బోర్డు చైర్మన్‌తో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో పరిధి, వర్కింగ్‌ మాన్యువల్‌ను ఖరారుచేస్తామని.. వీటికి, కేడబ్ల్యూడీటీ–2 తీర్పునకూ సంబంధం లేదని స్పష్టంచేశారు. వీటిపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement